
జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత.. ఇండియా, పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణం గురించి తెలిసిందే. యుద్ధానికి ఇండియా సిద్ధం అవుతున్న సమయంలో.. అనూహ్యంగా కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు, విదేశాంగ శాఖ ప్రతినిధులు ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు ప్రధాని మోదీ ఈ విషయంపై మాట్లాడలేదు..
2025, మే 12వ తేదీ రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ.. జాతినుద్దేశించి.. అంటే దేశాన్ని ఉద్దేశించి మాట్లాడనున్నట్లు కేంద్రం ప్రకటించింది. సరిగ్గా రాత్రి 8 గంటలకు.. ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. మీడియాతో నేరుగా కాకుండా.. జాతినుద్దేశించి వీడియో సందేశం ఇవ్వనున్నారు.
పహల్గాం దాడి తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పాక్ కవ్వింపు చర్యలను అణచేందుకు త్రివిధ దళాలకు ప్రధాని మోదీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఎప్పుడు ఏం చేయాలనుకున్నా చేయవచ్చునని అనుమతి ఇవ్వడంతో భారత బలగాలు పాక్ ను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాయి. భారత్ దాడిని తీవ్రం చేయడంతో పాక్ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించింది.
ఈ క్రమంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆపరేషన్ సిందూర్ పై ప్రధాని మోదీ మాట్లాడనున్నారు. పహల్గాం దాడి తర్వాత త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ గురించి ఈ ప్రసంగంలో చెప్పే అవకాశం ఉంది. అంతే కాకుండా పీఓకే (పాక్ ఆక్రమిత కశ్మీర్) పై కూడా ప్రధాని ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో పాక్ మరోసారి దాడి చేస్తే భారత్ ఎలా స్పందిస్తుందో హెచ్చరించే అవకాశం ఉంది.
ఇండియా-పాక్ ఉద్రక్త పరిస్థితుల తర్వాత అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించాడు. కశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం వహిస్తానని కూడా ట్రంప్ చెప్పాడు. ఆ తర్వాత తమకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని ఇండియా ఘాటుగా స్పందించింది. ఇవాళ్టి ప్రసంగంలో ఈ అంశంపై కూడా ప్రధాని మాట్లాడే అవకాశం ఉంది.
ఇండియా-పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఇప్పటికే ఆపరేషన్ సిందూర్ పై భారత త్రివిధ దళాధిపతులు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత టెర్రరిస్టులకు బుద్ధి చెప్పేందుకే ఆపరేషన్ సిందూర్ ను చేపట్టినట్లు ఈ సమావేశంలో తెలిపారు. ఇండియా టెర్రరిస్టులపై దాడి చేస్తుంటే.. పాకిస్తాన్ ఎందుకు దాడులకు దిగిందో అర్థం కాలేదని ఈ సందర్భంగా అన్నారు. ఉగ్రవాదులను, వారిని సపోర్ట్ చేస్తున్నవారే తమ టార్గెట్ అని.. పాకిస్తాన్ లో ఉన్న సామాన్య ప్రజలు కారని ఈ సమావేశంలో చెప్పారు. పాక్ దాడుల వెనుక చైనా హస్తం ఉందని, పీఎల్-15 మిస్సైల్ లభ్యం అవ్వడమే అందుకు సాక్ష్యమని అన్నారు. త్రివిధ దళాధిపతుల సమావేశం అనంతరం ప్రధాని ప్రసంగించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.