అయోధ్యలోని చౌరస్తాకు లతా దీదీ పేరు పెట్టడంపై ప్రధాని హర్షం

అయోధ్యలోని చౌరస్తాకు లతా దీదీ పేరు పెట్టడంపై ప్రధాని హర్షం

అయోధ్య: ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ 93వ జయంతి సందర్భంగా ఆమెకు ఉత్తరప్రదేశ్ సర్కార్ ఘనంగా నివాళులు అర్పించింది. అయోధ్యలోని చౌరస్తాకు లతా మంగేష్కర్ పేరు పెట్టింది. ఆమె జ్ఞాపకార్థం అక్కడ 14 టన్నుల బరువున్న 40 అడుగుల భారీ వీణను ఏర్పాటు చేసింది. ఈ చౌక్ ను బుధవారం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డితో కలిసి సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. సరయూ నది ఒడ్డున రూ.7.9 కోట్ల ఖర్చుతో ఈ చౌరస్తాను అభివృద్ధి చేశారు. ఈ భారీ వీణను పద్మశ్రీ అవార్డు గ్రహీత రామ్ సుతార్ తయారు చేశారు. దానిపై సరస్వతి బొమ్మను చెక్కారు. ఇంతపెద్ద సంగీత వాయిద్యాన్ని ఏర్పాటు చేయడం దేశంలో ఇదే మొదటిసారి అని అధికారులు చెప్పారు. 

దీదీకి నిజమైన నివాళి: మోడీ 

అయోధ్యలోని చౌరస్తాకు లతా దీదీ పేరు పెట్టడంపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తంచేశారు. ఇది ఆమెకు ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. చౌరస్తా ప్రారంభోత్సవంలో ఆయన వర్చువల్ గా మాట్లాడారు. లతా దీదీతో మాట్లాడిన ప్రతిసారీ ఆమె స్వీట్ వాయిస్ విని మైమరిచిపోయేవాడినని మోడీ చెప్పారు. ‘‘అయోధ్యలో రాముడి గుడికి భూమి పూజ చేసిన తర్వాత లతా దీదీ నాకు ఫోన్ చేసి ఆనందం వ్యక్తంచేశారు. ఆమె ఎన్నో రాముడి పాటలు పాడారు. ఆ పాటల్లో మనం రాముడిని చూసుకున్నం. లతా దీదీ చౌక్ ఏర్పాటుకు ఇంతకుమించిన ప్రదేశం ఉంటుందా? ఇకపై ఎల్లప్పుడూ ఆమె పేరు అయోధ్యతో ముడిపడి ఉంటుంది” అని  తెలిపారు. ఈ చౌక్ కళాకారులతో పాటు ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు. మన దేశ కళలు, సంప్రదాయాలను ప్రపంచంలోని ప్రతి మూలకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.