దీంట్లో నిజమెంత?: రైతుపై లాఠీ ఝళిపించిన జవాన్

దీంట్లో నిజమెంత?: రైతుపై లాఠీ ఝళిపించిన జవాన్

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులపై రగడ నడుస్తోంది. ఈ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు దేశ రాజధాని ఢిల్లీలో నిరసన చేపట్టారు. ఛలో ఢిల్లీ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ఢిల్లీ వైపు వస్తున్న రైతులను నిలువరించేందుకు పోలీసులు టియర్ గ్యాస్‌‌ను ప్రయోగించారు. అయినా రైతులు వెనక్కి తగ్గకుండా సింఘూ బార్డర్ వద్ద భారీగా  బైఠాయించారు. ఎట్టకేలకు రైతుల ధర్నాకు కేంద్రం అనుమతిని ఇచ్చింది. అయితే అంతకుముందు సింఘూ సరిహద్దు వద్ద రైతులు చేపట్టిన ధర్నాలో కొంత ఉద్రిక్తత ఏర్పడింది. రైతులపై జవాన్లు లాఠీ ఝళిపించారు. పంజాబ్‌‌కు చెందిన 65 ఏళ్ల రైతుపై జవాన్ దాడి చేస్తున్నట్లుగా ఉన్న ఫొటో నెట్‌‌లో వైరల్ అయింది.

సదరు ఫొటోను కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీతోపాటు ప్రియాంక గాంధీ వాద్రా సోషల్ మీడియాలో షేర్ చేశారు. మోడీ సర్కార్ రైతు వ్యతిరేక ప్రభుత్వమంటూ కామెంట్స్ చేశారు. అయితే ఈ ఆరోపణలను బీజేపీ కొట్టిపారేసింది. రైతును జవాన్ కొడుతున్నట్లుగా ఉన్న సదరు ఫొటోపై ఓ బీజేపీ అభిమాని సోషల్ మీడియాలో స్పష్టతనిచ్చాడు. ఆ ఫొటోను అందరూ అపార్థం చేసుకున్నారని రైతును జవాన్ కొట్టలేదంటూ ఆ ఘటనకు సంబంధించిన వీడియోను షేర్ చేశాడు.