ప్రశ్నిస్తే లోపల ..టీఆర్​ఎస్​ నేతలకు కాపలా

ప్రశ్నిస్తే లోపల ..టీఆర్​ఎస్​ నేతలకు కాపలా
  • ప్రభుత్వ పెద్దల ధర్నాలు, రాస్తారోకోలకు భారీ బందోబస్తు
  • ప్రతిపక్షాలు, సామాన్యులు రోడ్డెక్కితే అణచివేత
  • సీఎం, మంత్రుల పర్యటనల్లో 
  • గృహ నిర్బంధాలు, ముందస్తు అరెస్టులు
  • అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో ఇబ్బందిపడుతున్న పోలీసులు

హైదరాబాద్‌‌, వెలుగు: ప్రభుత్వ పెద్దలు ఎక్కడికైనా వెళ్తున్నారంటే చాలు.. ముందస్తు అరెస్టులు. ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటనలు ముగిసే దాకా నిర్బంధాలు. ప్రతిపక్ష నేతలు, సామాన్యులు, రైతులు, నిరుద్యోగులు, ఆఖరికి బర్లు కాసేటోళ్లయినా సరే.. ప్రశ్నిస్తారనే అనుమానం వచ్చిందంటే లోపలేసుడే. ఇదీ రాష్ట్రంలో పోలీసింగ్ తీరు. దీంతో ఫ్రెండ్లీ పోలీసింగ్ కాస్తా వన్ సైడ్ పోలీసింగ్‌‌గా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ లీడర్ల టూర్లు, ధర్నాలకు కంటికి రెప్పలా కాపలా కాస్తున్న పోలీసులు..ప్రతిపక్షాలు, సామాన్యులపై మాత్రం తడాఖా చూపిస్తుండటం వివాదాస్పదమవుతోంది. అయితే టీఆర్ఎస్ లీడర్ల నుంచి వస్తున్న ఒత్తిళ్ల వల్లే తప్పని పరిస్థితుల్లో నిర్బంధాలు, హౌస్ అరెస్టులు చేయాల్సి వస్తున్నదని కొందరు పోలీసులు చెబుతున్నారు. హౌస్ అరెస్టులపై జనం నుంచి వస్తున్న నిరసనలతో తాము కూడా ఇబ్బంది పడాల్సి వస్తున్నదని వాపోతున్నారు. 

సామాన్యులు, రైతులను లోపలేస్తున్నరు

మంత్రి కేటీఆర్‌‌ సిరిసిల్ల పర్యటనకు వెళ్లిన ప్రతిసారి నిర్బంధాలు సాధారణమయ్యాయి. ఇసుక అక్రమ తరలింపునకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న దళితులతో పాటు పలువురు యువకులను పోలీసులు ముందుగానే అరెస్టు చేస్తున్నారు. కేటీఆర్‌‌ సిరిసిల్ల నుంచి వెళ్లే వరకు వాళ్లను ఠాణాలోనే ఉంచుతున్నారు. మంగళవారం కేటీఆర్‌‌ సిరిసిల్ల టూర్‌‌ సందర్భంగానూ పోలీసుల నిర్బంధం తప్పలేదు. మంత్రి హరీశ్‌‌రావు మహబూబాబాద్‌‌ జిల్లా పర్యటనకు వెళ్తే పది మంది వరకు గిరిజన రైతులను ముందుగానే అరెస్ట్‌‌ చేశారు. 

ఎక్కడికక్కడే కట్టడి

పీసీసీ చీఫ్‌‌ రేవంత్‌‌ రెడ్డి యాసంగి సీజన్‌‌ ఆరంభంలో ఎర్రవెల్లిలోని కేసీఆర్‌‌ ఫాం హౌస్‌‌లో సాగు చేసిన వరి పొలాన్ని ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తే పోలీసులు ఆయన్ను గృహ నిర్బంధం చేశారు.

