సిటీలో 38 వేల మంది పోలీసుల పహారా .. ఓల్డ్‌‌‌‌సిటీపై స్పెషల్ ఫోకస్‌‌‌‌

సిటీలో 38 వేల మంది పోలీసుల పహారా ..  ఓల్డ్‌‌‌‌సిటీపై స్పెషల్ ఫోకస్‌‌‌‌
  • క్రిటికల్ ఏరియాల్లో పోలీసుల ఫ్లాగ్‌‌‌‌ మార్చ్‌‌‌‌
  • 1042 మంది బైండోవర్
  • భద్రతను పర్యవేక్షిస్తున్న సీపీ సందీప్ శాండిల్య
  • సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల వివరాలతో రూట్ మ్యాప్‌‌‌‌ రెడీ

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో అత్యంత కీలకమైన సిటీ బందోబస్తుపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్లానింగ్ రూపొందిస్తున్నారు. హైదరాబాద్‌‌‌‌, సైబరాబాద్‌‌‌‌, రాచకొండ సీపీలు భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎలక్షన్ షెడ్యూల్‌‌‌‌ విడుదలైన నాటి నుంచి పటిష్టమైన చర్యలు చేపట్టారు. ఈసీ గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌ ప్రకారం చెక్‌‌‌‌పోస్ట్‌‌‌‌లు ఏర్పాటు చేసి వెహికల్‌‌‌‌ చెకింగ్‌‌‌‌ చేస్తున్నారు. ఒక్క సిటీ కమిషనరేట్ పరిధిలోనే కేంద్ర బలగాలు సహా మొత్తం 38వేల మందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు.1042 మంది రౌడీషీటర్లను బైండోవర్ చేశారు.

ప్రచారాల్లో గొడవలు చేస్తే కేసులు..

సిటీలోని ఐదు జోన్లలో ఓల్డ్‌‌‌‌సిటీ ఎక్కువగా విస్తరించిన సౌత్‌‌‌‌జోన్‌‌‌‌పై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రచారాల్లో గొడవలు చేసే వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. గత ఎన్నికల్లో గొడవలు చేసిన ఓల్డ్ అఫెండర్స్, రౌడీషీటర్లను స్థానిక ఆర్డీవోల ముందు బైండోవర్ చేశారు.  వారం రోజుల వ్యవధితో ఎంఐఎం, కాంగ్రెస్‌‌‌‌ కార్యకర్తలు, అభ్యర్థుల మధ్య గొడవలు జరిగిన నేపథ్యంలో పోలీసులు మరింత అలర్ట్​గా ఉంటున్నారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా పోస్టింగ్స్ చేస్తున్న వారిని సోషల్‌‌‌‌ మీడియా మానిటరింగ్ సెల్‌‌‌‌(స్మాష్‌‌‌‌) ద్వారా గుర్తిస్తున్నారు. తీవ్రతను బట్టి సుమోటో కేసులు నమోదు చేస్తున్నారు. ఆయా అభ్యర్థులపై ఎలక్షన్‌‌‌‌ కోడ్‌‌‌‌ కింద కేసులు రిజిస్టర్ చేస్తున్నారు.

1,587 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు.. 

సిటీ పోలీస్  కమిషనరేట్ పరిధిలో 1,587 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్‌‌‌‌ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో ఓల్డ్‌‌‌‌సిటీలోని పోలింగ్ స్టేషన్లపై స్థానిక డీసీపీలతో నిఘా పెంచారు. ఆయా పోలింగ్ స్టేషన్స్ పరిధిలో ఉన్న అభ్యర్ధులు, పొలిటికల్‌‌‌‌ లీడర్లు, రౌడీషీటర్స్‌‌‌‌, హిస్టరీ షీటర్స్‌‌‌‌ వివరాలను ఇప్పటికే సేకరించారు. ఇలాంటి ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించారు. అన్ని ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలు, పోలింగ్ స్టేషన్స్‌‌‌‌ వివరాలతో రూట్ మ్యాపింగ్ తయారు చేశారు. వీటిని సీపీ సహా జోన్‌‌‌‌ డీసీపీలు, ఏసీపీలకు అందుబాటులో ఉంచారు. ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే అలర్ట్ అయ్యే విధంగా సీపీలు యాక్షన్ ప్లాన్ రూపొందించారు.

మరిన్ని వార్తలు