
హైదరాబాద్/బషీర్ బాగ్, వెలుగు: పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ లీడర్లు సోమవారం అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు వినతి పత్రం అందజేసేందుకు సోమవారం మసాబ్ ట్యాంక్ లోని ఎన్నికల సంఘం ఆఫీస్ నుంచి అసెంబ్లీకి ర్యాలీగా వెళ్తున్న జేఏసీ అధ్యక్షుడు సుర్వీ యాదయ్య గౌడ్‌తో పాటు పలువురు మాజీ సర్పంచ్‌లను పోలీసులు అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా యాదయ్య గౌడ్ మాట్లాడుతూ.. అప్పులు చేసి గ్రామాల అభివృద్ధి చేసినా పెండింగ్ బిల్లులు రాక.. ఇప్పటికే చాలామంది సర్పంచులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన సందర్భంగా రూ. కోట్లు వెచ్చించి ప్రజా పాలన విజయోత్సవాలు జరుపుకుంటోందని, కానీ, తమ బిల్లులు చెల్లించకపోవడం బాధాకరన్నారు. దయచేసి అసెంబ్లీ ముగిసేలోపు పెండింగ్‌లో ఉన్న రూ.500 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా, రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మి నర్సింహా రెడ్డిని తెల్లవారుజామున ముందస్తుగా అరెస్టు చేసి ఐఎస్ సదన్ పీఎస్‌కు తరలించారు.