పుణెలో మెట్రో రైలు సేవలు ప్రారంభించిన మోడీ

పుణెలో మెట్రో రైలు సేవలు ప్రారంభించిన మోడీ

పుణె : మహారాష్ట్రలో రెండో అతిపెద్ద సిటీ పుణెలో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రధాని నరేంద్రమోడీ పుణె మెట్రో రైల్ ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించారు. గర్వారే మెట్రో స్టేషన్లో జెండా ఊపి రైలు సేవలను ప్రారంభించిన మోడీ.. టికెట్ కొనుక్కుని మరీ మెట్రోలో ప్రయాణించారు. గ‌ర్వారే మెట్రో స్టేష‌న్ నుంచి ఆనంద్ న‌గ‌ర్ స్టేష‌న్ వ‌ర‌కు ప్రయాణికులతో కలిసి వెళ్లారు. మెట్రో రైలు రాక‌తో పుణెలో అర్బ‌న్ మొబిలిటీ కోసం అంత‌ర్జాతీయ శ్రేణి మౌలిక ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చినట్లయింది. రూ. 11,440 కోట్ల వ్యయంతో 2016 డిసెంబ‌ర్ 24న ఈ మెట్రో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. మొత్తంగా 32.2 కిలోమీట‌ర్ల ప‌రిధిలో మెట్రో రైల్ నిర్మిస్తుండగా.. ప్రస్తతం పూర్తైన 12 కిలోమీట‌ర్ల మార్గాన్ని మోదీ ప్రారంభించారు. 

మెట్రో రైల్ ప్రారంభోత్సవంతో పాటు పుణెలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన చేశారు. ఆదివారం ఉదయం మహారాష్ట్రకు చేరుకున్న ప్రధాని మోడీ తొలుత పుణె మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ వద్ద ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 9.5 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని పీఎంసీ ఏర్పాటు చేసింది.