
- ఈ నెల 28న ప్రగతి మీటింగ్‌లో పోలవరం ప్రాజెక్ట్‌పై చర్చ
- ముంపు, పరిహారంలాంటి విషయాలపై 4 రాష్ట్రాల వివరణ తీసుకోనున్న మోదీ
- 954 ఎకరాల ముంపుపై తేల్చాలని ప్రధానికి నివేదించనున్న తెలంగాణ
- భద్రాచలం టౌన్, మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్ సహా ముంపుపై సర్వేకు విజ్ఞప్తి
- ముంపు ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేయించాలని కోరనున్న ఆఫీసర్లు
హైదరాబాద్, వెలుగు: పోలవరం ముంపు పంచాయితీ ప్రధాని మోదీ వద్దే తేల్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఎన్నిసార్లు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) మీటింగ్ పెట్టినా, సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) దృష్టికి తీసుకెళ్లినా మన సమస్యకు పరిష్కారం చూపించడం లేదు. జాయింట్ సర్వేకు ఏపీ వెనకడుగు వేస్తుండడం.. సీడబ్ల్యూసీ కూడా ఏం చెయ్యలేకపోతుండడంతో ప్రధాని మోదీ ముందు సమస్యలను వివరించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్నది.
ఈ నెల 28న ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన ప్రగతి మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పోలవరంపై చర్చించనున్నారు. ఇందులో ప్రాజెక్ట్‌తో ఎఫెక్ట్ అయ్యే 4 రాష్ట్రాల (ఏపీ, తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్) సీఎంలు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణకు జరుగుతున్న నష్టంపై వివరించేందుకు రాష్ట్ర అధికారులు ఎజెండాను సిద్ధం చేశారు.
వెయ్యి ఎకరాల ముంపు
పోలవరం ప్రాజెక్టును వాస్తవానికి 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తున్నారు. అయితే, ఆ హైట్‌లో నిర్మించి పూర్తి స్థాయిలో నీటిని స్టోర్ చేస్తే ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌తో ముంపు మరో 53,393 ఎకరాలు పెరిగే అవకాశం ఉంది. దీనిపై ఇప్పటికే పలుమార్లు చర్చలు జరపగా.. ప్రాజెక్టును పూర్థిస్థాయి సామర్థ్యంతో నిర్మించినా.. కేవలం 41.67 మీటర్ల ఎత్తులోనే నీటిని స్టోర్ చేసుకునేలా కేంద్రం నిర్ణయించింది.
అందుకు తగ్గట్టుగా15,277.84 ఎకరాల మేర భూసేకరణ చేపట్టాల్సి ఉంది. ఆ ఎత్తులోనూ నీటిని స్టోర్ చేస్తే మన దగ్గర 6 మండలాల్లోని 954 ఎకరాలు ముంపునకు గురి కానున్నాయి. దాంతోపాటు భద్రాచలం టౌన్, మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్లకూ ముంపు ముప్పు పొంచి ఉన్నది. అలాగే, కిన్నెరసాని, ముర్రేడువాగు, మరో ఆరేడు స్థానిక వాగుల్లో వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉంటుంది.
అంతేకాకుండా..దుమ్ముగూడెం ప్రాజెక్టు కింద 36 వాగులు వచ్చి చేరుతున్నాయి. పోలవరం బ్యాక్‌వాటర్‌తో వాటిపైనా ప్రభావం పడనుంది. ఈ క్రమంలోనే సర్వే, డీమార్కేషన్ను కచ్చితంగా చేయాల్సిందేనని మన అధికారులు ఎప్పటినుంచో పట్టుబడుతున్నారు. కానీ, ఏపీ మాత్రం కొర్రీలు పెడుతున్నది. ఇటీవలే సీడబ్ల్యూసీతో దీనిపై సర్వే చేయించేందుకు పీపీఏ ఓకే కూడా చెప్పింది.
భూసేకరణపై తేల్చాలి..
ప్రాజెక్ట్ పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు తెలంగాణ రాష్ట్రంలో మునిగే భూములకు సంబంధించి పునరావాసం, పరిహారంపై ఇప్పటికీ తేలలేదు. ఈ క్రమంలోనే ముందుగా 41.67 మీటర్ల ఎత్తులో స్టోర్ చేస్తే మునిగే 954 ఎకరాలపై తేల్చాలని ప్రధానికి ప్రభుత్వం వివరించనుంది. అంతేగాకుండా.. పూర్తిస్థాయిలో నిల్వ చేసినప్పుడు మునిగే 53,393 ఎకరాలకు సంబంధించి.. 15,277.84 ఎకరాల భూసేకరణపై ఏపీ త్వరగా తేల్చేలా చూడాలని ప్రధానిని కోరనున్నట్టు తెలిసింది.
అలాగే, ఎక్కడైనా భూములు ముంపునకు గురైతే అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్టుగా బాధితులకు పరిహారం చెల్లించాలి. ఇప్పటివరకూ ఎక్కడా ప్రజాభిప్రాయం సేకరించలేదు. ఈ నేపథ్యంలోనే ముంపు మండలాల్లో ప్రజాభిప్రాయాన్ని తీసుకోవాలని ప్రధానిని అధికారులు కోరనున్నట్టు సమాచారం. పబ్లిక్ఒపీనియన్తీసుకున్న తర్వాత మిగిలిన ఆర్ అండ్ ఆర్ ఇష్యూస్‌ను ఏపీ తొందరగా తేల్చేలా ఆదేశాలిచ్చేలా చూడాలని కోరనున్నారు.
వాస్తవానికి ఇప్పటిదాకా జాయింట్ సర్వేకు ఏపీ ఒప్పుకోవడం లేదు. అసలు ముంపే ఉండదంటూ అడ్డంగా వాదిస్తున్నది. ఈ క్రమంలోనే జాయింట్ సర్వే.. లేదంటే సీడబ్ల్యూసీతోనో సర్వే చేయించేలా చూడాల్సిందిగా ప్రధానిని కోరనున్నట్టు చెబుతున్నారు. ఇవేగాకుండా చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలూ పోలవరం ప్రాజెక్టుపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాల అభ్యంతరాలనూ ప్రధాని అడిగి తెలుసుకోనున్నారు.