- పశ్చిమాసియా యుద్ధంతో దీర్ఘకాలం గడ్డు పరిస్థితులు: మోదీ
- కొవిడ్ తరహా ముప్పు పొంచి ఉంది.. అలర్ట్‌గా ఉండాలి
- సన్నద్ధంగా, ఐక్యంగా ఉంటేనే సంక్షోభాన్ని అధిగమిస్తాం
- హార్మూజ్‌ను క్లోజ్ చేయడం ఆమోదయోగ్యం కాదు
- ప్రపంచానికి ఆర్థిక మాంద్యం ప్రమాదం
- చర్చలు, దౌత్యంతోనే యుద్ధానికి ముగింపు పలకాలి
- తప్పుడు ప్రచారం, బ్లాక్ మార్కెటింగ్‌ను రాష్ట్రాలు అరికట్టాలి
- గల్ఫ్ దేశాల అధినేతలతో మాట్లాడాను
- సంక్షోభ నివారణకు కృషి చేస్తున్నామని
- లోక్ సభలో వెల్లడించిన ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన కఠిన పరిస్థితులు సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కరోనా సమయంలో దేశం ఏ విధంగా ఐకమత్యంగా నిలబడిందో, ఇప్పుడు కూడా అదే రీతిలో యూనిటీగా ఉండాలని పిలుపునిచ్చారు. పశ్చిమాసియా యుద్ధం, ప్రస్తుత సంక్షోభ పరిస్థితులపై సోమవారం లోక్ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఇంధనం, ఎరువులు, జాతీయ భద్రత, ఇతర రంగాలపై పడే ప్రభావంతో పాటు పశ్చిమాసియా ప్రాంతంలో నివసిస్తున్న భారతీయుల భద్రతపై ఉన్న ఆందోళనలను ఆయన ప్రస్తావించారు. "సాధారణ కుటుంబాలు సాధ్యమైనంత తక్కువ ఇబ్బందులు పడేలా" ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఈ సంక్షోభంపై భారత పార్లమెంటు నుంచి ప్రపంచానికి ఏకగ్రీవ గొంతుక వినిపించాలన్నారు. మానవత్వం, శాంతి పట్ల భారత అచంచల నిబద్ధతను ప్రకటించారు. చర్చలు, దౌత్యం మాత్రమే యుద్ధాలకు పరిష్కార మార్గాలని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించడానికి, యుద్ధాన్ని ఆపడానికి భారత్ ప్రతి ప్రయత్నం చేస్తోందన్నారు. తాను పశ్చిమాసియాలోని సంబంధిత దేశాల నేతలందరితో మాట్లాడి ఉద్రిక్తతలు తగ్గించాలని, పోరాటాన్ని ముగించాలని కోరినట్లు సభకు తెలిపారు.
ప్రపంచ ఇంధన సరఫరాలో 20 శాతం వాటా కలిగిన హార్మూజ్ జలసంధి వంటి అంతర్జాతీయ జలమార్గాలను అడ్డుకోవడం, వాణిజ్య నౌకలపై దాడులు చేయడం "ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు" అని మోదీ స్పష్టం చేశారు. ఈ యుద్ధంలో ఏ ఒక్కరి ప్రాణానికి ముప్పు వాటిల్లినా అది మానవత్వ ప్రయోజనాలకు విరుద్ధమన్నారు. "అన్ని పక్షాలు వీలైనంత త్వరగా శాంతియుత పరిష్కారానికి వచ్చేలా ప్రోత్సహించేందుకే భారత్ ప్రయత్నం చేస్తున్నది" అని చెప్పారు.
దౌత్యంతో మన నౌకలను రప్పిస్తున్నాం..
పశ్చిమాసియా సంక్షోభంపై భారత దౌత్య స్పందన గురించి ప్రధాని మాట్లాడుతూ.. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేసినప్పుడు, ఇరాన్ తన గల్ఫ్ పొరుగు దేశాలు, ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకుని ఎదురుదాడి చేసినప్పటి నుంచి భారత్ వైఖరి స్పష్టంగా ఉందని చెప్పారు. "తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం, ఉద్రిక్తతల తగ్గింపును కోరడం, పౌరులపై, ఇంధన, రవాణా, మౌలిక సదుపాయాలపై దాడులను వ్యతిరేకించడం" తమ విధానమని వివరించారు. "యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ భారతీయ నౌకల సురక్షిత ప్రయాణం కోసం దౌత్యం ద్వారా భారత్ నిరంతర ప్రయత్నాలు చేస్తోంది. అలాంటి కృషి వల్లే హార్మూజ్ జలసంధిలో చిక్కుకున్న మన నౌకలు కూడా భారత్‌కు చేరుకుంటున్నాయి" అని ఆయన తెలిపారు. గల్ఫ్ దేశాల్లో కోటి మంది భారతీయులు ఉన్నందున ఈ ప్రాంతం భారత్‌కు చాలా ముఖ్యమన్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ నుంచి వచ్చిన సుమారు 1,000 మంది భారతీయులతో సహా (వీరిలో 700 మందికి పైగా యువ వైద్య విద్యార్థులు ఉన్నారు) మొత్తం 3,75,000 మందికి పైగా భారతీయులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారని ప్రధాని చెప్పారు. ఈ సముద్రాల్లో ప్రయాణించే వాణిజ్య నౌకల్లో భారతీయ సిబ్బంది సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉందని తెలిపారు. అందుకే ఈ సంక్షోభంపై భారత పార్లమెంటు నుంచి ప్రపంచానికి ఒకే గొంతుక వినిపించడం అవసరమన్నారు.
