ఫొటోలు తీయడం.. ఫైన్లు వేయడంలో పోలీసులు బిజీ

ఫొటోలు తీయడం.. ఫైన్లు వేయడంలో పోలీసులు బిజీ
  • సీసీ కెమెరాలు కూడా చలాన్ల పనిలోనే
  • వర్షం పడిందంటే పోలీసులు గాయబ్
  • గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌‌తో జనం బేజార్
  • హైదరాబాద్‌‌లో ఆరు నెలల్లో 40 లక్షలకు పైగా కేసులు
  • ఎనిమిదేండ్లలో రూ.2,671 కోట్ల ఫైన్లు

గ్రేటర్ హైదరాబాద్‌‌లో ట్రాఫిక్‌‌ను కంట్రోల్ చేయాల్సిన పోలీసులు ఫైన్లు వేయడంలో బిజీగా ఉంటున్నరు. వెహికల్స్​ ఫొటోలు తీయడం, చలాన్లు వేయడమే పనిగా పెట్టుకున్నరు. గతంలో చౌరస్తాలు, జామ్ ఏర్పడిన ప్రాంతాల్లో ట్రాఫిక్‌‌ను నియంత్రించిన పోలీసులు.. ఇప్పుడు అంతగా దృష్టి పెట్టడం లేదు. ఎక్కువగా వెహికల్స్ ఆపి ఫైన్లు వేస్తూనే కనిపిస్తున్నరు. రద్దీ టైమ్​లో తనిఖీలు చేస్తూ మరింత ట్రాఫిక్‌‌ జామ్‌‌కు కారణమవుతున్నరు. సీసీ కెమెరాలను కూడా ట్రాఫిక్ కంట్రోల్ కోసం కాకుండా చలాన్లు వేయడానికే ఉపయోగిస్తున్నరు. 

హైదరాబాద్, వెలుగు: బండ్ల ఫొటోలు తీయడం.. చలాన్లు విధించడం, వెహికల్స్‌‌ను పట్టుకోవడం.. ఫైన్లు వేయడం.. ఇప్పుడిదే ట్రాఫిక్ పోలీసుల డ్యూటీ అయిపోయింది. కోట్లలో వాహనాలు ఉన్న గ్రేటర్ హైదరాబాద్‌‌లో ట్రాఫిక్‌‌ నియంత్రణను మాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా జనాలకు తిప్పలు తప్పడంలేదు. గ్రేటర్‌‌‌‌లోని మూడు కమిషనరేట్లలో ఐదు వేల మంది ట్రాఫిక్ పోలీసులు ఉండగా.. వీరిలో మెజారిటీ సిబ్బంది చలాన్లు వేస్తూ కనిపిస్తున్నారు. ఎవరినైనా కదిలిస్తే సర్కారు టార్గెట్‌‌కు అనుగుణంగా పని చేయాల్సి వస్తున్నదని ఓపెన్‌‌గానే చెబుతున్నారు.

