అటవీ సిబ్బందిపై ఆదివాసీ పోడు రైతుల ఆగ్రహం

అటవీ సిబ్బందిపై ఆదివాసీ పోడు రైతుల ఆగ్రహం
  • ఆదివాసీలు,  అటవీ సిబ్బందికి మధ్య ఘర్షణ
  • ఇరు వర్గాలకు స్వల్ప గాయాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: రాష్ట్రంలో పోడు రైతులపై అటవీశాఖ సిబ్బంది దౌర్జన్యం కొనసాగుతోంది. ప్రభుత్వం, అటవీశాఖ తీరును వ్యతిరేకిస్తూ..ఆదివాసీ పోడు రైతులు పోరాటం చేస్తున్నారు. తమ భూముల్లో అటవీశాఖ సిబ్బంది ప్లాంటేషన్ మొక్కలు నాటారనే ఆగ్రహంతో రగిలిపోతున్న ఆదివాసీ రైతులు.. అటవీ సిబ్బంది నాటిన మొక్కలను పీకేశారు. అయితే భారీ సంఖ్యలో వచ్చిన ఫారెస్టు సిబ్బంది పోడు రైతులను అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఇరువర్గాలకు స్వల్ప గాయాలయ్యాయి. చండ్రుగొండ మండలం మద్దుకూరు అటవీ బీట్ పరిధిలో జరిగిన ఘటన ఉద్రిక్తత సృష్టించింది. 
తమకు పట్టాలివ్వకపోగా తాము సాగు చేసుకుంటున్న భూములను తమకు కాకుండా చేస్తున్నారని ఆదివాసీ పోడు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములను కాపాడుకునేందుకు ఒకవైపు నేతలను ప్రాథేయపడుతూ.. మరో వైపు అటవీ సిబ్బందితో వాగ్వాదం కొనసాగిస్తున్నారు. చండ్రుగొండ మండలం మద్దుకూరు అటవీ బీట్ పరిధిలో అటవీ శాఖ సిబ్బంది నాటిన మొక్కలను ఇవాళ ఆదివాసీ పోడు రైతులు మూకుమ్మడిగా వెళ్లి  పీకేస్తుండగా ఫారెస్టు సిబ్బంది భారీ సంఖ్యలో వచ్చి అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాలకు మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఇరు వర్గాలకు స్వల్ప గాయాలయ్యాయి.