28 అడుగుల నేతాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మోడీ

28 అడుగుల నేతాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మోడీ

దేశ రాజధాని ఢిల్లీలో సెంట్రల్ విస్టా లాన్స్, కర్తవ్యపథ్ ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఇండియా గేట్ దగ్గర 28 అడుగుల నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని కూడా ఆయన ఆవిష్కరించారు. ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఉన్న కర్తవ్యపథ్, సెంట్రల్ విస్టా లాన్స్ ను కేంద్రం రీడెవలప్ చేసి అనేక సదుపాయాలను కల్పించింది. సెంట్రల్ విస్టా అవెన్యూ ప్రాంతంలో కొన్ని మార్పులు చేసినట్లు పీఎంఒ తెలిపింది. పబ్లిక్ టాయిలెట్స్, తాగునీళ్లు, పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేశారని తెలిపింది. 

ప్రతి సంవత్సరం జరిగే రిపబ్లిక్ డే పరేడ్ సమయంలో సందర్శకులకు సాదారణ ట్రాఫిక్ కు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు పీఎంఒ తెలిపింది. ప్రజల రాకపోకలపై సాధ్యమైనంత తక్కువగా ఆంక్షలు విధించేలా ఈ పనులు చేసినట్లు వెల్లడించింది. కృషి భవన్, వాణిజ్య భవన్ ల దగ్గర బోటు షికారుకు కూడా వీలుంటుందని పీఎంఓ తెలిపింది. ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఉన్న ప్రాంతాన్ని ఇకపై కర్తవ్యపథ్ గా పిలవనున్నారు. ఎర్ర గ్రానైట్ రాళ్లతో కూడిన నడకదారుల్ని, ఆహ్లాదకరమైన పచ్చదనాన్ని, రాష్ట్రాలవారీగా ఆహారశాలల్ని అక్కడ ఏర్పాటు చేశారు.

నేతాజీ జయంతి సందర్భంగా ఈ ఏడాది జనవరి 23న ఇండియా గేట్ దగ్గర నేతాజీ హాలోగ్రామ్ స్టాచ్యూను ప్రధాని మోడీ ఆవిష్కరించారు. ఇప్పుడు అదే ప్లేస్ లో నేతాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహం కోసం వెయ్యి 665 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖమ్మం జిల్లా నుంచి 280 మెట్రిక్  టన్నుల ఏకశిలా గ్రానైట్ రాయిని ఢిల్లీకి తెప్పించారు. సుమారు 26 వేల గంటలు శ్రమించి కళాకారులు.. 65 మెట్రిక్  టన్నుల బరువున్న 28 అడుగుల విగ్రహాన్ని తయారు చేశారు. కర్ణాటకకు చెందిన ప్రఖ్యాత యువ కళాకారుడు అరుణ్ యోగిరాజ్ ఆధ్వర్యంలో పూర్తి భారతీయ సంప్రదాయ పద్ధతిలో ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. ఇది దేశంలోని ఎత్తైన ఏకశిలా విగ్రహాల్లో ఒకటి. 

నేతాజీ విగ్రహా ఆవిష్కరణ సందర్భంగా మణిపురి శంఖ వాద్యం, కేరళ సంప్రదాయ పంచ వాద్యం, చండ మోగిస్తారు. ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ స్ఫూర్తితో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 500 మంది నృత్య కళాకారులతో కర్తవ్యపథ్ లో ప్రదర్శన ఉంటుంది. ఇండియా గేటు వద్ద కొత్తగా నిర్మించిన యాంఫీథియేటర్ లో సుమారు 30 మంది గిరిజన కళాకారుల ప్రదర్శన ఏర్పాటు చేశారు. నేతాజీ విగ్రహావిష్కరణతో ఇవాళ్టి నుంచి ఈనెల 11 వరకు పదినిమిషాల పాటు ఆయన జీవితానికి సంబంధించిన ప్రత్యేక డ్రోన్ షో ప్రదర్శించనున్నారు.