ట్రాఫిక్ జామ్ అయినా పట్టించుకుంటలే

ప్రతి రోజు ట్రాఫిక్ పోలీసులు రెండు షిఫ్టుల్లో పని చేస్తారు. ఉదయం వచ్చే సిబ్బంది ఎనిమిది నుంచి 10 గంటల వరకు చౌరస్తాల్లో కనిపిస్తున్నారు. షిఫ్ట్‌‌ మారిన తర్వాత మళ్లీ 3 గంటల నుంచి వెహికల్‌‌ చెకింగ్‌‌పై ఫోకస్‌‌ చేస్తున్నారు. మేజర్ జంక్షన్లలో ఒకరిద్దరు ట్రాఫిక్‌‌ను కంట్రోల్ చేస్తుంటే.. మిగతా వాళ్లు ఒక చోట అడ్డా వేసి వాహనాలు ఆపి చలాన్లు వేస్తున్నారు. లేదా ఏదో ఒక మూలకు, చాటుగా నిలబడి ఫొటోలు తీస్తున్నారు. జంక్షన్లలో ట్రాఫిక్ పోలీసుల కోసం ఏర్పాటు చేసిన అంబ్రెల్లాల్లో కూడా కెమెరాలు పట్టుకొనే కనిపిస్తున్నారు. సిగ్నల్ జంపింగ్, వితౌట్ హెల్మెట్, ట్రిపుల్ రైడింగ్​లాంటి ఫొటోలు తీస్తున్నారు. కనీసం ట్రాఫిక్ గందరగోళంగా మారినప్పుడు కూడా నియంత్రించే ప్రయత్నం చేయట్లేదని జనం నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. మరోవైపు ఉదయం షిఫ్ట్‌‌లో ఉండేటోళ్లు 10 గంటల తర్వాత.. సాయంత్రం షిఫ్ట్‌‌లో ఉండేటోళ్లు రాత్రి 7 తర్వాత కనిపించకుండా పోతున్నారు. జంక్షన్స్‌‌లో ట్రాఫిక్ సిగ్నల్స్‌‌ను ఆపరేట్‌‌ చేసేందుకు ఒక కానిస్టేబుల్‌‌, హోంగార్డ్‌‌ మాత్రమే ఆన్‌‌డ్యూటీలో ఉంటున్నారు. డ్రంకన్‌‌ డ్రైవ్‌‌ చెకింగ్‌‌ సమయంలో సాధారణ ట్రాఫిక్‌‌ను పట్టించుకోవడంలేదు. చెకింగ్‌‌ స్పాట్‌‌లో కాకుండా ఇతర ప్రాంతాల్లో ట్రాఫిక్‌‌ జామ్‌‌ అయినప్పటికీ లైట్‌‌ తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని చోట్ల రాత్రిళ్లు జంక్షన్లలో సిగ్నల్స్ పని చేయకున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.

చినుకు పడితే చుక్కలే

గతంలో సిటీలో గట్టి వర్షం పడి రోడ్లపై నీళ్లు నిలిస్తే ట్రాఫిక్ పోలీసులే రంగంలోకి దిగేవారు. జీహెచ్ఎంసీ సిబ్బంది కన్నా ట్రాఫిక్ సిబ్బందే నీళ్లు క్లియర్ చేస్తూ కనిపించే వాళ్లు. మ్యాన్​హోల్ మూతలు తెరిచి, చెత్తాచెదారం తట్టుకుంటే క్లీన్ చేసి నీళ్లు పోయేలా శ్రమించేవాళ్లు. కానీ ఇప్పుడు నాలుగు చినుకులు పడ్డాయంటే చాలు ట్రాఫిక్ పోలీసులు అక్కడి నుంచి గాయబ్ అవుతున్నారని జనం అంటున్నారు. హైదరాబాద్‌‌లో చిన్న వర్షానికి కూడా రోడ్లు జలమయమవుతాయి. కొన్ని రోడ్లు, ఫ్లైఓవర్ల వద్ద ట్రాఫిక్ నిలిచి వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆఫీసులు, స్కూళ్లు వదిలే సమయంలో వర్షం పడితే పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. గంటల కొద్దీ ట్రాఫిక్‌‌లోనే అవస్థలు పడాల్సి వస్తుంది. కొన్ని చోట్ల జనమే చొరవ చూపి ట్రాఫిక్‌‌ను నియంత్రిస్తున్న పరిస్థితి. ఈ విషయంపై ఒక అధికారిని ప్రశ్నించగా.. ‘‘చాలాసార్లు జీహెచ్ఎంసీ సిబ్బంది చేయాల్సిన పనిని మేం చేస్తున్నాం. అసహనంతో ఉన్న జనం మా సిబ్బందిపై కోపానికి వస్తున్నారు. చిన్న వర్షానికే సిటీలోని రోడ్లపైకి నీళ్లు వస్తుంటే మేమెంత వరకు ట్రాఫిక్‌‌ను కంట్రోల్ చేయగలం” అని చెప్పుకొచ్చారు. సిటీలోని వాటర్ లాగింగ్ పాయింట్ల గురించి గ్రేటర్ అధికారులను తాము సీజన్​కు ముందే అలెర్ట్ చేస్తున్నామని 
తెలిపారు.

