చీరల మీద కవిత్వం

చీరల మీద కవిత్వం

చీరల మీద కవిత్వం

కొత్తదనం ఉంటేనే ఏ వ్యాపారంలోనైనా రాణించగలం. అదికూడా ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లు పుట్టుకొచ్చే ఫ్యాషన్​ రంగంలో నిలదొక్కుకోవాలంటే ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుంది ఈ డిజైనర్​. ఫ్యాన్సీ డిజైన్లతో పాటు కవిత్వం ప్రింట్ చేసిన చీరలు అమ్మడం మొదలుపెట్టింది. కేరళలోని కోజికోడ్​కు చెందిన ఈమె పేరు హెన్నా.  మలయాళం కవితల్ని చీరల మీదకు తెచ్చి, అందర్నీ ఆలోచింప జేస్తున్న ఈ డిజైనర్​ గురించి...  

ప్రత్యేక సందర్భాలు, పండుగలు.. వేడుక ఏదైనా ఆడవాళ్లు కొత్త చీర కట్టుకోవాలనుకుంటారు.  కొత్తరకం డిజైన్లు, చూడముచ్చటైన బొమ్మలు ఉన్న పట్టు చీర కనిపిస్తే, వెంటనే కొంటారు. చీరల్లోనూ బెనారస్​ (ఉత్తరప్రదేశ్​), కంచీపురం పట్టు (తమిళనాడు), కసవు​ చీరలు (కేరళ) అని చాలా రకాలున్నాయి. పట్టు చీరల మీది వెరైటీ డిజైన్లు ఆయా ప్రాంతాల సంస్కృతిని  చెప్పకనే చెప్తాయి. దాంతో,  ఆడవాళ్లు చీరల్లో  ఇంకా కొత్తదనం ఏం కోరుకుంటున్నారు? అనేది పెద్ద ప్రశ్నలా అనిపించింది హెన్నాకు. అప్పుడు ఆమె చదివిన పుస్తకాల్లోని కవితలు  సమాధానంగా కనిపించాయి. కేరళలో పాపులర్ కవయిత్రి కమల సురయ్య కవితల్ని చీరల మీదకు తేవాలనుకుంది హెన్నా. ఫ్యాన్సీ డిజైన్లతో పాటు మలయాళీ కవిత్వం ఉన్న ఈ  చీరల్ని ఇప్పుడు చాలామంది ఇష్టపడుతున్నారు.   

మహిళల గురించిన కవిత్వం
హెన్నాకు కవిత్వం అంటే ఇష్టం. అందులోనూ మహిళల సమస్యలు, వాళ్ల చైతన్యం గురించి రాసే కమల సురయ్య  కవిత్వం అంటే మరీ ఇష్టం. ‘మాధవకుట్టి’ కలం పేరుతో కమల రాసిన కవితలు బాగా పాపులర్. ‘‘ఆడవాళ్లను కమల అర్థం చేసుకున్నంతగా మరెవరూ అర్థం చేసుకోలేదు. నాకెంతో ఇష్టమైన ఆమె కవితల్ని చీరల మీద ప్రింట్ చేయాలనుకున్నా. మొదట్లో ఈ చీరలు అందరికీ నచ్చుతాయో? లేదో? అనే అనుమానం ఉండేది. కానీ, చాలామందికి నచ్చాయి” అంటోంది హెన్నా.