బంగారమే కాదు.. నీ చెల్లినీ తీసుకురా...బాలికను ట్రాప్ చేసిన యువకుడు అరెస్ట్

బంగారమే కాదు.. నీ చెల్లినీ తీసుకురా...బాలికను ట్రాప్ చేసిన యువకుడు అరెస్ట్
  • ఘట్​కేసర్ పీఎస్​ పరిధిలో ఘటన

ఘట్​కేసర్, వెలుగు: ప్రేమపేరుతో ఇద్దరు మైనర్ అక్కాచెల్లెళ్లను ఓ యువకుడు ట్రాప్ చేశాడు. తొలుత అక్కను ఇన్​స్టాలో పరిచయం చేసుకుని, ఆమెతో చనువుగా ఉన్న సమయంలో ఫొటోలు, వీడియోలు తీసుకున్నాడు. చివరకు బంగారంతో సహా ఆమె చెల్లెను తన వద్దకు పంపించకుంటే వాటిని వైరల్​చేస్తానని బెదిరింపులకు దిగాడు. ఏం చేయాలో తెలియక బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేయడంతో అసలు విషయం బయటపడింది. బాధిత కుటుంబసభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం..  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్​కేసర్ కు చెందిన అవినాష్ (20) ఔషాపూర్​లోని ఓ ఇంజినీరింగ్​కాలేజీలో బీ-టెక్ సెకండియర్ చదువుతున్నాడు. 

ఇన్​స్టాలో ఓ బాలికతో పరిచయం పెంచుకొని ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. ఆమెతో చనువుగా ఉన్న సమయంలో సెల్​ఫోన్​లో ఫొటోలు, వీడియోలు తీసుకున్నాడు. ఆ తర్వాత తనకు డబ్బులు అవసరం ఉన్నాయని, ఇంట్లోని బంగారం తీసుకొస్తేనే వాటిని డిలీట్​చేస్తానని బ్లాక్​మెయిల్ చేశాడు. దీంతో తప్పనిసరి పరిస్థితిలో బంగారాన్ని తీసుకెళ్లి ఇచ్చింది. చివరకు చెల్లెను కూడా తీసుకురమ్మని చెప్పడంతో ఏం చేయాలో తెలియక బాధితురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 

ఈ క్రమంలో బాలికను తల్లి మందలించడంతో అసలు విషయం బయటపడింది. దీంతో ఈ నెల 12న బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఫొక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అవినాష్​ను శుక్రవారం అరెస్ట్ చేసి, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పరశురామ్ తెలిపారు.  

కాచిగూడలో మరో యువకుడు..

బషీర్​బాగ్: బాలికను లైంగికంగా వేధించిన ఓ యువకుడిని కాచిగూడ పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. అడ్మిన్ ఎస్ఐ రవికుమార్ వివరాల ప్రకారం.. కింగ్ కోఠి లో నివాసం ఉంటున్న ఫేక్ పాషా(21 ) డిగ్రీ పూర్తి చేశాడు. కాచిగూడకు చెందిన 17 ఏళ్ల బాలికను గత కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నాడు. పెద్దలు నచ్చజెప్పడంతో కొంతకాలం మౌనంగా ఉన్నాడు. మళ్లీ ఈ మధ్యకాలంలో బాలికను లైంగికంగా వేధించడమే కాక బెదిరింపులకు పాల్పడ్డాడు. బెదిరింపులు తట్టుకోలేక తన తల్లిదండ్రులతో కాచిగూడ పీఎస్ లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో షేక్ పాషా పై పోక్సో కేసు నమోదు చేసి, శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.