ఫోన్లు చోరీ చేసి.. డబ్బులు కొట్టేసి .. నిందితులను అరెస్టు చేసిన సిద్దిపేట పోలీసులు

ఫోన్లు చోరీ చేసి..  డబ్బులు కొట్టేసి .. నిందితులను అరెస్టు చేసిన సిద్దిపేట పోలీసులు

సిద్దిపేట రూరల్, వెలుగు: అమాయకులే లక్ష్యంగా ఫోన్ల దోపిడీకి పాల్పడుతూ అందులోని గూగుల్ పే, ఫోన్ పేలలో ఉన్న డబ్బులను మాయం చేస్తున్న నిందితులను అరెస్టు చేసినట్లు సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను తెలిపారు. మంగళవారం రూరల్ సీఐ ఆఫీస్ లో ఎస్ఐ రాజేశ్​, చిన్నకోడూర్ ఎస్ఐ సైఫ్ అలీతో కలసి కేసు వివరాలను ఆయన వెల్లడించారు.  నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రానికి చెందిన చెట్టు మహేశ్  హైదరాబాద్‌లో  అమాయకులను టార్గెట్ గా చేసుకొని వారి ఫోన్లను దొంగిలించి అమ్ముకొని జల్సాలు చేసేవాడు.  అతడిని మెహదీపట్నం పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపగా,  జైలు నుంచి విడుదలయ్యాడు. తర్వాత అతను సిద్దిపేట పట్టణంలో వరుసకు బావ అయిన కావడి అశోక్ , అతని చిన్నమ్మ కొడుకులు గారడి గోపి, ప్రశాంత్ లో కలిసి కూలి పనికి వెళ్లేవాడు.   వచ్చిన డబ్బులు జల్సాలకు సరిపోకపోవడంతో మహేశ్ తాను హైదరాబాద్ లో  చేసిన సెల్ ఫోన్ దొంగతనాల విషయాన్ని ముగ్గురికి తెలిపాడు. 

వారితో కలిసి సిద్దిపేట పాత బస్టాండ్ లో అమాయకులను టార్గెట్ చేసుకొని, వారు పాస్వర్డ్ ఓపెన్ చేసిన సమయంలో చూసి, ఆ ఫోన్లను దొంగతనం చేసి వాటి లాక్ లను ఓపెన్  చేసేవాడు.  ఆ ఫోన్లో నుంచి ఇతరులకు డబ్బులు పంపి, తమకు అత్యవసరం ఉన్నాయని చెప్పి వారి దగ్గర నగదు తీసుకునేవారు. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి ఫోన్ ను దొంగతనం చేసి, అందులో ఉన్న రూ. 70 వేలను, మరో వ్యక్తి ఫోన్ లో ఉన్నరూ.75  వేలను ఇతరులకు పంపి మళ్లీ డబ్బులు తీసుకున్నారు. ఈ నెల 28న మళ్లీ డబ్బుల కోసం వెళుతున్న క్రమంలో మెదక్ రూట్ లో రూరల్ పోలీసులు వారి వాహనాన్ని ఆపారు. దీంతో వారు  పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు పట్టుకుని విచారించగా నేరాలు ఒప్పుకున్నారు.  నిందితుల నుంచి రూ. 50 వేలతో పాటు, మారుతి కారు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్ కు పంపినట్లు సీఐ తెలిపారు.