ఎలక్టోరల్ బాండ్లతోనే బ్లాక్​మనీ కట్టడి.. నా మనసుకు నచ్చిన ఆలోచనే ఈ స్కీమ్ : మోదీ

ఎలక్టోరల్ బాండ్లతోనే బ్లాక్​మనీ కట్టడి.. నా మనసుకు నచ్చిన ఆలోచనే ఈ స్కీమ్ : మోదీ
  • అపోజిషన్ పార్టీలది అసత్య ప్రచారం: మోదీ
  • లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకుంటాం
  • బాండ్ల రద్దుతో నిజాయితీపరులు బాధపడ్తరు
  • మేము రాజ్యాంగాన్ని మారుస్తామనే భయం వద్దు
  • దేశానికి నేను చేయాల్సింది చాలా ఉంది
  • ఇది ట్రైలర్ మాత్రమే.. అసలు అభివృద్ధి ముందుంది
  • ఎవరు పెట్టుబడులు పెట్టినా.. ఇక్కడోళ్లకే ఉద్యోగాలు
  • ‘ఏఎన్ఐ’ ఇంటర్వ్యూలో ప్రధాని వెల్లడి

న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల విషయంలో అపోజిషన్ పార్టీలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. ఎన్నికల్లో నల్ల ధన ప్రవాహాన్ని అడ్డుకునేందుకే ఈ స్కీమ్ తీసుకొచ్చామని తెలిపారు. తాము కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచే బ్లాక్​మనీకి వ్యతిరేకంగా పోరాడుతున్నామన్నారు. 

అలా అని.. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎలక్టోరల్ బాండ్లే సరైన మార్గమని తాను ఎన్నడూ చెప్పలేదన్నారు. బ్లాక్ మనీకి అడ్డుకట్ట వేసేందుకు తన మనసుకు వచ్చిన స్పచ్ఛమైన ఆలోచనే ‘ఎలక్టోరల్‌‌‌‌‌‌‌‌ బాండ్లు’ అని చెప్పారు. సోమవారం ‘ఏఎన్ఐ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడారు. ‘‘ఎన్నికలు వచ్చాయంటే చాలా మంది లీడర్లు బ్లాక్ మనీ బయటికి తీసి లెక్కకు మించి ఖర్చుపెడ్తున్నారు. మరికొందరు క్రిమినల్ యాక్టివిటీస్​కి కూడా నల్లధనాన్నే ఉపయోగిస్తున్నారు. వీటన్నింటిని అడ్డుకోవాలనే ఎలక్టోరల్ బాండ్లు తీసుకొచ్చాం. 

అన్ని పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో డబ్బులు భారీగా ఖర్చుపెడ్తారు. మా పార్టీ అభ్యర్థులు కూడా ఖర్చుపెడ్తరు. దీన్ని ఎవరూ ఖండించలేరు.. అయితే, ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు కచ్చితంగా లోటుపాట్లు ఉంటాయి. వాటిపై చర్చించి మెరుగుపర్చుకుంటాం. ఎలక్టోరల్ బాండ్ల విషయంలోనూ ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకునేందుకు అవకాశం ఉంది. కానీ.. ఎలక్టోరల్ బాండ్ల రద్దుతో నిజాయితీపరులు బాధపడ్తరు’’అని మోదీ అన్నారు.

ప్రణాళికలన్నీ నా దగ్గురున్నయ్

సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400కు పైగా స్థానాల్లో గెలిచి అధికారంలోకి వస్తుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తదని అపోజిషన్ పార్టీల ఆరోపణలపై ఆయన స్పందించారు. ‘‘దేశ భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు నా దగ్గరున్నయ్. మోదీ సర్కార్ రాజ్యాంగాన్ని మారుస్తదంటూ కొన్ని పార్టీలు విమర్శిస్తున్నాయి. 

వాటిని పట్టించుకోకండి. ఎవరూ భయపడొద్దు. ఏ వర్గాన్నీ అణిచివేయడం, భయపెట్టే నిర్ణయాలు తీసుకోవడం మా ఉద్దేశం కాదు. నా దేశ సంపూర్ణ అభివృద్ధి కోసం నిర్ణయాలు తీస్కుంట”అని మోదీ అన్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామంటూ కొన్ని ప్రభుత్వాలు ప్రచారం చేసుకుంటాయని, వాటిని నమ్మనని మోదీ అన్నారు. తాను ఏది చేసినా.. అందరికి మేలు జరిగేలా ఉంటుందని తెలిపారు. దేశానికి ఇంకా చేయాల్సింది చాలా ఉందని చెప్పారు. ఇది ట్రైలర్ మాత్రమే అని, దేశంలోని ప్రతి కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

15లక్షల మంది అభిప్రాయాలు తీసుకున్నం

2047 వికసిత్ భారత్ లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని మోదీ తెలిపారు. దీని కోసం గత రెండేండ్లుగా కష్టపడ్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు, మేధావుల సలహాలు, సూచనలు తీసుకున్నామని చెప్పారు. వచ్చే 25 ఏండ్లలో దేశాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో తెలుసుకునేందుకు 15లక్షల మంది ప్రజల సలహాలు తీసుకున్నామని తెలిపారు. ‘‘యూనివర్సిటీలు, ఎన్జీవోలతో పాటు స్వచ్ఛంద సంస్థల నుంచి ఇన్​పుట్స్ తీసుకున్నాం. వాటన్నింటినీ ఏఐ సహాయంతో సబ్జెక్ట్ వారీగా డివైడ్ చేశాం. ప్రతి శాఖలో ప్రత్యేక అధికారుల బృందాన్ని ఏర్పాటు చేశాం. మూడో అధికారంలోకి వచ్చాక ఏం చేయాలో నిర్ణయించుకున్నాం. సుమారు మూడు గంటలు కూర్చొని ఫైనల్ ప్రజెంటేషన్ చూశాను’’అని మోదీ తెలిపారు. 

