RRR ప్రాజెక్ట్‎కు PMO అడ్డంకి.. 4 నెలలుగా ​ముందుకు కదలని ఫైల్​..!

RRR ప్రాజెక్ట్‎కు PMO అడ్డంకి.. 4 నెలలుగా ​ముందుకు కదలని ఫైల్​..!

 

  • 10 సార్లు మీటింగ్ ​జరిగినా.. కేబినెట్ ​ముందుకు వెళ్లని ఫైల్​
  • మెట్రో విస్తరణ డీపీఆర్‌‌‌‌లు పెండింగ్
  • పెద్ద ప్రాజెక్టులకు పీఎంవో ఓకే చెప్పాల్సిందేనంటున్న కేంద్ర అధికారులు
  • ఎన్డీయే పాలిత రాష్ట్రాలకే కేంద్రం  నిధులు ఇస్తున్నదనే ఆరోపణలు

హైదరాబాద్, వెలుగు:  తెలంగాణకు తలమానికంగా భావిస్తున్న రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్​ఆర్) ప్రాజెక్టుకు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ ప్రాజెక్టును నార్త్, సౌత్ పార్టులుగా చేపడుతుండగా.. నార్త్ పార్ట్‌‌కు సంబంధించిన ఫైల్ గత 4 నెలలుగా కేంద్రం వద్ద పెండింగ్‌‌లో ఉంది. దీని డీపీఆర్‌‌‌‌కు కేంద్రం ఇప్పటి వరకు ఆమోదం తెలపలేదు. ఇక మెట్రో విస్తరణ విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. పెద్ద ప్రాజెక్టుల విషయంలో పీఎంవో ఓకే చెప్పాల్సిందేనని కేంద్ర ప్రభుత్వ అధికారులు చెబుతుండడంతో.. ట్రిపుల్‌‌ ఆర్, మెట్రో ప్రాజెక్టులపై గందరగోళం నెలకొన్నది.

ట్రిపుల్ నార్త్​పార్ట్‌‌కు సంబంధించి భూసేకరణ పూర్తై, డీపీఆర్ కూడా సిద్ధమైంది. దాన్ని కేంద్ర ఆమోదం కోసం 4 నెలల కిందనే రాష్ట్ర సర్కారు పంపింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 10 సార్లు కేంద్ర కేబినెట్ సమావేశాలు జరిగినా.. ఫైల్ కేబినెట్‌‌ ముందుకు వెళ్లలేదు. ఇంతలో నార్త్​పార్ట్‌‌కు సంబంధించి టెండర్లు పిలవడం, బిడ్స్​దాఖలు కావడంతోపాటు వాటిని ఓపెన్​చేయాల్సిన టైమ్‌‌ కూడా దాటిపోయింది. కానీ కేబినెట్ ఆమోదం లేకపోవడంతో టెండర్లు ఇంకా ఓపెన్ చేయలేదని సెక్రటేరియెట్‌‌లోని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

 ఇక ట్రిపుల్ ఆర్ సౌత్ పార్ట్ అలైన్‌‌మెంట్ దాదాపు ఖరారైంది. 199 కిలోమీటర్లతో అలైన్‌‌మెంట్​సిద్ధం చేస్తున్నారు. దీన్ని చేపడుతుందో లేదో కేంద్రం చెప్పాల్సి ఉంది. కేంద్రం, రాష్ట్రం కలిసి చేపడితే.. భూసేకరణ పరిహారం చెరిసగం భరించాల్సి ఉంటుంది. అయితే, నార్త్​పార్ట్​విషయంలోనే కేంద్రం ఇంత ఆలస్యం చేస్తుండడంతో.. సౌత్​పార్ట్ పరిస్థితి ఏమవుతుందోననే ఆందోళన వ్యక్తమవుతున్నది. 

బీజేపీయేతర రాష్ట్రాల ప్రతిపాదనలు పట్టని కేంద్రం !

 బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల పట్ల కేంద్ర సర్కారు వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. కీలకమైన ప్రాజెక్టులకు నిధులు కేటాయించడంలో, అనుమతులు మంజూరు చేయడంలో జాప్యం చేస్తున్నదని, అదే సమయంలో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు మాత్రం నిధుల వరద పారిస్తున్నదనే విమర్శలున్నాయి.  తెలంగాణలో రీజినల్ రింగ్ రోడ్డు నార్త్​ పార్ట్​కు అనుమతులు, నిధుల విషయంలో జాప్యం, అలాగే, మెట్రో విస్తరణ ప్రాజెక్టులకు మద్దతు లభించకపోవడం ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి.

 కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో జాప్యంపై కేరళ ప్రభుత్వం తరచుగా ఫిర్యాదు చేస్తున్నది, ముఖ్యంగా వరద సహాయ నిధులు, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతుల్లో జాప్యం చేస్తున్నట్టు తెలుస్తున్నది. పశ్చిమ బెంగాల్‌‌లో ఉపాధి హామీ నిధుల విడుదల,  తమిళనాడులో సర్వ శిక్షా అభియాన్ వంటి పథకాల కింద రావాల్సిన నిధులు కూడా నిలిచిపోయాయనే ఆరోపణలున్నాయి. కర్నాటకలో కరువు సహాయ నిధుల విషయంలో కేంద్రం నుంచి సరైన స్పందన లభించడం లేదని ఆరోపణలు రాగా.. తమిళనాడులో చెన్నై మెట్రో రెండో దశ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి నిధులు రావడం లేదని, దీనిని ‘‘ఎక్కువ వ్యయంతో కూడుకున్న ప్రాజెక్టు”పేర్కొంటూ అనుమతిని పెండింగ్‌‌లో పెట్టిందని ఆ రాష్ట్రం పేర్కొంటున్నది. 

దీనికి విరుద్ధంగా.. యూపీ, ఏపీ, మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలకు భారీ ఎత్తున జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి అధిక నిధులను కేంద్రం విడుదల చేస్తున్నది. అలాగే, అనుమతులు వేగంగా ఇస్తున్నది. మన రాష్ట్రానికి పక్కనే ఉన్న ఏపీ రాజధాని అమరావతికి, విశాఖ ఉక్కు కర్మాగారం, పోలవరం ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేస్తున్నది.

మెట్రో విస్తరణపైనా అంతే..  

మెట్రో విస్తరణ ప్రాజెక్టు విషయంలోనూ కేంద్రం జాప్యం చేస్తున్నది. డీపీఆర్​ పంపిన తర్వాత కొర్రీలు పెట్టి మళ్లీ మార్చి పంపాలని కోరడంతో ఆలస్యమైనట్టు తెలుస్తున్నది. కేంద్రం నుంచి సరైన మద్దతు లేకపోవడంతో మెట్రో విస్తరణ ప్రాజెక్టు ఆలస్యమవుతున్నది. మెట్రో ఫేజ్ –2 కింద మొత్తం 76.4 కిలోమీటర్ల మార్గం చేపట్టేందుకు రూ.24,269 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్‌‌‌‌ను కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపింది. అయితే ఈ ప్రాజెక్టును జాయింట్ వెంచర్‌‌గా చేపట్టేందుకు కేంద్రం ఆమోదం తెలపాల్సి ఉంది. 

ఈ నేపథ్యంలో డీపీఆర్‌‌‌‌ పెండింగ్‌‌లో ఉంది. ముఖ్యంగా పాతబస్తీ మెట్రో (ఎంజీబీఎస్​నుంచి చాంద్రాయణగుట్ట–7.5కిలోమీటర్లు) పనులు ప్రారంభమైనా భూసేకరణ ప్రక్రియ నెమ్మదిగా సాగుతున్నది. అలాగే, నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్‌‌‌‌పోర్టు వంటి కీలకమైన కారిడార్లకు సంబంధించి రూ.11,226 కోట్ల అంచనా వ్యయంతో కూడిన ప్రణాళికలు కేంద్రం ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయి. జేబీఎస్ – మేడ్చల్, జేబీఎస్ – శామీర్‌‌పేట, శంషాబాద్ ఎయిర్‌‌పోర్ట్ – ఫ్యూచర్ సిటీ వరకు విస్తరించే 3 కొత్త మార్గాలకు (ఫేజ్ 2బీ 86.5 కిలో మీటర్లు) సంబంధించి రూ. 19వేల కోట్ల విలువైన డీపీఆర్‌‌లు సిద్ధమైనా, కేంద్రం నుంచి నిధుల విడుదల, అనుమతుల్లో జాప్యంతో ఈ ప్రాజెక్టుల పురోగతి నెమ్మదించింది.