నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని

నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని

ఢిల్లీ: స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరంచుకుని ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఆయన హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 28 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పు కలిగిన ఈ హోలోగ్రామ్ స్టాచ్యూ 30వేల ల్యూమెన్స్ 4కె ప్రొజెక్టర్ తో పనిచేస్తుంది. పారదర్శకమైన హోలోగ్రాఫిక్ స్క్రీన్ ను సందర్శకులకు కనిపించని విధంగా ఏర్పాటు చేశారు. నేతాజీ 125వ జయంతిని పురస్కరించుకుని కేంద్రం ఏడాది పాటు వేడుకలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నేతాజీ పోరాటం, పరాక్రమానికి గుర్తుగా ఇండియా గేట్ వద్ద గ్రానైట్ తో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే గ్రానైట్ విగ్రహం పనులు పూర్తయ్యే వరకు హోలోగ్రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రధాని ప్రకటించారు.

నేతాజీ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ 2019, 2020, 2021, 2022 సంవత్సరాలకుగానూ ఏడుగురికి సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ ను కూడా అందించారు. విపత్తు నిర్వహణ రంగంలో సహకారం అందించిన వివిధ వ్యక్తులు, సంస్థలకు అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డు కింద సంస్థలకు రూ.51 లక్షల నగదు బహుమతితో పాటు సర్టిఫికెట్, వ్యక్తులకు రూ.5 లక్షలు, ప్రశంసాపత్రం అందజేశారు.