56 ఏండ్లలో కాంగ్రెస్ చేసిందేమీ లేదు

కాంగ్రెస్​ది ఫెయిల్యూర్ మోడల్ అని, పదేండ్లు అధికారంలో ఉన్న బీజేపీనే ప్రజలందరూ ఆదరిస్తారని మోదీ అన్నారు. 56 ఏండ్లు కాంగ్రెస్​ అధికారంలో ఉన్నదని, దేశాన్ని అభివృద్ధి చేయలేదని విమర్శించారు. పదేండ్ల బీజేపీ పాలనలో 56 ఏండ్ల అభివృద్ధి జరిగిందన్నారు. ప్రతిపక్ష పార్టీల్లా తాము కుటుంబ రాజకీయాలు చేయడం లేదన్నారు. ‘‘మా పార్టీ ‘కుటుంబం ద్వారా, కుటుంబం కోసం’అనే విధానాన్ని అనుసరించడం లేదు. కార్యకర్త నుంచి నేత వరకు ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వడమే బీజేపీ ఎజెండా. మాకు కుటుంబ ఆధారిత పార్టీల్లేవు. ప్రతిపక్షాల తరహాలో కుటుంబం ద్వారా, కుటుంబం కోసం అని కాకుండా బీజేపీలో ప్రతి ఒక్కరికీ అవకాశం లభిస్తుంది’ అని స్పష్టం చేశారు. దేశం బలంగా ఉన్నప్పుడే ప్రతిఒక్కరూ దాని ప్రయోజనాలు పొందుతారన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో దేశంలోని యువ ఓటర్ల ఆకాంక్షలను విఫలం చేసిందని విమర్శించారు. 

ఎలాన్ మస్క్.. ఇండియాకు మద్దతుదారు

ఇండియాకు పెట్టుబడులు రావాలని తానూ కోరుకుంటున్నట్టు మోదీ తెలిపారు. ‘‘ఇక్కడ ఎవరు పెట్టుబడి పెట్టారనేది ముఖ్యం కాదు. కానీ, తయారీ రంగంలో మనోళ్లే ఉండాలి. మన మాతృభూమి ప్రత్యేకత ఉండాలి. అప్పుడే మన యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి’’అంటూ ‘టెస్లా’ ఎంట్రీపై పరోక్షంగా కామెంట్లు చేశారు. మోదీ మద్దతుదారునంటూ మస్క్ చెప్పారని, వాస్తవానికి ఆయన ఇండియాకు మద్దతుదారు అని అన్నారు. 

2015లోనే తాను టెస్లా ఫ్యాక్టరినీ సందర్శించానని మోదీ తెలిపారు. ఎలాన్ మస్క్ తన కార్యక్రమాలు రద్దు చేసుకుని ఫ్యాక్టరీ మొత్తం చూపించారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా పలు కీలక విషయలపై చర్చించారని తెలిపారు. అదేవిధంగా, వన్​నేషన్ వన్ ఎలక్షన్, 100 డేస్ ప్లాన్, లాంగ్ టర్మ్​ ప్లాన్స్, మోదీ కీ గ్యారంటీ, ఇండిపెండెంట్ ఇండియా అంశాలపై మోదీ మాట్లాడారు. ఈడీ, సీబీఐతో కేంద్రం ప్రతీకార దాడులు చేయిస్తున్నదన్న ప్రతిపక్షాల ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.

అపొజిషన్ పార్టీలకు 63శాతం విరాళాలు

ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీకి వేల కోట్ల రూపాయలు వచ్చాయంటూ అపోజిషన్ పార్టీలు చేస్తున్న ఆరోపణలపై కూడా ప్రధాని మోదీ స్పందించారు. ‘‘ఎన్నికల బాండ్ల ద్వారా బ్లాక్ మనీ జాడ దొరుకుతుంది. ఏ కంపెనీ.. ఎంత ఇచ్చింది? ఏవిధంగా ఇచ్చింది? ఎలా ఇచ్చింది? అంతా చెప్తాం. కానీ.. అపోజిషన్ పార్టీల ఆరోపణలను మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. బీజేపీ అతిపెద్ద లబ్ధిదారు అంటూ విమర్శించడం సరికాదు. 26 కంపెనీలు ఈడీ, సీబీఐ వంటి ఏజెన్సీలతో మనీలాండరింగ్ కేసులు ఎదుర్కొంటున్నాయి. ఈ 26 కంపెనీల్లోంచి 16 సంస్థలు ఎలక్టోరల్ బాండ్లు తీసుకున్నాయి. ఈ సంస్థల నుంచి 37శాతం విరాళాలు బీజేపీకి వచ్చాయి. 63 శాతం ఫండ్స్ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న అపోజిషన్ పార్టీలకు వెళ్లాయి. వాళ్లు ఆరోపణలు చేస్తున్నట్టు.. మేమూ ఆ పార్టీలపై విమర్శలు చేయొచ్చు.. కానీ, మేము అలా చేయడం లేదు. 63 శాతం విరాళాల అంశాన్ని పక్కదారి పట్టించేందుకే అపోజిషన్ పార్టీలన్నీ మాపై విమర్శలు చేస్తున్నయ్’’అని మోదీ అన్నారు.