చందానగర్, వెలుగు: కూతుళ్లపై లైంగిక దాడికి పాల్పడిన పినతండ్రికి 20 ఏండ్ల జైలు శిక్షను విధిస్తూ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ప్రత్యేక పోక్సో కోర్టు గురువారం తీర్పునిచ్చింది. నల్లగండ్ల ఫ్లైఓవర్ సమీపంలో నివసించే నల్లొల్ల నర్సింలు (45) కూలి పనులు చేస్తూ జీవిస్తుండేవాడు. భార్య చనిపోవడంతో ఇద్దరు కూతూర్లు, కొడుకు ఉన్న ఓ మహిళను రెండవ పెండ్లి చేసుకున్నాడు. కూలి పనులు చేసి వచ్చిన డబ్బుతో నర్సింలు తన రెండవ భార్యతో తరచూ గొడవపడేవాడు.
దాంతో ఆమె తన భర్తను, పిల్లలను విడిచి ఇంటి నుంచి వెళ్లిపోయింది. తల్లి లేకపోవడంతో ఆమె పెద్దకూతుర్లపై నర్సింలు లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం బయటకు చెబితే సోదరుడిని చంపేస్తానంటూ బెదిరించాడు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును రాజేంద్రనగర్ పోక్సో ప్రత్యేక కోర్టు గురువారం విచారించింది. వాదనల అనంతరం నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్షను విధించడంతో పాటు రూ. 5వేల ఫైన్ వేసింది. బాధిత బాలికలకు 5 లక్షల పరిహారాన్ని, బాలుడికి రూ. 50 వేలను అందజేయాల్సిందిగా తీర్పునిచ్చింది.
