- ఎల్బీ స్టేడియంలో ప్రారంభించిన గవర్నర్
బషీర్‌బాగ్, వెలుగు: దేశంలోని ప్రతి వర్గానికి క్రీడలను చేరువ చేయాలన్నదే ప్రధాని మోదీ స్వప్నమని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ఏబీవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న పీఎం సంసద్ ఖేల్ మహోత్సవ్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. క్రీడలు కేవలం ఆటలు మాత్రమే కాకుండా విజ్ఞానం, విద్య, శారీరక-మానసిక వికాసానికి దోహదపడుతుందన్నారు.
కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, బ్యాడ్మింటన్ జట్టు కోచ్ పుల్లెల గోపీచంద్, ప్రముఖ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, భారత మహిళా క్రికెటర్లు డయానా డేవిడ్, దృష్టి కేసరి తదితరులు హాజరయ్యారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని 30 గ్రౌండ్స్‌లో సుమారు 15 రోజులపాటు పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రీడా మహోత్సవానికి సుమారు 35 వేల మంది క్రీడాకారులు నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు.