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ పిలుపునిచ్చిన అనేక ఆందోళనలను ఇలాగే గృహ నిర్బంధాలతో అణచివేసే ప్రయత్నం చేశారు. గత నెలలో కరెంట్‌‌‌‌‌‌‌‌ బిల్లుల పెంపును నిరసిస్తూ పిలుపునిచ్చిన చలో విద్యుత్‌‌‌‌‌‌‌‌ సౌధ ముట్టడికి జిల్లాల నుంచి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు రాకుండా ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులతో కట్టడి చేశారు. ఇందిరాపార్క్‌‌‌‌‌‌‌‌లో నిరుద్యోగుల పక్షాన వైఎస్సార్‌‌‌‌‌‌‌‌టీపీ నాయకురాలు షర్మిల నిరుడు ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 15న నిరసన దీక్ష చేశారు. రెండో రోజు అక్కడే నిరాహార దీక్ష చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు ససేమిరా అన్నారు. ఇందిరాపార్క్‌‌‌‌‌‌‌‌ నుంచి లోటస్‌‌‌‌‌‌‌‌పాండ్‌‌‌‌‌‌‌‌లోని తన నివాసానికి ఆమె పాదయాత్రగా బయల్దేరగా అనుమతి లేదని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తోపులాట జరిగి ఆమెకు గాయాలయ్యాయి. ఉద్యోగుల సర్దుబాటు జీవో (317)కు నిరసనగా చలో సెక్రటేరియట్‌‌‌‌‌‌‌‌కు పిలుపునిచ్చిన ఉద్యోగ, ఉపాధ్యాయులపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. ఈ ఆందోళనకు ఎవరూ రాకుండా వేలాది మందితో గస్తీ ఏర్పాటు చేయించి టీచర్లు, ఉద్యోగులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.

రాహుల్‌‌‌‌‌‌‌‌ సభకు పర్మిషన్‌‌‌‌‌‌‌‌ అడిగినందుకు..

ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ముఖ్యనేత రాహుల్‌‌‌‌‌‌‌‌ గాంధీ ఈ నెల 7న ఇంటరాక్ట్‌‌‌‌‌‌‌‌ అవుతారని, ఆ సభకు పర్మిషన్‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌, ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌యూఐ నాయకులు పలుమార్లు ఓయూ వీసీని కలిసి విజ్ఞప్తి చేశారు. అనుమతి నిరాకరించడంతో వీసీకి పింక్‌‌‌‌‌‌‌‌ చీర, గాజులు ఇచ్చేందుకు ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్‌‌‌‌‌‌‌‌ వెంకట్‌‌‌‌‌‌‌‌, ఇతర నాయకులు వీసీ చాంబర్‌‌‌‌‌‌‌‌లోకి చొచ్చుకెళ్లారు. దీంతో పోలీసులు 17 మంది విద్యార్థులను అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు.
కోదండరాం ఇంటి డోర్‌‌‌‌‌‌‌‌ పగులగొట్టి..
టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ తొలి ప్రభుత్వ కాలం నుంచే పోలీసుల నిర్బంధం ఎక్కువగా ఉండేది. రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇది మరింత పెరిగింది. 2017 ఫిబ్రవరి 22న ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌తో కోదండరాం నిరసన ర్యాలీకి పిలుపునిచ్చారు. ఈ ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు వ్యవహరించిన తీరు విస్మయానికి గురిచేసింది. తెల్లవారుజామునే కోదండరాం ఇంటికి వెళ్లిన పోలీసులు.. గడ్డపారలతో తలుపులు పగులగొట్టి ఆయనను అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు.

