ఇన్వెస్ట్మెంట్ పేరుతో రూ.కోటి కాజేసిన సైబర్ చీటర్లు అరెస్టు

ఇన్వెస్ట్మెంట్ పేరుతో రూ.కోటి కాజేసిన సైబర్ చీటర్లు అరెస్టు

బషీర్​బాగ్​, వెలుగు: ఇన్వెస్ట్​మెంట్ పేరుతో ఓ మహిళ వద్ద రూ.కోటి కాజేసిన ఆన్​లైన్​ చీటర్లను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ క్రైం డీసీపీ కవిత తెలిపిన ప్రకారం.. తార్నాకకు చెందిన 34 ఏళ్ల మహిళకు సైబర్ చీటర్లు ఇన్​స్టాగ్రాం, టెలిగ్రామ్ ద్వారా నకిలీ ట్రేడింగ్ లింక్స్ లు పంపించి పెట్టుబడులు పెట్టించారు. మొదట కొంతమొత్తంలో పెట్టుబడి పెడితే లాభాలు వచ్చినట్లు చూపించారు. 

దీంతో వారిని నమ్మిన సదరు మహిళ 2025 జనవరి నుంచి జులై వరకు పలు దఫాలుగా రూ.కోటి 5 లక్షలు ఇన్వెస్ట్ చేసింది. ఆ తరువాత వారు ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వలేదు. బాధితురాలు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు హర్షవర్ధన్ , కొండూరు వేణు , మైలారం ప్రదీప్, పచ్చిపల వినోద్ యాదవ్ , పరసనబోయిన వంశీ, మంగలి లక్ష్మణ్  అనే ఆరుగురు నిందితులను శుక్రవారం అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు. ఆరుగురి వద్ద 15 డెబిట్ కార్డులు , 3 పాస్ బుక్స్ , చెక్ బుక్ , 8 ఫోన్లు, ఫింగర్ ప్రింట్ మిషన్, స్కానర్ లను సీజ్ చేశారు.