ఆదాయ వనరుగా చలాన్లు

ప్రభుత్వం వెహికల్ చలాన్లను ఆదాయ వనరుగా మార్చుకుంది. దాంతో ఉన్నతాధికారులు ఇచ్చిన టార్గెట్ పూర్తి చేసేందుకు.. అసలు డ్యూటీ వదిలి ఫైన్ల డ్యూటీ చేయాల్సి వస్తోందని సిబ్బంది చెబుతున్నారు. ఏటా టార్గెట్ పెంచుతూ ఉండడంతో కేసులు అదే స్థాయిలో పెరుగుతున్నాయి. 2014లో రాష్ట్రవ్యాప్తంగా ఎంవీ యాక్టు కింద 50 లక్షల కేసులు పెడితే.. 2021 వచ్చే నాటికి అది రెండు కోట్లు దాటింది. రూ.95 కోట్ల ఫైన్ అమౌంట్  రూ.877 కోట్లకు చేరింది. ఎనిమిదేండ్లలో తొమ్మిది కోట్ల కేసులు పెట్టి.. రూ.2,671 కోట్ల ఫైన్లను 
జనంపై వేశారు.

ప్రతి నెలా లక్షల్లో..

గ్రేటర్‌‌‌‌ హైదరాబాద్‌‌లో ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో మూడు కమిషనరేట్ల పరిధిలో 42.30 లక్షల ట్రాఫిక్‌‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో సీసీటీవీ కెమెరాలు, డిజిటల్‌‌ కెమెరాలతో ఫొటోలు తీసినవి సుమారు 32.54 లక్షల కేసులు ఉన్నాయి. వీటితో పాటు పోలీసులు స్పాట్‌‌లో నమోదు చేసే కేసులు 9.83 లక్షలు ఉన్నాయి. 2020లో 1.48 కోట్లు, 2021లో 1.51 కోట్ల చలాన్లు విధించారు.

గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్‌‌ కంపెనీలో పనిచేస్తున్నా. రాత్రి 8 గంటలకు ఆఫీస్‌‌ నుంచి బయలుదేరుతా. నేను వెళ్లే ఏరియాలోని చాలా సిగ్నల్స్‌‌ వద్ద పోలీసులు కనిపించరు. ఎక్కడ ట్రాఫిక్ జామ్‌‌ అయినా వాహనదారులు క్లియర్ చేసుకోవాల్సిందే. మెయిన్ రూట్స్, ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రాత్రి 11 గంటల వరకు పోలీసులను డ్యూటీలో పెట్టాలి.

‌‌‌‌- రాజ్‌‌కుమార్‌‌‌‌, 
ఐటీ డెవలపర్‌‌, ఎల్బీనగర్‌‌‌‌‌‌

నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ షాప్‌‌లో  పనిచేస్తున్నా. రాత్రి 9 గంటలకు షాప్‌‌ క్లోజ్‌‌ చేసి వెళ్తాను. సికింద్రాబాద్‌‌లోని మా ఇంటికి వెళ్లే రూట్‌‌లో ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్‌‌ డ్రైవ్‌‌ చెకింగ్‌‌ చేస్తుంటారు. ఈ రూట్స్‌‌లో ట్రాఫిక్ జామ్‌‌ అయినా సరిగా పట్టించుకోరు. కేవలం డ్రంకన్ డ్రైవ్‌‌పైనే ఫోకస్ పెడుతున్నారు. జంక్షన్స్‌‌ వద్ద కనిపించరు.

- సునీల్‌‌, ప్రైవేట్‌‌ ఉద్యోగి