- కలర్లు, క్రీమ్స్‌తో కల్తీ ఐస్‌క్రీమ్‌ల తయారీ
- 150 కిలోల డోనట్స్, కేకులు, 120 కిలోల డాల్డా,
- 25 కిలోల మిల్క్ పౌడర్ సీజ్
- 70 క్వింటాళ్ల కల్తీ అల్లంవెల్లుల్లి పేస్ట్.. 8 వేల కిలోల నాసిరకం కొబ్బరి పొడి స్వాధీనం
- వేర్వేరు చోట్ల 9 మంది అరెస్ట్
ఓల్డ్‌సిటీ/గండిపేట/బషీర్‌బాగ్/అత్తాపూర్: హైదరాబాద్‌లోని వివిధ చోట్ల సాగుతున్న కల్తీ దందాల గుట్టును టాస్క్‌ఫోర్స్, పోలీసులు రట్టు చేశారు. బుధవారం నగరంలోని వేర్వేరు చోట్ల జరిపిన దాడుల్లో మొత్తం 9 మందిని అరెస్ట్ చేసి, పెద్ద మొత్తంలో కల్తీ ఫుడ్ తయారీకి వాడుతున్న కెమికల్స్, ఇతర పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కాటేదాన్‌లోని మధురై మీనాక్షి ఫుడ్ కంపెనీలో కుళ్లిపోయిన కోడిగుడ్లు, ప్రమాదకర కెమికల్స్ తో పిల్లలు తినే బిస్కెట్లు, కేకులు, డోనట్స్తయారు చేస్తుండగా రెయిడ్ చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
ఇంద్ర సొసైటీ పరిధిలో ప్రమాదకరమైన రసాయనాలు వాడుతూ పిల్లలు తినే డోనట్స్, బన్స్, కేకులు తయారు చేస్తున్నట్టు గుర్తించారు. సూపర్‌వైజర్ అఫ్రిదీ అన్సారీ(22), మేనేజర్యాసిన్(32), ఖత్రేషన్(34) అనే మరో వ్యక్తి కలిసి కల్తీ డోనట్స్, కేకులు తయారు చేస్తున్నారు. 330 కుళ్లిపోయిన కోడిగుడ్లు, 15 కిలోల సోడియం బెంజోయేట్, 15 కిలోల సోర్బిక్ యాసిడ్, 20 కిలోల పొటాషియం సోర్బేట్, పీజీపీఆర్ లిక్విడ్, అమ్మోనియా సల్ఫైట్, 150 కిలోల డోనట్స్, కేకులు,120 కిలోల డాల్డా, 25 కిలోల మిల్క్ పౌడర్ స్వాధీనం చేసుకున్నారు. కేసును చాకచక్యంగా ఛేదించిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులను డీసీపీ ఎస్ శ్రీనివాస్ అభినందించారు.
యాసిడ్స్‌తో అల్లం వెల్లులి పేస్ట్ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను హైదరాబాద్ సిటీ టాస్క్‌ఫోర్స్, ఫుడ్ అడల్టరేషన్ విభాగం అధికారులు కలిసి బుధవారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 70 క్వింటాళ్ల కల్తీ పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సోహెల్ చరానియా(38), రహీమ్ చరానియా(36), అమిత్ చరానియా(35) కలిసి రాజేంద్రనగర్, ఎంఎం పహాడీ ప్రాంతాల్లో డెక్కన్ ట్రేడర్స్ పేరుతో రెండు వేర్వేరు గోడౌన్లు నడుపుతున్నారు.
తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు గడించడం కోసం శాంటానిక్ యాసిడ్, ఎసి టిక్ యాసిడ్, సింథటిక్ ఫుడ్ కలర్, వెల్లుల్లి పొట్టును కలిపి ప్రమాదకరమైన అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు
చేస్తున్నారు. ఈగలు, దుమ్ము ధూళి మధ్య అత్యంత అప రిశుభ్ర వాతావరణంలో తయారు చేసిన ఈ పేస్ట్‌ను ప్లాస్టిక్ డబ్బాల్లో నింపి నగరంలోని హోల్‌సేల్ కిరాణా దుకాణాలు, క్యాటరింగ్ సర్వీసులకు సరఫరా చేస్తున్నారు. పక్కా సమాచారంతో వీరి గోడౌన్లపై పోలీసులు దాడి చేశారు. నిందితులను పట్టుకొని, 70 క్వింటాళ్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, సింథటిక్ పుడ్ కలర్ ప్యాకెట్లు, 40 లీటర్ల శాంటిక్ యాసిడ్ టిన్ సామగ్రిని స్వాధీనం చేసు కున్నారు. నిందితులనుఅత్తాపూర్ పోలీసులకు అప్పగించారు. ఈ దాడిలో టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ సి.హెచ్. యదేందర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
నాసిరకం కొబ్బరి పొడి
బేగంబజార్‌లో నాసిరకం కొబ్బరి పొడిని తయారు చేసి విక్రయిస్తున్న కేంద్రంపై సిటీ టాస్క్‌ఫోర్స్, గోషామహల్ పోలీసులు దాడి చేసి, ఒకరిని అరెస్ట్ చేశారు. నిందితుడు నకుల్ మరోటియా(31) కర్నాటక నుంచి తక్కువ నాణ్యత గల కొబ్బరి పొడిని కొనుగోలు చేసి, చేతక్ బ్రాండ్ పేరుతో ప్యాకింగ్ చేస్తూ మార్కెట్లో విక్రయిస్తున్నాడు. ఈ దాడిలో సుమారు రూ. 21 లక్షల విలువైన 8,300 కిలోల కొబ్బరి పొడితో పాటు ప్యాకింగ్, తూకం యంత్రాలు, కవర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై గోషామహల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ అందె శ్రీనివాసరావు తెలిపారు.
కలర్లు, క్రీమ్స్‌తో ఐస్‌క్రీమ్
అత్తాపూర్‌లో జై భోలేనాథ్ పేరుతో నిర్వహి స్తున్న నకిలీ ఐస్‌క్రీమ్ పార్లర్‌పైనా బుధవారం టాస్క్‌పోర్స్ పోలీసులు మెరుపు దాడులు చేశా రు. నిర్వాహకులు కంపెనీ పేరు లేకుండా, ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఐస్ క్రీమ్ అమ్మకాలు సాగిస్తున్నారు. ఐస్‌క్రీం తయారీలో ఆరోగ్యానికి హాని కలిగే పదార్థాలు, కలర్లు, వివిధ రకాల క్రీములు వాడుతున్నారు. భోలేనాథ్ కంపెనీ మంచి క్వాలిటీతో ఐస్‌క్రీమ్‌ని తయారు చేసి అమ్ముతుందని, కానీ నిర్వాహకులు ఆ కంపెనీ పేరుపై ఆరోగ్యానికి హానికలింగించే విధంగా ఐస్క్రీమ్స్తయారు చేసి అమ్ముతున్నా రని పోలీసులు గుర్తించారు. భోలేనాథ్ ఐస్‌క్రీమ్ పార్లర్ వారు కూడా ఈ నిర్వాహకుడిపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు.