పెట్రోలియం నిల్వలు పెంచుకున్నాం..
గత దశాబ్ద కాలంగా అనుసరిస్తున్న ఇంధన వైవిధ్య వ్యూహం ప్రస్తుత సంక్షోభంలో ఏ విధంగా ఉపయోగపడిందో మోదీ వివరించారు. భారత్ తన ఇంధన దిగుమతి వనరులను గత 11 ఏళ్లలో 27 దేశాల నుంచి 41 దేశాలకు విస్తరించిందని, తద్వారా ఏదైనా ఒక ప్రాంతంపై ఆధారపడటాన్ని తగ్గించుకుందని సభకు తెలిపారు. నేటి పరిస్థితుల్లో గత పదేళ్లుగా ఇంధన భద్రత విషయంలో తీసుకున్న చర్యలకు మరింత ప్రాధాన్యం ఏర్పడిందన్నారు.
భారత్ వద్ద 5.3 మిలియన్ మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు ఉన్నాయని, మరో 6.5 మిలియన్ మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ఇవే కాకుండా దేశీయ చమురు కంపెనీల వద్ద కూడా నిల్వలు ఉన్నాయని తెలిపారు. "గత 11 ఏళ్లలో మన రిఫైనింగ్ సామర్థ్యం గణనీయంగా పెరిగింది. వివిధ దేశాలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. ఎక్కడ వీలైతే అక్కడ నుంచి చమురు, గ్యాస్ సరఫరా కొనసాగేలా చూస్తున్నాం" అని చెప్పారు. దిగుమతి, -ఎగుమతి ప్రక్రియలో ప్రతి ఇబ్బందిని అంచనా వేసి పరిష్కరించడానికి ప్రతిరోజూ సమావేశమయ్యే ఒక ప్రత్యేక అంతర్-మంత్రిత్వ బృందం కృషి చేస్తోందని చెప్పారు.
‘ఆత్మనిర్భర్ భారత్’తో యూరియా సమస్యకు చెక్
దేశ రైతులు ఆహార ధాన్యాల నిల్వలను భర్తీ చేశారని, కాబట్టి ఆహార భద్రత విషయంలో భారత్ సిద్ధంగా ఉందని మోదీ చెప్పారు. "ఖరీఫ్ సాగు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎటువంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎరువుల సరఫరాకు తగిన ఏర్పాట్లు చేసింది. గతంలో కూడా మా ప్రభుత్వం ఏ ప్రపంచ సంక్షోభ ప్రభావాన్నీ మన రైతులపై పడనీయలేదు" అని మోదీ అన్నారు. "కొవిడ్ సంక్షోభ సమయంలో అంతర్జాతీయంగా యూరియా ధర క్వింటాల్‌కు రూ. 3,000 ఉండగా, భారత్‌లో మేం ఆ ధరను రూ. 300 వద్దే నిలకడగా ఉంచాము" అని వివరించారు. భారత్‌లో వేసవి ప్రారంభమైనందున విద్యుత్ డిమాండ్ పెరిగిందని, అయితే దేశంలోని అన్ని విద్యుత్ ప్లాంట్లలో తగినంత బొగ్గు నిల్వలు ఉన్నాయని మోదీ చెప్పారు. "వరుసగా రెండో ఏడాది కూడా100 కోట్ల టన్నుల కంటే ఎక్కువ బొగ్గును ఉత్పత్తి చేసి భారత్ రికార్డు సృష్టించింది. గత దశాబ్దంలో దేశం పునరుత్పాదక ఇంధనం వైపు కూడా ముందడుగు వేసింది" అని ఆయన పేర్కొన్నారు. ‘‘గత సంక్షోభాల కంటే భారత్ ఇప్పుడు మెరుగైన స్థితిలో ఉంది. దీనికి ప్రధాన కారణం 'ఆత్మనిర్భర్ భారత్' దిశగా వేసిన అడుగులే. ప్రభుత్వ వ్యూహం కేవలం యూరియాకే పరిమితం కాలేదు. డీఏపీ, ఎన్‌పీకేఎస్ ఎరువుల ఉత్పత్తి 50 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. అలాగే ఎరువుల దిగుమతులను కూడా వివిధ దేశాలకు విస్తరించాం" అని ప్రధాని పేర్కొన్నారు.
బ్లాక్ మార్కెటింగ్ అరికట్టాలి..
ఈ సంక్షోభం వల్ల తలెత్తే అంతర్గత భద్రతా అంశాలపై కూడా అప్రమత్తంగా ఉండాలని మోదీ చెప్పారు. ఇలాంటి పరిస్థితులను స్వార్థపూరిత శక్తులు వాడుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. భద్రతా సంస్థలన్నీ అప్రమత్తంగా ఉన్నాయని.. తీరప్రాంతం, సరిహద్దు, సైబర్, వ్యూహాత్మక కేంద్రాల వద్ద భద్రతను మరింత పటిష్టం చేస్తున్నట్లు చెప్పారు. ఓర్పు, నిగ్రహం, అప్రమత్తత పాటించాలని కోరుతూ.. తప్పుడు ప్రచారాలు చేయడం, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడటం లేదా నిల్వ చేయడం ద్వారా ఈ పరిస్థితిని వాడుకోవాలని చూసే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. అటువంటి వ్యక్తులపై కఠినమైన నిఘా ఉంచి, త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరారు.
