కేటీఆర్​ వస్తుండంటే చాలు.. పట్టుకపోతున్నరు

V6 Velugu Posted on Jun 10, 2021

  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీసుల తీరిది
  • నేరెళ్ల బాధితులను, నిర్వాసితుల కోసం 
  • పోరాడెటోళ్లను, ప్రతిపక్ష లీడర్లను ఎవర్నీ వదుల్తలే
  • తెల్లవారకముందే అదుపులోకి.. రోజంతా నిర్బంధం

రాజన్న సిరిసిల్ల, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్​ పర్యటన ఉందంటే చాలు.. పోలీసులు ప్రతిపక్ష లీడర్లతోపాటు పలువురిని రోజంతా నిర్బంధిస్తున్నారు.  ప్రభుత్వ పెద్దల ఆదేశాలో, పోలీసుల అత్యుత్సాహమో తెలియదుగానీ కేటీఆర్​ పర్యటన ఉన్న రోజు మబ్బుల్నే కొందరు బీజేపీ, కాంగ్రెస్​లీడర్లతో పాటు  నేరెళ్ల బాధితులు, నిర్వాసితుల పక్షాన పోరాడుతున్న నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. తెల్లవారక ముందే వచ్చి తలుపులుకొట్టి నిద్రలేపి మరీ పోలీస్​స్టేషన్​కు తీసుకపోతున్నారు. అట్ల కాకపోతే హౌస్​ అరెస్ట్​ చేస్తున్నారు. 

కేటీఆర్ ​సిరిసిల్ల పర్యటన ఉందంటే పట్టణానికి చెందిన బీజేపీ నేత అన్నల్​దాస్​  వేణు, రెడ్డబోయిన గోపి, రాజా సింగ్, కైలాస్​సింగ్​తో పాటు పలువురిని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్​స్టేషన్లలో నిర్బంధిస్తున్నారు. ఇప్పటికి ఒక్కో నాయకుడిని పది ఇరవై సార్లు పట్టుకెళ్లారు. గంభీరావుపేట మండలానికి మంత్రి కేటీఆర్  వస్తున్నారంటే.. బీజేపీ మండల అధ్యక్షుడు అశోక్ తో పాటు ఎంపీటీసీ సభ్యుడు రాజేందర్ రెడ్డిని, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధులు ప్రసాద్ రెడ్డి, దేవసాని కృష్ణ, మెకార్తి శ్రీనివాస్, కృష్ణకాంత్ ను అరెస్టు చేస్తున్నారు. ముస్తాబాద్ మండలంలో కేటీఆర్ పర్యటన ఉన్న ప్రతిసారీ  బీజేపీ మండల అధ్యక్షుడు కార్తీక్ రెడ్డి, మైలవరం సంతోష్ రెడ్డి, కారెడ్ల మల్లారెడ్డి, కోలా కృష్ణ , క్రాంతి , శ్రీనివాసరావు, ఇతర నాయకులను పట్టుకెళ్తున్నారు. వీళ్లను ఇప్పటివరకు 15 సార్లు ముందస్తుగా అరెస్టు చేశారు.

మిడ్​మానేర్​ నిర్వాసిత  నేతలనూ వదలట్లే.. 

