పోలీసుల అదుపులో Q న్యూస్ ఆఫీస్

పోలీసుల అదుపులో Q న్యూస్ ఆఫీస్

తీన్మార్ మల్లన్నను మరోసారి పోలీసులు అరెస్ట్ చేశారు. క్యూ న్యూస్ ఆఫీసులో గంట సేపు సోదాలు చేశారు. Q న్యూస్ ఆఫీస్ లోని కంప్యూటర్లు, హార్డ్ డిస్క్ లను పరిశీలించారు. ఇప్పటికే కొన్ని కంప్యూటర్లు, హార్డ్ డిస్క్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 20మంది పోలీసులు.. మేడ్చల్ జిల్లా  పీర్జాదిగూడలోని Q న్యూస్ ఆఫీస్ లో బలవంతంగా సోదాలు నిర్వహించారు. 

 

మార్చి 21 సాయంత్రం క్యూ న్యూస్ ఆఫీసులోకి వెళ్లిన పోలీసులు...అందులోని ఉద్యోగులను, ఇతర సిబ్బందిని బయటకు పంపారు. అటు క్యూ న్యూస్ ఆఫీసుకు పోలీసులు రావడంతో  ఉద్యోగులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. మళ్లీ  ఏం జరగనుందో అని టెన్షన్ కు గురయ్యారు. ఉద్యోగులు బయటకు వెళ్లిన తర్వాత Q న్యూస్ ఆఫీస్ లో పోలీసులు సోదాలు నిర్వహించారు. అయితే పోలీసులు Q న్యూస్ ఆఫీస్ లో ఎందుకు సోదాలు నిర్వహించారని మాత్రం చెప్పలేదు. క్యూ న్యూస్ ఆఫీసులో పోలీసులు సోదాలు నిర్వహించడంతో పాటు..మల్లన్నను అరెస్ట్ చేయడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.

తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేసి, ప్రస్తుతం ఎక్కడకు తీసుకెళ్తారు..? ఏం చేస్తారనేదానిపైనా ఆయన కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు మల్లన్నను అరెస్ట్ చేశారన్న వార్తలతో క్యూ న్యూస్ ఆఫీసుకు ఆయన అభిమానులు, పలు న్యూస్ ఛానళ్లు అక్కడకు చేరుకున్నాయి. అయితే పోలీసులు మాత్రం Q న్యూస్ ఆఫీస్ పరిసరాల్లోకి ఎవరినీ అనుమతించడం లేదు. 

కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీన్మార్ మల్లన్న తన గళం విప్పుతున్నారు. Q న్యూస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్నారు. సీఎం కేసీఆర్ కుటుంబంతో పాటు ఆయన పాలన తీరుపై విమర్శలు చేస్తున్నారు. కొన్నిసార్లు మంత్రులపై పలు ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే చాలాసార్లు Q న్యూస్ ఆఫీసుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేశారు.