సమాజానికి మంచి చేసిన సామాన్యులకూ పద్మ అవార్డులు

సమాజానికి మంచి చేసిన సామాన్యులకూ పద్మ అవార్డులు

పిల్లలకు క్రీడా పోటీలతో పాటూ సూర్య నమస్కారాల పోటీలు కూడా నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. అలాగే సమాజానికి మంచి చేసిన సామాన్యులకు కూడా పద్మ అవార్డులను బీజేపీ ప్రభుత్వం అందిస్తోందని ఆయన అన్నారు. ఈ ఏడాది పద్మ అవార్డులు అందుకున్న సామాన్యులతో లైవ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయాలని ప్రధాని సూచించారన్నారు. ఇవాళ ఉదయం ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు పాల్గొన్నారు. ఆదివాసీ యోధుడు బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని నవంబర్ 15న జంజాతియా గౌరవ్ దివస్‌గా నిర్వహించి ఆయన చిరస్మరణీయుడిగా మిగిలిపోయేలా నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని మోడీకి ఈ సమావేశంలో పలువురు నేతలు సన్మానం చేశారు. పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిశాక కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలను గురించి వివరించారు. యూపీలోని పార్టీ జిల్లాల అధ్యక్షులు, మండల అధ్యక్షులను డిసెంబర్ 14న కాశీలో సమావేశానికి పిలవనున్నట్లు మోడీ చెప్పారన్నారు.

క్షమాపణ చెబితే ఇయ్యాల్నే సస్పెన్షన్ ఎత్తేస్తం

రాజ్యసభ నుంచి 12 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేసిన అంశంపైనా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చ జరిగిందని ప్రహ్లాద్ జోషి చెప్పారు. వర్షాకాల సమావేశాల సందర్భంగా ఆ ఎంపీలు సభా నియమాలను ఉల్లంఘించి, ఎంత ఘోరంగా ప్రవర్తించారన్నది దేశమంతా చూసిందని, వాళ్లు చేసినదంతా రికార్డ్స్‌లో ఉందని అన్నారు. నాడు జరిగిన దానికి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ ఆ 12 మంది ఎంపీలు క్షమాపణ చెబితే ఇవాళే వాళ్లపై సస్పెన్షన్ ఎత్తేసి సభలోకి అనుమతిస్తామని చెప్పారు.