సర్కారు ఆందోళనలకు రెడ్‌‌‌‌‌‌‌‌ కార్పెట్

రాష్ట్రంలో పండిన ప్రతి ధాన్యం గింజను కేంద్రమే కొనాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేస్తూ సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌, మొత్తం కేబినెట్‌‌‌‌‌‌‌‌ నిరుడు నవంబర్‌‌‌‌‌‌‌‌ 18న ధర్నా చౌక్‌‌‌‌‌‌‌‌లో ఆందోళన చేపట్టింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో అధికార పార్టీతోపాటు పోలీసులూ కీలకపాత్ర పోషించారు. ఇందిరాపార్క్‌‌‌‌‌‌‌‌ వైపునకు వెళ్లే రోడ్లన్నీ బ్లాక్‌‌‌‌‌‌‌‌ చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతు సంఘాలు 2020 డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 8న భారత్‌‌‌‌‌‌‌‌ బంద్‌‌‌‌‌‌‌‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌‌‌‌‌‌‌‌కు టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం మద్దతు తెలిపింది. సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ మినహా కేబినెట్‌‌‌‌‌‌‌‌లో ఉన్న మంత్రులంతా నేషనల్‌‌‌‌‌‌‌‌ హైవేలపై ఆందోళనకు దిగారు. ఈ నిరసనకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రోడ్లపై ప్రజలు ఇబ్బందులు పడుతున్నా వాళ్లను పట్టించుకున్న పాపానపోలేదు. ఈ యాసంగిలో రైతులు పండించిన వడ్లన్నీ కేంద్రమే కొనాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేస్తూ వారం రోజులకుపైగా టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ వివిధ రూపాల్లో నిరసన తెలిపింది. ఈ ఆందోళనలకు పోలీసులు సంపూర్ణ సహకారం అందించారు. మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో నేతలు ధర్నాలు చేశారు. సడక్‌‌‌‌‌‌‌‌ బంద్‌‌‌‌‌‌‌‌ పేరుతో నేషనల్‌‌‌‌‌‌‌‌ హైవేలపై రాస్తారోకో చేపట్టారు. భారీ పోలీసు పహారా మధ్య ఈ కార్యక్రమాలు సక్సెస్‌‌‌‌‌‌‌‌ అయ్యాయి. కేంద్రంపై పోరు పేరుతో ప్రభుత్వం చేసే ప్రతి ఆందోళనకు పోలీసులు గట్టి బందోబస్తు కల్పిస్తున్నారు. అదే ప్రతిపక్షాలు ప్రాజెక్టుల సందర్శనకు వెళ్తామని చెప్పినా, చలో ప్రగతి భవన్‌‌‌‌‌‌‌‌, రాజ్‌‌‌‌‌‌‌‌భవన్‌‌‌‌‌‌‌‌, అసెంబ్లీ, కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిస్తే ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు.

బండి సంజయ్‌‌‌‌‌‌‌‌ దీక్షపై ఓవరాక్షన్‌‌‌‌‌‌‌‌

ఉద్యోగుల సర్దుబాటు జీవో 317ను రద్దు చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేస్తూ కరీంనగర్‌‌‌‌‌‌‌‌లోని తన ఎంపీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో జనవరి రెండో తేదీన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌‌‌‌‌‌‌‌ జాగరణ దీక్షకు కూర్చున్నారు. కరోనా నిబంధనలు సాకుగా చూపి, ఆఫీస్‌‌‌‌‌‌‌‌ గ్రిల్స్‌‌‌‌‌‌‌‌ ఊడదీసి, డోర్లు, కిటికీలు పగులగొట్టి సంజయ్‌‌‌‌‌‌‌‌ సహా పలువురిని అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు. సంజయ్‌‌‌‌‌‌‌‌ అరెస్ట్‌‌‌‌‌‌‌‌ సందర్భంగా అత్యుత్సాహం చూపించిన కరీంనగర్‌‌‌‌‌‌‌‌ సీపీ సత్యనారాయణ, ఏసీపీలు కె.శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌, వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్లు రామచంద్రారావు, వి.శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌, నటేశ్‌‌‌‌‌‌‌‌లకు పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ ప్రివిలేజ్‌‌‌‌‌‌‌‌ కమిటీ నోటీసులు జారీ చేసింది.

