మియాపూర్ హెచ్ఎండీఏ భూ వివాదంలో 52 మంది అరెస్ట్

మియాపూర్ హెచ్ఎండీఏ భూ వివాదంలో 52 మంది అరెస్ట్

మియాపూర్, వెలుగు: మియాపూర్ సర్వే నంబర్​100,101లోని హెచ్ఎండీఏ భూములను ఆక్రమించేందుకు ప్రయత్నించిన మరో 21 మందిని మంగళవారం పోలీసులు అరెస్ట్​చేశారు. వారు తెలిపిన ప్రకారం.. మియాపూర్​లో హెచ్ఎండీఏ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని ఇండ్ల స్థలాలుగా పంపిణీ చేస్తున్నారని ఇటీవల కొందరు ప్రచారం చేయడంతో నిరుపేదలు ఆక్రమించేందుకు ప్రయత్నించారు. వారికి అవగాహన కల్పిస్తుండగా, కొందరు పోలీసులపైకి రాళ్లు విసిరారు. వారిపై మియాపూర్​ పోలీసులు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఆదివారం 21 మందిని, సోమవారం 10 మంది అరెస్ట్ చేయగా, మంగళవారం మరో 21 మందిని అదుపులోకి తీసుకున్నట్లు మియాపూర్ పోలీసులు వెల్లడించారు. ఇప్పటి వరకు మొత్తం 52 మందిని అరెస్ట్​చేసినట్లు స్పష్టం చేశారు. 

రంగారెడ్డి కలెక్టర్​ పరిశీలన

మియాపూర్​సర్వే నంబర్100,101లోని హెచ్ఎండీఏ భూములను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక మంగళవారం పరిశీలించారు. అధికారులంతా ఎన్నికల హడావుడిలో ఉండగా కొందరు ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించారని తెలిపారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. మొత్తం భూమిని సర్వే చేసి, ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. స్థలం చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. రాళ్లు రువ్విన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.