ప్రధాని నరేంద్ర మోదీకి షేక్ హ్యాండ్ ఇచ్చిన రాహుల్ గాంధీ

ప్రధాని నరేంద్ర మోదీకి  షేక్ హ్యాండ్ ఇచ్చిన రాహుల్ గాంధీ

18వ లోక్ సభలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఎన్నికల సమయంలో  నిత్యం రాజకీయ విమర్శలు, ఆరోపణలు చేసుకున్న ఇద్దరు  కేంద్రంలో మూడోసారి మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఫస్ట్ టైం ఎదురు పడ్డారు.  ఈ వీడియో ఇపుడు వైరల్ అవుతోంది.

ఇవాళ(జూన్ 26) లోక్ సభ స్పీకర్ గా రెండోసారి ఓం బిర్లా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ ప్రకటించిన వెంటనే..ప్రధాని నరేంద్ర మోదీ,  ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అభినందనలు తెలిపే సమయంలో ఇద్దరు ఎదురుపడ్డారు. ఓం బిర్లాకు అభినందనలు తెలిపిన రాహుల్ అనంతరం ఎదురుగా ఉన్న మోదీకి షేక్ హ్యాండ్ ఇచ్చారు.  ఓం బిర్లాను స్పీకర్ కుర్చీలో కూర్చొబెట్టేందుకు మోదీతో పాటు వెళ్లారు రాహుల్.

ప్రతిపక్షాల గొంతు నొక్కొద్దు:రాహుల్

అంతకు ముందు స్పీకర్ ఎన్నిక సందర్భంగా మాట్లాడిన రాహుల్.. .గతంలో కంటే ఈ సారి సభలో ప్రతిపక్ష సభ్యుల సంఖ్య పెరిగిందన్నారు. సభలో తమ గొంతు వినిపించేందుకు  స్పీకర్  సహకరించాలని కోరారు. సభలో మాట్లాడటానికి ప్రతిపక్షాలకు సమయం ఇవ్వాలన్నారు.  సభలో విపక్షాల గొంతు నొక్కితే ప్రజాస్వామ్యానికి మంచిది కాదని..సభ సజావుగా నడిచినట్లు కాదని సూచించారు.  ప్రజల గొంతుకు ఎంత సమర్థవంతంగా  వినిపించామన్నదే ముఖ్యమన్నారు రాహుల్.