సమాజం పతనావస్థకు చేరినప్పుడు దానిని దారిలో పెట్టేవాళ్లు ఉండాలి. అలాంటి కావలికారుల వల్లనే ఈ సమాజం ఇట్లా ఈ మాత్రమైనా మనగలుగుతున్నది. ఈ సమాజానికి కావలికాస్తున్న కవిత్వమే ఇది. తెలంగాణ అవతరించిన అనంతరం వెలువడిన తాత్విక కవిత్వ సంపుటే ‘తంపి’. ఈ కృతికర్త కవి హరగోపాల్.
సుదీర్ఘమైన సాహిత్య కృషి అతడి సొంతం. కవిగా, చరిత్ర పరిశోధకుడిగా, సమీక్షకుడిగా, విమర్శకుడిగా, ఆలోచనాపరుడిగా బహుముఖ కృషి చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సాధన కోసం రెండున్నర దశాబ్దాలకు పైగా అక్షరసాయం చేసిన ఉద్యమకవి ఆయన. జీవితాన్ని వ్యాఖ్యానించడంలో తనదైన ముద్ర ఉంది.
ఈ ‘తంపి’ నిండా మానని గాయాల గుర్తులున్నాయి. అర్ధాంతరంగా మాయమైపోతున్న మనుషుల పట్ల దుఃఖం ఉన్నది. కాళ్ల కింది నేలను కబళిస్తున్న కుట్రలను, మానవత్వాన్ని పాతరేసే మతోన్మాద ప్రమాదాన్ని, మనుషుల్లోని ద్వంద్వ ప్రవృత్తిని ఈ కవి ఏక కాలంలో ఖండిస్తున్నాడు. వెనక్కి తిరిగి చూసుకుని మనుషులను, మట్టిని కౌగిలించుకుంటున్నాడు. ఆ మట్టితో, మనిషితో ఉన్న అనుబంధాన్ని గుండెల నిండా గుర్తు చేసుకుంటున్నాడు. అందుకే ఈ పుస్తకం ప్రారంభంలోనే ఈ కవిత్వం ఎవరిదో చెప్పుకొచ్చాడు.
‘‘ఏండ్లు, పుండ్లుగా గోసపడ్తున్న అణగారిన ప్రజలది. తిరగబడుతున్న ప్రజలది. ఈ మనుషులకు ఏం కావాలో తెలియని పాండిత్యాలతో ఊదరగొడుతున్న సకల మతాల అహితాలతో కలెబడుతున్న ప్రజలది. వేల యేండ్లు గడిచినా చరిత్ర నుంచి ఏమీ నేర్చుకోని రాజ్యాల, పెత్తనాల, ఛాందసాల రీతి తప్పని తండ్లాడుతున్న ప్రజలది’’అంటాడు. ఇట్లా చెప్పడంలోనే తనది ప్రజా దృక్పథం అని, ప్రజల వైపు నిలబడేతనమని తెలుస్తున్నది. ఇది ప్రజా కవిత్వం అనడంలోనే తాను ప్రజల మనిషి అనే డిక్లరేషన్ ఉన్నది.
ఈ చైతన్యమే ఇవాళ కావాల్సింది. మనిషి చైతన్యం వ్యవస్థ నుంచి వ్యష్ఠికి మారిన కాలమిది. తన గురించి తప్ప, నలుగురి గురించి మాట్లాడలేని కాలానికి ఈ కవి మినహాయింపు. పూర్తిగా సెల్ఫిష్గా మారిన కాలంలో తాను మాత్రం అణగారిన ప్రజల పక్షాన నిలబడి సృజన కొనసాగిస్తున్నాడు. సామాన్యుల మీద కొనసాగిస్తున్న ఆధిపత్య భావనల మీద యుద్ధం ప్రకటిస్తున్నాడు.
ఏ కవికైనా తన చుట్టూ ఉన్న ఆధిపత్యాలను నిరసించడమే తన ప్రథమ కర్తవ్యంగా మారుతుంది. అట్లా తాను బాధితుల వైపు నిలడుతున్నాడు.అలాగే ఈ కవిత్వ నేపథ్యాన్ని గురించి చెప్తూ...‘‘ప్రజల దుఃఖమే, బాధలే, నవ్వులే, ప్రేమలే, సకలాన్ని ప్రేమించే అనంతమైన భావుకతలే, ప్రాణమిచ్చే ప్రేమే నా కవిత్వం. తొణికిన పదాలలో, అర్థం తొలికిన మాటల్లో నేను సరిగా రాయగలిగానో లేదో. కానీ, నేనే నా లోపల పెట్టుకున్న తంపి నుంచి పట్టాలు తెచ్చి ఈ సమాజపు బండి కూలిపోకుండా ఎక్కించడానికి పూనుకున్న ప్రయత్నమే’’అంటాడు.
