- ఉట్నూర్ ఐటీడీఏని ముట్టడించిన 9 తెగల ఆదివాసీలు
- తమపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్
ఆదిలాబాద్, వెలుగు: పోడు భూములకు వెంటనే పట్టాలియ్యాలని, ఆదివాసీలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని గిరిజన సంఘాల నేతలు డిమాండ్ చేశారు. పోడు భూముల కోసం పోరాడి జైలుపాలైన కోయపోచగూడ ఆదివాసులకు మద్దతుగా సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి తొమ్మిది తెగలకు చెందిన ఆదివాసీలు పెద్ద సంఖ్యలో పోడు గర్జన పేరిట ఉట్నూర్ ఐటీడీఏని ముట్టడించారు.
పోడు భూములకు పట్టాలియ్యాలె
కోయపోచగూడ నుంచి పాదయాత్రగా ఐటీడీఏకు చేరుకున్న వారు.. తమపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తి వేయాలని, మహిళలని కూడా చూడకుండా అసభ్యంగా ప్రవర్తించిన ఫారెస్టు ఆఫీసర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి విధుల్లోంచి తొలగించాలని డిమాండ్ చేశారు. పోడు భూముల కోసం తమ ప్రాణాలైనా అర్పిస్తామని నినాదాలు చేశారు. తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు బుర్సా పొచ్చయ్య మాట్లాడుతూ.. అడవిని నమ్ముకొని బతుకున్న ఆదివాసీలను అడవి నుంచి వెళ్లగొట్టి, అటవీ భూములను పెట్టుబడిదారులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజే ఆదివాసీ మహిళలను అరెస్టు చేయడం దౌర్భాగ్యమన్నారు. వెంటనే ఆదివాసీలకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కోయపోచగూడ మహిళలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తి వేయాలని, మహిళల విషయంలో అనుచితంగా ప్రవర్తించిన ఫారెస్ట్ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. 2006కు ముందు పోడు చేసుకుంటున్న రైతులకు హక్కు పత్రాలు కల్పించాలని చట్టం చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఆదివాసీలను అడవి నుంచి వెళ్లగొట్టేందుకు టైగర్ జోన్ అంటూ కుట్ర పన్నుతున్నాయని మండిపడ్డారు. తర్వాత ఐటీడీఏ పీఓ వరుణ్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. త్వరలో కోయపోచగూడ గ్రామాన్ని సందర్శించి ఆదివాసీలకు న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఆదివాసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు కోవ దౌలత్ రావు, తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు గోడం గణేశ్, ప్రధాన కార్యదర్శి పుర్క బాపురావు, ఆదివాసీ సేన మంచిర్యాల అధ్యక్షుడు కొట్నాక్ తిరుపతి, మహిళా సంఘం నాయకులు గోడం రేణుక, పెందూర్ పుష్పరాణి పాల్గొన్నారు.
