
పలుకుబడుల భాషకు పట్టం కట్టాలని నినదించి, తన తల్లి భాషలోనే కవిత్వం రాసి, నిద్రాణమైన తెలుగు ప్రజల్లో చైతన్య దీప్తిని వెలిగించి.. జీవితాంతం వారి గొంతుకగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు. ఆయన 87 ఏండ్ల జీవితం ఒక మహత్తర ఉద్యమ కావ్యం. 20వ శతాబ్దపు తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక చరిత్రలో ఆయనదొక అద్భుత అధ్యాయం. ‘నా గొడవ’ పేరిట సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, కటువుగా స్పందిస్తూ పాలకులపై అక్షరాయుధాలను సంధించి ప్రజాకవిగా కీర్తించిన.. కాళోజీ నారాయణరావు మాతృదేశాన్ని, మాతృభాషను అమితంగా అభిమానించాడు.
కాళోజీ నారాయణరావు 1914 సెప్టెంబర్ 9న ప్రస్తుత కర్నాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లా రట్టిహళ్లి గ్రామంలో రమాభాయమ్మ, కాళోజీ రంగారావు దంపతులకు జన్మించాడు. కాళోజీ చిన్నతనంలోనే ఆయన కుటుంబం బీజాపూర్ నుంచి వరంగల్ జిల్లాకు తరలివచ్చి మడికొండలో స్థిరపడింది. కాళోజీకి తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీషు భాషలపై పట్టుంది. నిజాం కాలంలో హైదరాబాద్ సంస్థానంలో ఉర్దూను రాజభాషను చేసి కుట్రపూరితంగా ఇతర భాషా సాహిత్యాలను తీవ్రంగా అణచివేశారు. నైజాం పాలనలో బతుకు భయంతో అయిష్టంగానైనా ఇతర భాషల్లో మాట్లాడే తెలుగువారి పరిస్థితిని ‘ఆంధ్రుడా’ అన్న కవితలో వేదన భరితంగా వ్యక్తీకరించాడు.
మాతృభాషపై మక్కువ
మాతృభాష తెలుగును చిన్నచూపు చూస్తూ, పరభాష వ్యామోహంతో కూరుకుపోయిన వారిని సూటిగా ప్రశ్నించి మాతృభాషపై మక్కువను
చాటుకున్నారు. తెలుగు బిడ్డవై తెలుగు రాదంచును సిగ్గులేక ఇంక చెప్పుడెందుకురా అని ఈసడించాడు. మన యాసలో, మన భాషలో రాయాలని, మన ఆత్మ, మన హృదయం మనది కాకుండా చేస్తున్న కుట్రలను అర్థం చేసుకోవాలని కాళోజీ అంటాడు. మన భాషను తక్కువ చేయడం ఏమిటని తీవ్రంగా కదిలిపోయి కాళోజీ అన్యాథా శరణం నాస్తి కవితలో ఇలా అంటాడు. ‘రెండున్నర జిల్లాలది..దండి బాస అయినప్పుడు..తక్కినోళ్ల నోళ్ల యాస..నొక్కి పెట్టుబడ్డప్పుడు ప్రత్యేకంగా రాజ్యం పాలు కోరడం తప్పదు’ అని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆకాంక్షను ఆయన చెప్పారు. కాళోజీకి మాండలికాలంటే చాలా ఇష్టం. ఆయన జన్మదినాన్ని తెలుగు మాండలిక దినోత్సవంగా కాళోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుపుకునేవాళ్లు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాళోజీ జన్మదినాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలుగు భాష ఎన్ని తీర్లుగా ఉన్నా అన్ని యాసల అర్థం ఒక్కటేనని, దేని అందం దానిదేనని కాళోజీ స్పష్టం చేశారు.
పద్మవిభూషణ్ కాళోజీ
1930 నుంచే కాళోజీ నిజామాంధ్ర మహాసభ, హైదరాబాదు స్టేట్ కాంగ్రెస్‌లో ఎంతో చురుగ్గా పనిచేయడం ప్రారంభించారు. సత్యాగ్రహోద్యమంలో పాల్గొని పాతికేళ్ల వయసులోనే జైలుశిక్ష అనుభవించాడు. మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, జమలాపురం కేశవరావు, బూర్గుల రామకృష్ణారావు, పీవీ నరసింహారావు వంటి వారితో కలిసి కాళోజీ అనేక ఉద్యమాల్లో
పాల్గొన్నాడు. వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించి నగర బహిష్కరణకు గురయ్యాడు. 1953లో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. 1958లో టీచర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి శాసనమండలికి ఎన్నికయ్యాడు. కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయగా, భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ప్రశ్నించేవాడు నాకు ఆరాధ్యుడు అని ఆయన సగర్వంగా ప్రకటించాడు. పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు కలం నుంచి జాలువారిన అక్షరాలు తూటాల్లా ప్రతి తెలుగువారి హృదయాల్లో ముద్రితమై ఆలోచనలను రగిలింపచేయడం అక్షరసత్యం. తెలంగాణలో జరిగిన చరిత్ర అంతా కాళోజీ కవిత్వానికి ఇతివృత్తమై భాసిల్లుతుంది. రాజీ ఎరుగని తత్వం, ఆధిపత్యాన్ని ప్రశ్నించే స్వభావం ఆయనకే సొంతం. ఆయన జీవితాన్ని సాహిత్యాన్ని విడదీసి చూడలేం.
- డా. ఆగపాటి రాజ్‌కుమార్,
కాకతీయ విశ్వవిద్యాలయం