సబ్సిడీపై సోలార్ పవర్.! ఇలా అప్లై చేసుకోండి..

సబ్సిడీపై సోలార్ పవర్.! ఇలా అప్లై చేసుకోండి..
  • బిల్లుల భారం, కాలుష్యం తగ్గించేలా ‘పీఎం సూర్య ఘర్’ స్కీం
  • రూఫ్ టాప్ సోలార్​ప్యానెళ్లకు కిలోవాట్ కు రూ.30వేల సబ్సిడీ 
  • వినియోగం 200 యూనిట్లు దాటే వారికి ప్రయోజనం
  • వాడుకోగా మిగిలిన కరెంటును రూ.4.17కు కొంటున్న డిస్కమ్​లు

హైదరాబాద్, వెలుగు:  కేంద్ర ప్రభుత్వ పథకం ‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ సామాన్యులపై విద్యుత్ బిల్లుల భారాన్ని, కాలుష్యాన్ని తగ్గించే దిశగా ప్రయత్నాలు జోరందుకున్నాయి. ఈ పథకం కింద ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకునే వారికి సబ్సిడీలతో పాటు, మిగులు విద్యుత్తును అమ్ముకొని ఆదాయం పొందే అవకాశం కల్పిస్తున్నది ప్రభుత్వం. సోలార్ ప్యానల్స్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్తులో గృహ అవసరాలకు పోగా మిగిలిన దాన్ని ‘నెట్ మీటరింగ్’ విధానంలో డిస్కమ్‌‌‌‌లు యూనిట్‌‌‌‌కు రూ.4.17 చొప్పున కొంటున్నాయి. దీంతో వినియోగదారులకు విద్యుత్ బిల్లుల భారం తగ్గడమే కాకుండా, అదనపు ఆదాయం పొందవచ్చు. ఈ పథకం గృహాలతో పాటు చిన్న పరిశ్రమలకు కూడా వర్తిస్తుంది.

సబ్సిడీతో ఆర్థిక లబ్ధి

ఈ పథకం కింద, గృహ వినియోగదారులు సోలార్ ప్యానల్స్ ఏర్పాటుకు కిలోవాట్‌‌‌‌కు రూ.30 వేల చొప్పున 3 కిలోవాట్ల వరకు సబ్సిడీ పొందవచ్చు. ఉదాహరణకు, 1కిలోవాట్ సోలార్ ప్లాంట్ కోసం రూ.85 వేలు ఖర్చు చేస్తే, రూ.30 వేలు సబ్సిడీగా తిరిగి లభిస్తుంది. 2 కిలోవాట్లకు రూ.1.60 లక్షలు ఖర్చు చేస్తే, రూ.60 వేలు, అలాగే 3 కిలోవాట్లకు రూ.2.18 లక్షలు ఖర్చు చేస్తే రూ.78 వేలు సబ్సిడీగా అందుతుంది. ఈ సబ్సిడీ నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమవుతుంది. అదనంగా, బ్యాంకు రుణ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకునే ఇండ్లు సూర్యరశ్మి నేరుగా పడేలా ఉండాలి. గ్రూప్ హౌసింగ్ సొసైటీలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్‌‌‌‌లకు కూడా కిలోవాట్‌‌‌‌కు రూ.18 వేల చొప్పున సబ్సిడీ లభిస్తుంది.

200 యూనిట్లు దాటితే లాభం

రాష్ట్రంలో ‘గృహజ్యోతి’ పథకం కింద 44 లక్షలకు పైగా పేద కుటుంబాలు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పొందుతున్నాయి. అయితే, 200 యూనిట్లకు మించి విద్యుత్తు వినియోగించే కుటుంబాలకు ఈ సోలార్ పథకం ఎంతో ఉపయోగకరం. నెలకు 150 యూనిట్లు వాడే వారు 1 కిలోవాట్ నుంచి -2 కిలోవాట్ల సోలార్ ప్లాంట్, 150- నుంచి 300 యూనిట్లు వాడే వారు 2 నుంచి -3 కిలోవాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడం బెటర్ అని నిపుణుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నరు.

దరఖాస్తు ప్రక్రియ ఇలా..

ఈ పథకం కోసం www.pmsuryaghar.gov.in వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ-మెయిల్ ఐడీ, విద్యుత్ కనెక్షన్ నంబర్, మొబైల్ నంబర్‌‌‌‌తో రిజిస్ట్రేషన్ చేసి, రూఫ్‌‌‌‌ టాప్ సోలార్ ప్లాంట్ కోసం ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో దరఖాస్తు సమర్పించాలి. విద్యుత్ శాఖ అధికారులు పరిశీలించి, రెడ్‌‌‌‌కో ఆధ్వర్యంలోని ఏజెన్సీ ద్వారా సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తారు. దరఖాస్తు ఆమోదం తర్వాత నెట్ మీటరింగ్ పరికరం అమర్చుతారు. నెలన్నరలోపు లబ్ధిదారుల ఖాతాలో సబ్సిడీ జమవుతుంది. సౌర శక్తి వినియోగాన్ని ప్రోత్సహించే ఈ పథకం, రాష్ట్రంలో విద్యుత్ ఖర్చులను తగ్గించేందుకు గ్రీన్​ పవర్​ సాధించేందుకు ఇది ఒక 
మార్గంగా మారనుంది.