మంత్రి కేటీఆర్  పర్యటన సందర్భంగా మిడ్ మానేర్ ముంపు గ్రామాల ఐక్యవేదిక అధ్యక్షుడు కూస రవీందర్​ను ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. నిర్వాసితుల సమస్యలపై ప్రశ్నిస్తాడన్న కారణంతో ఆయనను ముందస్తుగా అరెస్ట్​ చేస్తున్నారు. కేటీఆర్ బోయినపల్లి మండల పర్యటనకు వచ్చినప్పుడల్లా బీజేపీ మండల అధ్యక్షుడు గుడి రవీందర్ రెడ్డి,  నర్సింహాచారి, ఏనుగుల కనుకయ్య, కొండం శ్రీనివాస్ రెడ్డి, గంగాధర్ చారి, జువ్వెన్తుల శ్రీనివాస్ రెడ్డి, జనగాం లక్ష్మణ్ తదతరులను అరెస్టు చేస్తున్నారు.  చందుర్తి మండలంలో మూడపల్లి రైతు వేదిక ప్రారంభోత్సవానికి కేటీఆర్ వస్తున్నారని చందుర్తి జెడ్పీటీసీ సభ్యుడు నాగం కుమార్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చింతపండు రామస్వామి, జోగాపూర్ ఎంపీటీసీ సభ్యుడు మేకల గణేష్, నేతి కుంట జలపతి, బొజ్జ మల్లేశం, గొట్టె ప్రభాకర్, లింగంపల్లి అజయ్, దారం చందును ముందస్తుగా అరెస్ట్ చేశారు. కోనరావుపేట మండలంలో మల్కపేట రిజర్వాయర్ సందర్శనకు కేటీఆర్​ వచ్చినప్పుడల్లా, ఇటీవల రైతువేదిక భవనం ప్రారంభోత్సవ సమయంలోనూ బీజేపీ, కాంగ్రెస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు గొట్టే రామచంద్రం, జిల్లా కార్యదర్శి గోపాడి సురేందర్ రావు, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు బాలాజీ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఫిరోజ్ పాషా, ఎంపీటీసీ సభ్యుడు ప్రవీణ్ తదితర నాయకులను తరుచూ పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. వేములవాడలో వంద పడకల ఆస్పత్రి ప్రారంభోత్సవం సందర్భంగా  కౌన్సిలర్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు రేగుల సంతోష్ బాబు, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జింక అనిల్​ను ముందస్తుగా  అరెస్ట్​ చేశారు. బీజేపీ నేత ప్రతాప రామకృష్ణను, కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్​నైతే పోలీసులు లెక్కలేనన్ని సార్లు గృహనిర్బంధం చేశారు. ప్రభుత్వ పెద్దలు, పోలీసుల తీరుపై ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. ఇది అప్రజాస్వామికమని, తమ జీవించే హక్కును ఉల్లంఘించడమేనని విమర్శిస్తున్నారు. 

నిత్యబాధితుడు కోల హరీశ్​.. 

సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ టూర్​ ఉన్న ప్రతిసారీ పోలీసులు నేరెళ్లకు చెందిన కోల హరీశ్​ను అదుపులోకి తీసుకుంటున్నారు. గతంలో ఇసుక లారీలకు అడ్డుతగిలారనే కారణంతో హరీశ్​పై పోలీసులు థర్డ్​ డిగ్రీ ప్రయోగించారు. అనంతరం ఒకసారి కేటీఆర్ పర్యటనలో హరీశ్​ తన ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. అప్పటి నుంచి గడిచిన మూడేండ్లుగా కేటీఆర్ ​సిరిసిల్ల వచ్చినప్పుడల్లా హరీశ్​ను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్​స్టేషన్​కు తరలించడమో, గృహనిర్బంధం విధించడమో చేస్తున్నారు.

ఇది అన్యాయం

మంత్రి కేటీఆర్ నియంతలా మారిండు. ఆయన జిల్లా పర్యటనకు వచ్చినప్పుడల్లా మమ్మల్ని అరెస్టు చేయిస్తున్నరు. ఇది అన్యాయం. ఇచ్చిన హామీలు నెరవేర్చక పోతే నిలదీసే హక్కు మాకుంది. అలాగని ముందస్తు అదుపులోకి తీసుకోవడమేనా?   వేములవాడ ఎమ్మెల్యే రమేశ్​ బాబు లేక ఏడాదైంది. ఇది మాత్రం మంత్రికి పట్టదు.
- రేగుల సంతోష్ బాబు,    బీజేపీ వేములవాడ పట్టణ అధ్యక్షుడు

కేటీఆర్​ డైరెక్షన్​లోనే ఇట్ల..

నేరెళ్ల ఘటనతో మా జీవితాలు నాశనం అయ్యాయి. ఏ పనీ చేసుకోలేకపోతున్నం. ఘటన జరిగి ఐదేండ్లయినా నిందితులపై చర్యలు తీసుకోలే. మా పక్షాన న్యాయం ఉందని హైకోర్టు చెప్పినా ఈ రాష్ట్ర సర్కారు పట్టించుకోవట్లే. మంత్రి కేటీఆర్ జిల్లాకు వచ్చినప్పుడల్లా నన్ను అరెస్ట్ చేస్తున్నారు. ఇది అప్రజాస్వామికం. కేటీఆర్​ డైరెక్షన్ లోనే ఈ ముందస్తు అరెస్ట్​లు జరుగుతున్నాయి. 
- కోల హరీశ్​, నెరెళ్ల బాధితుడు 

Tagged POLICE, arrest, Opposition Leaders, Minister KTR tour, Rajanna Sirisilla

Latest Videos

Subscribe Now

More News