పోడు రైతులపై దాడులు ఆపాలి

పోడు రైతులపై దాడులు ఆపాలి

గిరిజన పోడు సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని మంత్రి సత్యవతి రాథోడ్ వ్యాఖ్యానించారు. ఆదివారం హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో అఖిలపక్ష నేతల అధ్వర్యంలో పోడు రైతు పోరాట కమిటీ మంత్రి సత్యవతి రాథోడ్ ను కలిసింది. మంత్రిని కలిసిన వారిలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క, సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఉన్నారు. ఈ సమావేశ అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్, అఖిలపక్ష నేతలు మీడియా మాట్లాడారు.

చాలా మంది భూములను నమ్ముకున్నారు..

మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ : గిరిజన పోడు భూముల సమస్యలు పరిష్కరించాలని అఖిల పక్ష నేతలు వచ్చారు. ఈ సమస్య పరిష్కారానికి సబ్ కమిటీ వేశారు.. దానికి నేనే చైర్మన్ గా ఉన్నానని మంత్రి తెలిపారు. చాలా మంది భూములను నమ్ముకుని ఉన్నారు. చట్టం వచ్చి 19 ఏళ్ళు అవుతున్నాయని అన్నారు. ఈ విషయంలో అటవీ శాఖ అధికారులు, సీఎస్ తో మాట్లాడుతాను. పోలీసులు కేసు పెట్టకుండా డీజీపీతో, సీఎస్ తో మాట్లాడుతానని వారికి మంత్రి హామీ ఇచ్చారు. పోడు వ్యవహారంలో గిరిజనులు ఇబ్బందులు పడకుండా తగు చర్యలు తీసుకుంటాను మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.

గిరిజనులపై దాడులు అనాగరిక చర్య..

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ మాట్లాడుతూ : పోడు రైతులపై దాడులు జరుగుతున్నాయన్నారు. అందుకే మరొక్కసారి సమావేశమై మంత్రి సత్యవతి రాథోడ్ కు వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించాం. గిరిజనులపై దాడులు అనాగరిక చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ రోజు జరిగిన సమావేశంలో పోడు సమస్యను పరిష్కరిస్తామని మంత్రి సత్యవతి హామీ ఇచ్చారని తెలిపారు. న్యాయం జరిగే వరకు, పోడు రైతుల హక్కులు సాధించే వరకు మా కార్యాచరణ ఉంటుందని కోదండరామ్ స్పష్టం చేశారు.

అటవీశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలి..

ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ : ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట వరకు పోడు భూముల రైతుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించామన్నారు. అటవీశాఖ అధికారులు ఆదివాసుల మీద, పోడు రైతులపై దాడులు చేయకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ చూడాలని కోరుతున్నామని తెలపారు. రైతులపై అత్యుత్సాహంతో వ్యవహరించిన అటవీశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సీతక్క కోరారు.

గిరిజనులకు హక్కుదారు పట్టాలు అందజేయాలి..

మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ : అర్హులైన రైతులు దరఖాస్తు పెట్టుకోమంటే పెట్టుకున్నారు. కానీ ఇప్పటి వరకు వాటిని పరిశీలించలేదని జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు. గిరిజనులకు హక్కుదారు పట్టాలు అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

అటవీ హక్కుల పత్రాలు రెడీగా..

మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ : రైతుల అటవీ హక్కుల పత్రాలు రెడీగా ఉన్నాయన్నారు. అయినా మళ్ళీ దరఖాస్తు పెట్టుకోమన్నారని వెల్లడించారు. ఉన్న రెండు మూడు ఎకరాలు కూడా దున్నుకోకుండా పోడు రైతులను అడ్డుకుంటున్నారని గుమ్మడి నర్సయ్య మండిపడ్డారు.