దృక్పథం సరిగా ఉన్న కవికి తొవ్వ స్పష్టంగా ఉంటుంది. ఎవరి కోసం రాయాలి? ఎందుకోసం రాయాలి? అనే క్లారిటీ ఈ పుస్తకం నిండా కనబడుతుంది. తెలంగాణలో ధ్వంసమైన గ్రామీణ బహుజన బతుకుల జాడలను ఒడిసి పట్టుకున్నాడు ఈ కవి. తన నేపథ్యాన్ని ఈ కవిత్వంలో వెనక్కి తిరిగి తడుముకుంటున్నాడు. ఛిద్రమైపోయిన బతుకు జాడలను గురించి తల్లడిల్లిపోతున్న తీరు పలు కవితల్లో స్పష్టంగా కనిపిస్తుంది. గుండెలో కలుక్కుమనేలా దుఃఖాన్ని పలికించాడు. అల్లకల్లోలమై ఆగమై పోయిన బతుకు జాడలను జాగ్రత్తగా తన కవిత్వంలో బలంగా వ్యక్తీకరించాడు.
‘‘ఎనుగులేని పసుల కొట్టంల
కట్టు గుంజకొరిగిన ఆఖరి ఆవు
చెట్టు నీడల కలల రుమాలు పరుచుకుని
పడుకున్న బక్క రైతు
నిట్టనిలువు ఎండల
బొమ్మ గీసుకుంటున్న మొగులు” (గండమాకు)అంటూ దగాపడ్డ బతుకు నేపథ్యాన్ని అద్భుతంగా కవిత్వీకరించాడు. ఇట్లా జీవితాన్ని ఒడిసి పట్టుకోవడంలో ఈ కవిలో ఒక తాత్వికుడు ఉన్నాడు. అందుకే ఆ దుఃఖాన్ని అంతా అలవోకగా కండ్ల ముందుకు తీసుకొచ్చాడు.
చదువుతున్న పాఠకుల గుండెల్లోకి తన బాధనంతా కవిత్వంగా ఒంపుతాడు. అది పాఠకుని మనసులో ఒక అలజడిని రేపుతుంది. ఇది పల్లె మీద ఒక కవి మనాది మాత్రమే అనలేం. ఆ కవికి ఆ మట్టి మీద ప్రేమతో పాటు, ఆ జీవితాలు అట్లా కూనరిల్లి పోవడానికి కారణాలు తెలిసినతనం ఈ వ్యక్తీకరణల వెనక దాగి ఉన్నాయి.
‘‘పొక్కిలి పొక్కిలి యిల్లంత
మనసులెక్కనె
కాళ్లుసేతుల బిడ్డలైనరుగని
కడుపునిండ తిండేది?
గోడక్కొట్టిన పిడికల్లెక్క
ఎండిపోయిన బతుకులు” (గండమాకు)అంటూ పొక్కిలైపోయిన బహుజన బతుకులను చూసి వాపోయాడు. బహుజనుల మీద మరింత ఎక్కువగా ఉంది. బతుకును తాత్వికంగా కవిత్వీకరించడానికి ఈ కవి, ప్రకృతిని ఆలింగనం చేసుకుంటాడు. తనకంటే ముందటి కవులో, తన కాలపు కవులో చెప్పి అరిగిపోయిన ప్రతీకల తీరుగా కాకుండా సరికొత్తగా కవిత్వాన్ని పలికిస్తాడు.
‘‘ముచ్చట బొండిగెలున్నది
పొద్దు దండెం మీద ఎండిపోతున్నది
ఎదురుచూడని వానవై కురుస్తవా?” (నిట్టాడు)అంటాడు. ఇప్పటిదాకా తెలుగు కవిత్వంలో సూర్యుడిని రకరకాలుగా పోల్చినవారున్నారు. ఈ కవి మాత్రం పొద్దు దండెం మీద ఎండిపోతున్నది అనే సరికొత్త పోలికను తెలుగు కవిత్వానికి అందించాడు.
గ్లోబలైజేషన్ నేపథ్యంలో మానవ సంబంధాల విధ్వంసం పెద్దమొత్తంలో జరుగుతున్నది. దీనిని తన కవిత్వంలో నింపిన కవి హరగోపాల్. స్వార్థ ప్రయోజనాల కోసం మనుషులు నైతికంగా పతనం చెందడాన్ని సైతం ఈ కవి నిరసిస్తున్నాడు. 1996లో మొదలైన గ్లోబలైజేషన్ పరిణామాల మీద తెలుగు కవిత్వం ఎంతో వచ్చింది. 2010 తర్వాత ఈ ప్రపంచీకరణ అనేది మరొక రూపం దాల్చింది.