పోలీసుల సమక్షంలోనే దాడులు

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను జోగులాంబ జిల్లా వేముల గ్రామం వద్ద టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ నేతలు అడ్డుకొని దాడికి దిగారు. పోలీసుల సమక్షంలోనే రాళ్లు విసిరి, బీజేపీ ఫ్లెక్సీలు కాల్చేశారు, కార్లు ధ్వంసం చేశారు. వానాకాలం సీజన్‌‌‌‌‌‌‌‌లో సూర్యాపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పరిశీలించేందుకు వెళ్లినప్పుడు కూడా సంజయ్‌‌‌‌‌‌‌‌పై, బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలు దాడి చేశారు.
  • వైఎస్సార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీపీ నాయకురాలు షర్మిల పాదయాత్రకు ఇలాగే అనేక చోట్ల టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ నేతలు అడ్డుతగిలారు. సూర్యాపేట సమీపంలో ఆమె పాదయాత్రపై దాడికి దిగారు.
  • మంచిర్యాల జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌తో పాటు పలువురు నేతలు.. కోటపల్లి మండలంలో దెబ్బతిన్న మిరప పంటను పరిశీలిస్తుండగా ప్రభుత్వ విప్‌‌‌‌‌‌‌‌ బాల్క సుమన్‌‌‌‌‌‌‌‌ అనుచరులు దాడి చేశారు.
  • రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెళ్లపల్లి మండలం బస్వాపూర్‌‌‌‌‌‌‌‌లో పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌‌‌‌‌‌‌‌పై టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ నాయకుడు అబ్బాడి అనిల్‌‌‌‌‌‌‌‌ దాడి చేశాడు. సిద్దిపేట జిల్లాలోని జక్కాపూర్‌‌‌‌‌‌‌‌ వద్ద పోలీసు అధికారుల సమక్షంలోనే ఈ ఘటన జరిగింది.
  • మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌ ముఖ్య అనుచరుడు, సిరిసిల్ల జిల్లా టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షుడు తోట ఆగయ్యతో పాటు గులాబీ నేతలు ఎల్లారెడ్డిపేట పోలీస్‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌లోనే బీజేపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో బీజేపీ కార్యకర్త రేపాక రామచంద్రం తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరు బీజేపీ కార్యకర్తలకు తీవ్రగాయాలు కాగా.. పోలీసులు వారిపైనే ఉల్టా కేసులు పెట్టారు.
  • వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో ఎంపీ అర్వింద్‌‌‌‌‌‌‌‌పై టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌, తెలంగాణ జాగృతి నేతలు దాడి చేశారు. ఆయన కారు అద్దాలు ధ్వంసం చేశారు. నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలోనూ పలుమార్లు అర్వింద్ క్యాన్వాయ్‌‌‌‌‌‌‌‌పై పోలీసుల సమక్షంలోనే టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ నేతలు దాడికి పాల్పడ్డారు.

మంత్రులు వస్తున్నరని రైతుల నిర్బంధం

మహబూబాబాద్​జిల్లా కేంద్రానికి మంత్రులు హరీశ్​రావు, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ వస్తున్నారని బాబు నాయక్ తండా, సాంక్రియా నాయక్ తండాకు చెందిన గిరిజన రైతులను పోలీసులు మంగళవారం నిర్బంధించారు. చివరకు పొలంలో పనులు చేసుకుంటున్న మహిళలను కూడా బలవంతంగా లాక్కెళ్లారు. జిల్లాకు కొత్తగా మంజూరైన మెడికల్, నర్సింగ్​కాలేజీల కోసం ఈ రెండు తండాల్లోని 30 గిరిజన కుటుంబాలకు చెందిన 38 ఎకరాల అసైన్డ్ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ కాలేజీల నిర్మాణ పనుల ప్రారంభానికి మంత్రులు వెళ్లడంతో పోలీసులు రైతులను పోలీస్​స్టేషన్​కు తరలించి రోజంతా నిర్బంధించారు. 
ఈ నెల రెండో తేదీన మంచిర్యాల జిల్లా పర్యటనకు వెళ్లిన మంత్రులను అడ్డుకుంటారనే నెపంతో బర్లు మేపేందుకు వెళ్లిన పాల రాజయ్య అనే రైతును అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. తాను బర్లను వదిలి రాలేనని చెప్పడంతో రాజయ్యకు కాపలాగా ఒక పోలీసును సాయంత్రం వరకు అక్కడే ఉంచారు.