57 మందితో మోడీ టీమ్

57 మందితో మోడీ టీమ్

అనుకున్నట్టే అమిత్​ షా ఎంట్రీ.. కిషన్​రెడ్డికి చోటు

రాష్ట్రపతి భవన్లోని ఫోర్కోర్టులో అట్టహాసంగా ప్రమాణస్వీకారం

కేబినెట్ మినిస్టర్స్: 25, ఇండిపెండెంట్ మినిస్టర్స్: 9, ఎంవోఎస్: 24

మంత్రిగా మాజీ ఫారిన్ సెక్రటరీ జైశంకర్.. ఆరుగురు మహిళలు కూడా

వేడుకకు బిమ్స్టెక్ దేశాధినేతలు, 8 వేల మంది అతిథులు హాజరు

జైట్లీ, సుష్మ మిస్.. మేనక, సురేశ్​​ప్రభు, రాథోడ్​ తదితరులు ఔట్​

న్యూఢిల్లీనరేంద్రమోడీ ప్రమాణస్వీకారోత్సవం అట్టహాసంగా సాగింది. సుమారు 8000 మంది అతిథులు తరలివచ్చారు. మోడీతో కలిపి మొత్తం 58 మందితో రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ప్రమాణం చేయించారు. గురువారం సరిగ్గా రాత్రి 7 గంటల ఐదు నిమిషాలకు 68 ఏళ్ల మోడీ ‘‘మై నరేంద్ర దామోదర్​దాస్​ మోడీ’’ అంటూ ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు. ఆయన తర్వాత మంత్రులు ప్రమాణం చేశారు. బీజేపీ చీఫ్​ అమిత్​షా, మాజీ ఫారిన్​ సెక్రటరీ జైశంకర్​కు కేబినెట్​ మంత్రి హోదా దక్కింది.  తెలంగాణ నుంచి కిషన్​రెడ్డికి సహాయమంత్రి పదవి లభించింది. బిమ్స్​ టెక్​లోని బంగ్లాదేశ్​, మయన్మార్, శ్రీలంక, థాయ్​లాండ్​, నేపాల్​, భూటాన్​ దేశాల అధినేతలు వేడుకకు హాజరయ్యారు.  2014లో మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు సార్క్​ దేశాధినేతలు హాజరయ్యారు. అందులో నాటి పాక్​ప్రధాని నవాజ్​ షరీఫ్​ కూడా ఉన్నారు. ఈ సారి మాత్రం పాకిస్థాన్​కు ఆహ్వానం అందలేదు. రాత్రి 9 గంటలకు  బెంగాల్​కు చెందిన దేబశ్రీ చౌదరి ప్రమాణంతో ప్రమాణ స్వీకారాలు ముగిశాయి. అటు తర్వాత ప్రధాని మోడీ.. తన మంత్రులతో కలిసి గ్రూప్​ ఫొటో దిగారు. బిమ్స్​ టెక్​ దేశాధినేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

కేబినెట్​లోకి షా, కొత్తవారికి చాన్స్​

మోడీ కేబినెట్​లోకి బీజేపీ చీఫ్​ అమిత్​ షా వస్తారన్న వార్తలు నిజమయ్యాయి. కేబినెట్​లోకి ఎవరిని తీసుకోవాలన్న విషయంలో గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మోడీ, అమిత్​ షా విస్తృతంగా చర్చలు జరిపారు. మధ్యాహ్నం లిస్టు ఫైనల్​ అయ్యాక.. ఎంపీలకు సమాచారం అందించి, మంత్రిగా ప్రమాణం చేయడానికి రెడీగా ఉండాలని ఆహ్వానించారు. సాయంత్రం ఆరు తర్వాతే ఎవరెవరు మంత్రులుగా ప్రమాణం చేయబోతున్నారనే విషయం బయటకు వచ్చింది. మోడీ తర్వాత రాజ్​నాథ్​ ప్రమాణం చేయగా.. అటు తర్వాత అమిత్​ షా ప్రమాణం చేశారు. ప్రధానిగా మోడీ, మంత్రులుగా 57 మంది ప్రమాణం చేశారు. ఇందులో 25 మందికి కేబినెట్​మంత్రి  హోదా, 9 మందికి స్వతంత్ర మంత్రి హోదా,  24 మందికి సహాయ మంత్రి హోదా లభించింది. గత కేబినెట్​మంత్రులుగా చేసిన పలువురికి కూడా ఈ సారి చోటు దక్కింది.

