-
పీఎంఏవై-జీ ఫండ్స్ విడుదల చేసిన మోదీ
-
భువనేశ్వర్‌లో గిరిజన లబ్ధిదారు ఇంటికెళ్లిన ప్రధాని
భువనేశ్వర్: ఎన్డీయే 3.0 సర్కార్ వచ్చి 100 రోజులు పూర్తయిందని, ఈ 3 నెలల్లో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ‘‘పేదలకు 3 కోట్ల ఇండ్లు కట్టివ్వాలని నిర్ణయం తీసుకున్నాం. యూత్ కోసం రూ.2 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాం. మెడికల్ కాలేజీల్లో కొత్తగా 75 వేల సీట్లను అందుబాటులోకి తెచ్చాం. 25 వేల గ్రామాలకు రోడ్లు వేస్తున్నాం” అని వెల్లడించారు. మోదీ మంగళవారం ఒడిశాలోని భువనేశ్వర్‌లో పర్యటించారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ (పీఎంఏవై-జీ) స్కీమ్ కింద 14 రాష్ట్రాల్లోని దాదాపు 10 లక్షల మంది లబ్ధిదారులకు ఫస్ట్ ఇన్స్టాల్ మెంట్ నిధులను విడుదల చేశారు. ‘ఆవాస్+ 2024’ యాప్‌ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 26 లక్షల మంది లబ్ధిదారులకు ఆవాస్ యోజన ఇండ్లు అప్పగిస్తూ నిర్వహించిన ‘గృహప్రవేశ్’ కార్యక్రమంలో పాల్గొన్నా రు. ఈ సందర్భంగా అంతర్యామి నాయక్ అనే గిరిజన లబ్ధిదారు ఇంటికి వెళ్లారు
ఆపై మోదీ మాట్లాడుతూ.. ‘‘మా అమ్మ బతికి ఉన్నప్పుడు నా పుట్టిన రోజున ఆమెను కలిసి ఆశీర్వాదం తీసుకునేవాడిని. అప్పుడు అమ్మ నాకు బెల్లం ఇచ్చేవారు. ఈ రోజు నా బర్త్ డే సందర్భంగా గిరిజన తల్లిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నాను. ఆమె నాకు ‘ఖీరీ’ స్వీట్ ఇచ్చారు. ఇది గిరిజనుల కోసం మరింత పనిచేసేందుకు నాకు బలాన్ని ఇస్తుంది” అని అన్నారు. కాగా, ఒడిశాలో రూ.3,800 కోట్ల విలువైన రైల్వే, నేషనల్ హైవే ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. ‘సుభద్ర యోజన’ స్కీమ్‌ను ప్రారంభించారు. ఈ స్కీమ్ కింద అర్హులైన మహిళలకు ఏటా రూ.10 వేలు అందజేస్తారు.