అప్పటి దాకా వ్యవసాయ సంక్షోభం, చేతివృత్తుల పతనం, వస్తు వ్యామోహవాదం, యుద్ధోన్మాదం వంటి భావనల కేంద్రంగా రచనలు చేశారు కవులు. మరిప్పుడు 2020ల తరువాత కరోనా వంటి విషమకాలపు ప్రతిస్పందనలను సైతం తెలుగు కవి ఎట్లా అర్థం చేసుకున్నాడనే ప్రశ్నకు మనకు ఈ తంపి కవిత్వంలో ఒక బలమైన సమాధానం దొరుకుతుంది.
‘తంపి’ కవిత్వంలో తెలంగాణ బహుజన భాష ప్రత్యేకమైన విశేషణంగా చెప్పుకోవాలి.
‘‘జీవాలయెంట తిప్పెటప్పుడు
అంబటాల్లకు దూపబుడ్డి తాపినోల్లు
నాట్లెయ్య మునుం తోడుకు బోతె
ఒరం మీద కూసోవెట్టి బువ్వపెట్టిన అవ్వలు
చాకర్లకాలువల బట్టలుతికేయాల్ల
కడుపుచూసి కుల్లల అన్నం పెట్టినోల్లు” అంటాడు. రేపటి గురించిన స్వార్థ చింతన లేని మట్టి మనుషుల ప్రాణం ఈ భాష. వారి మధ్యే పుట్టి పెరిగిన మనిషి ఆ భాషను దోసిల్ల నిండా ఎత్తుకుంటాడు. గుండెల నిండా హత్తుకుంటాడు. భాషా పరిమళాలను కవిత్వానికి అద్ది కొత్త సొబగులను పూయిస్తాడు.
ఏ చైతన్యం లేకుండా స్వార్థ పరులుగా మారుతున్న మనుషులను గురించి కూడా ఈ కవికి ఒక చింత ఉన్నది. ధర్మాగ్రహం ఉన్నది. అందుకే సోయి తప్పిన వారి ముఖాల మీద ఇన్ని నీళ్లు చల్లైనా లేపాలంటున్నాడు.
‘‘మనిషి ముఖం మీద
ఇన్ని మాటలు చల్లి నిద్రలేపు
మేలుకునుడే మర్చిపోయిండు
మాట్లాడుడే మానేసిండు...
***
జట్న మారిపోతదా ఇంత పెద్ద దేశం
వారీ, కావలికారులుంటరు
బాంచెననే కాలం కాలిపోతది
ఆశ పొద్దు పొడుస్తుంటది
లేరా...
లే...
ఈ దేశంలో కొంచెం మనుషుల్ని జమచెయ్యి...’’ అంటాడు ‘‘దేశంలో మనుషుల్ని జమచెయ్యి’’ అనే కవితలో. ఇందులో భాషా పరమైన విశేషణంలో ఒక స్థానిక మాండలిక సొగసు ఉంది. అలాగే భావం పరంగా చూస్తే మనుషుల్లో పెరిగిపోతున్న నిర్లక్ష్యం, చైతన్యరహిత మనస్తత్వం మీద ఒక హెచ్చరిక ఉంది.
దేశం ఒక్కసారే మారిపోదు, ఈ దేశాన్ని కాపాడే వాళ్లు ఉంటారు అంటాడు. అలాగే గతకాలపు తిరోగమన భావాలకు చిహ్నమైన బాంచెన్‌గిరి కాలిపోతదంటాడు. అంతేకాదు రేపటి మీద ఒక ఆశను వ్యక్తం చేస్తాడు. ఆశ పొద్దు పొడుస్తుంటది అంటాడు. ఈ దేశంలో మనుషులు కులాలు, మతాలుగా మారిపోయిన తరువాత అచ్చమైన మనిషి కరువైపోయాడు. ఆ వెలితి తెలిసిన కవిగా హెచ్చరిస్తున్నాడు.
‘‘వానికి మతం కావాలె.. వీనికి రాజ్యం కావాలె.. అవతలివానికి మంచి మార్కెట్ కావాలి’’ అంటూ ఈ కాలపు మతోన్మాదుల, కార్పొరేటు శక్తుల కుట్రలను ఖుల్లం ఖుల్లం చేస్తాడు. ఇట్లా బతుకును ఆలింగనం చేసుకున్న దృష్టి నుండి కవిత్వమై కురిసిన తీరు పాఠకుల్లో కొత్త ఆలోచనలు రేపుతాయి. కవితా దాహార్తిని తీర్చే సంపుటిగా తంపి యాదికుంటుంది. వెంటాడే కవిత్వమై అలజడి రేపుతుంది.
- డా.పసునూరి రవీందర్, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత-
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ : openpage@v6velugu.com రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
