
- ఉచ్చు తొలగించిన టైగర్ ట్రాకర్‌పై దాడి
- అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో కలకలం
- గుట్టుగా ఎంక్వైరీ చేస్తున్న ఆఫీసర్లు
నాగర్‌కర్నూల్, వెలుగు: నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ అభయారణ్యంలో పులులు, ఇతర వన్యమృగాల భద్రతపై అనుమానాలు తలెత్తుతున్నాయి. అత్యంత దట్టమైన అటవీ ప్రాంతం, టైగర్ కోర్ ఏరియాలోని పుల్లాయిపల్లె సమీప అడవిలో వేటగాళ్లు ఉచ్చు ఏర్పాటుచేయడం, దీన్ని గుర్తించి, తొలగించిన టైగర్ ట్రాకర్‌పై కొందరు వ్యక్తులు దాడి చేయడం కలకలం రేపుతున్నది. దీనిపై ఆఫీసర్లు ఇంటర్నల్‌గా విచారణ చేస్తున్నారు. కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 5 నుంచి 6 పులులు వేటగాళ్ల ఉచ్చుకు బలికాగా.. అమ్రాబాద్ అభయారణ్యంలో ఇప్పటివరకు ఇలాంటి ఘటనలు నమోదు కాలేదు. దీంతో ఇది పెద్దపులులకు అత్యంత సురక్షిత ప్రాంతంగా గుర్తింపు పొందింది. కానీ.. తాజాగా వేటగాళ్లు పెట్టిన ఉచ్చుతో ఇక్కడి పులులకు కూడా ప్రమాదం పొంచి ఉందనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
నల్లమల అటవీ ప్రాంతం నాగర్‌కర్నూల్, నల్గొండ, కర్నూల్, ప్రకాశం, గుంటూరు జిల్లాల సరిహద్దుల్లో విస్తరించి ఉంటుంది. అడవికి ఓ వైపు 150 కిలోమీటర్ల పొడవున కృష్ణానది, మరో వైపు గుట్టలు, లోయలు సరిహద్దులుగా ఉంటాయి. నల్లమల అటవీ ప్రాంతాన్ని మొత్తం 4 బ్లాకులుగా, 10 రేంజ్‌లుగా విభజించారు. అడవిలో వన్యమృగాల సంరక్షణకు 230 మంది వాచర్లు, ట్రాకర్లు పనిచేస్తున్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో 13 మగ, 20 ఆడ పులులు, 3 పులి పిల్లలు, 175 చిరుతలు ఉన్నట్లు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు ఇటీవల వెల్లడించారు. వీటితోపాటు అడవి కుక్కలు, గుడ్డేలుగులు, దుప్పులు, జింకలు, గోల్డెన్ జాకాల్స్ లాంటి ఇతర వన్యప్రాణులు సైతం ఉన్నాయి.
ఉచ్చును గుర్తించిన టైగర్ ట్రాకర్
నల్లమల అటవీ ప్రాంతంలోని అప్పాపూర్ పెంట గ్రామ పంచాయతీ పరిధిలోని పుల్లాయిపల్లి బేస్‌క్యాంప్ నుంచి అర కిలోమీటర్ దూరంలో చెట్లకు కట్టిన ఇనుప తీగల ఉచ్చును గత నెల 8న టైగర్ ట్రాకర్ రవి గుర్తించాడు. బేస్ క్యాంప్‌కు సమీపంలో వన్యప్రాణుల తాగునీటి కోసం ఓ గుంతను ఏర్పాటు చేసి, సోలార్ బోర్ వసతి కల్పించారు. ఈ బేస్ క్యాంప్‌కు 15 కిలోమీటర్ల పరిధిలో తిరిగే అటవీ జంతువులు తాగునీటి కోసం ఎక్కువగా ఇక్కడికే వస్తుంటాయి. జంతువులు తిరిగే మార్గంలో 100 మీటర్ల పొడవునా 3 వరుసల్లో ఇనుప తీగలతో ఉచ్చు బిగించారు. దీనిని గుర్తించిన ట్రాకర్ రవి వెంటనే తీగలను తొలగించి ఫారెస్ట్ ఆఫీసర్లకు అప్పగించాడు. కాగా, ఈ ఇనుప తీగల విషయంలో టైగర్ ట్రాకర్లు రవి, నిమ్మల లింగస్వామి మధ్య వివాదం జరిగినట్లు తెలుస్తున్నది. ఇనుప తీగలను తిరిగి ఇవ్వాలని లింగస్వామి, నిమ్మల చిన్న గురువయ్యతో కలిసి వచ్చి తనపై దాడి చేశారని రవి ఆరోపిస్తున్నాడు.
స్థానికుల పాత్రపై అనుమానాలు
లింగాల మండలం నుంచి నల్లమల అడవిలోకి ప్రవేశిస్తున్న కొందరు వ్యక్తులు ఉడుములను వేటాడుతూ వాటి మాంసంతో అప్పుడప్పుడు పట్టుబడుతున్నారు. కానీ, ఏకంగా కోర్ ఏరియాలో పులులు సంచరించే ప్రాంతంలోనే ఉచ్చు ఏర్పాటు చేయడంతో అటవీశాఖలో ఒక్కసారిగా కలకలం రేగింది. బయటి నుంచి వచ్చే వేటగాళ్లకు కొందరు స్థానికులు సహకరిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలోని సలేశ్వరం జాతర నిర్వహణ, ఆదాయం పంపకాలు చెంచుల పర్యవేక్షణలో ఉంటాయి. ఈ విషయంలో గత రెండేండ్లుగా విభేదాలు ఏర్పడడంతో వాచర్లు, ట్రాకర్లు గ్రూపులుగా విడిపోయారు. ఈ క్రమంలో బయటి ప్రాంతాల నుంచి వచ్చే కొందరు వ్యక్తులు స్థానికులను తమ వైపు తిప్పుకుంటున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
అంతర్గతంగా కొనసాగుతున్న విచారణ ?
గత నెల 8న పుల్లాయిపల్లి బేస్‌క్యాంప్‌కు అర కిలోమీటర్ దూరంలోని కోర్ ఏరియాలో ఇనుప తీగల ఉచ్చు ఏర్పాటు చేశారని తెలియడంతో ఫారెస్ట్ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకొని, పరిశీలించారు. టైగర్ ట్రాకర్ రవి తొలగించిన ఇనుప తీగలను అక్కడి నుంచి తరలించారు. ఉచ్చు ఏర్పాటు, టైగర్ ట్రాకర్ రవిపై దాడి అంశాన్ని మొదట చెంచుల మధ్య వివాదంగానే భావించిన ఫారెస్ట్ ఆఫీసర్లు.. ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. కానీ విషయం బయటికి పొక్కడం, ఉన్నతాధికారులు సీరియస్ కావడంతో అంతర్గతంగా విచారణ మొదలుపెట్టినట్లు తెలుస్తున్నది.