అందులో రాజ్​నాథ్,  గడ్కరీ, సదానంద గౌడ, నిర్మలా సీతారామన్​, రాంవిలాస్ పాశ్వాన్, నరేంద్ర సింగ్​ తోమర్​, రవిశంకర్​ ప్రసాద్​, హర్​సిమ్రత్​ కౌర్​ బాదల్, తావర్​చంద్​ గెహ్లాట్, స్మృతి ఇరానీ, హర్షవర్దన్​, ప్రకాశ్​ జవదేకర్, పీయూష్​ గోయల్​, ముక్తార్​ అబ్బాస్​నఖ్వీ, ధర్మేంద్ర ప్రధాన్​, గిరిరాజ్​సింగ్​, సంతోష్​ గంగ్వార్, వీకే సింగ్​ వంటి పలువురు ఉన్నారు. మాజీ ఫారిన్​ సెక్రటరీ జైశంకర్​ను కూడా కేబినెట్​లోకి తీసుకున్నారు. ఆయన అటు రాజ్యసభలో కానీ.. ఇటు లోక్​సభలో కానీ సభ్యుడు కాదు. త్వరలో జైశంకర్​ను రాజ్యసభకు ఎన్నుకునే అవకాశం ఉంది. పలువురు కొత్తవారికి కూడా కేబినెట్​లో చోటు లభించింది. అందులో తెలంగాణ నుంచి కిషన్​రెడ్డితో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన అరవింద్​ సావంత్, ప్రహ్లాద్​సింగ్​ పటేల్, అనురాగ్​ సింగ్​ ఠాకూర్​, దేబశ్రీ చౌదరి వంటి వారు ఉన్నారు. పాతవారిలో అరుణ్​జైట్లీ, సుష్మాస్వరాజ్, మేనకా గాంధీ, సురేశ్​ ప్రభు, రాజ్యవర్ధన్​సింగ్, ఉమాభారతి, జేపీ నడ్డా వంటి పలువురికి చోటు దక్కలేదు. జైట్లీ, సుష్మ తమకు ఆరోగ్యం సహకరించడం లేదని, కేబినెట్​లోకి రాలేమని ముందే మోడీ దృష్టికి తెచ్చారు. బీజేపీ చీఫ్​ పదవికి జేపీ నడ్డా పేరు పరిశీలనలో ఉన్నందున ఆయనకు కేబినెట్​లోకి తీసుకోనట్లు తెలుస్తోంది. ఈ సారి కేవలం ఆరుగురు మహిళలకే కేబినెట్​లో చోటు కల్పించారు. గత కేబినెట్​లో ఎనిమిది మంది మహిళలు ఉండేవారు.

ప్రమాణంలో తడబడి

ప్రమాణం చేసేటప్పుడు పలువురు మంత్రులు తడబడ్డారు. రాత్రి సమయం కావడం, రంగు రంగుల విద్యుత్​ వెలుగులు విరజిమ్మడంతో వారికి ప్రమాణపత్రంలోని అక్షరాలు సరిగ్గా కనిపించలేదు. జితేంద్రసింగ్​వంటి సీనియర్​ మంత్రులతో పాటు కొందరు కొత్తవారు కూడా తప్పుగా పలికారు. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ కల్పించుకొని తప్పులను సరిచేస్తూ ఇలా పలకాలని ఒకటికి రెండుసార్లు చెప్పాల్సి వచ్చింది.

రాష్ట్రపతి ప్రత్యేక విందు

ప్రమాణస్వీకారోత్సవం అనంతరం రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. విదేశీ అతిథులతోపాటు పలువురు ఇక్కడ నేతలు కూడా ఈ విందులో పాల్గొన్నారు. ‘దాల్​ రైసినా’ అనే స్పెషల్​ వంటకాన్ని అతిథులకు వడ్డించారు.

తరలివచ్చిన నేతలు, ప్రముఖులు

ప్రమాణస్వీకారోత్సవానికి పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రముఖులు తరలివచ్చారు. బీజేపీ అగ్రనేతలు ఎల్​కే అద్వానీ, మురళీ మనోహర్​జోషితో పాటు ఆ పార్టీలోని కీలక నేతలు, ఆ పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఆరోగ్యం బాగోలేక జైట్లీ రాలేదు. ఎన్డీయేలోని భాగస్వామ్య పార్టీలైన శివసేన చీఫ్​ ఉద్దవ్​ థాక్రే, జేడీయూ చీఫ్​ నితీశ్​కుమార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్​ చీఫ్​ రాహుల్​గాంధీ, యూపీఏ చైర్​పర్సన్​ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్​సింగ్, మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, కర్నాటక సీఎం కుమారస్వామి, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్​ తదితరులు హాజరయ్యారు. సినీ ప్రముఖులు రజనీకాంత్​, కంగనా రనౌత్, వివేక్​ ఒబెరాయ్​, షాహిద్​ కపూర్​, బోనీ కపూర్​, ఆధ్యాత్మిక గురువు జగ్గివాసుదేవ్​, ఇండస్ట్రియలిస్టు ముఖేశ్​ అంబానీ, రతన్​ టాటా, ఎల్​ఎన్​ మిట్టల్​, గౌతమ్​ అదానీ వంటి వారు కూడా తరలివచ్చారు. బిమ్స్​టెక్​ (బే ఆఫ్​ బెంగాల్​ ఇనిషియేటివ్​ ఫర్​ మల్టీ సెక్టార్​ టెక్నికల్​ అండ్​ ఎకానమిక్​ కో ఆపరేషన్​) దేశాల తరఫున బంగ్లాదేశ్​ ప్రెసిడెంట్​ అబ్దుల్​ హమీద్​, శ్రీలంక ప్రెసిడెంట్​ మైత్రిపాల సిరిసేన, నేపాల్​ ప్రధాని కేపీ శర్మ ఓలి, మయన్మార్​ ప్రెసిడెంట్​ యు విన్​మింట్​, భూటాన్​ ప్రధాని లోతె షేరింగ్​ పాల్గొన్నారు. కిర్గిస్తాన్​ ప్రెసిడెంట్, మారిషస్​ ప్రధాని కూడా హాజరయ్యారు. బెంగాల్​లో రాజకీయ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన బీజేపీ కార్యకర్తల కుటుంబసభ్యులను ఈ వేడుకకు ప్రత్యేకంగా ఆహ్వానించారు. మోడీ, అమిత్​షా, స్మృతి ఇరానీ ప్రమాణం చేస్తున్నప్పుడు అతిథుల నుంచి విశేష స్పందన లభించింది.