- పంచాయతీ సెక్రటరీలు విధుల్లో నిర్లక్ష్యం చేయొద్దు
- లాంగ్ స్టాండింగ్ లో ఉన్న వారిని బదిలీ చేయాలి
బోధన్, వెలుగు : గ్రామాల అభివృద్ధి కోసం పంచాయతీ సెక్రటరీలు అంకిత భావంతో పని చేయాలని ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి సూచించారు. బుధవారం బోధన్ పట్టణంలోని లయన్స్ భవన్ లో నియోజకవర్గస్థాయి పంచాయతీ సెక్రటరీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. సెక్రటరీలు విధుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
పంచాయతీలకు సరిపడా నిధులు సమకూర్చుకున్నప్పుడే అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఏండ్ల తరబడి పన్నులు చెల్లించని వారికి నోటీసులు జారీ చేయాలని సూచించారు. మార్చి నెలాఖరు నాటికి అన్ని గ్రామాల్లో వంద శాతం పన్నులు వసూలు కావాలన్నారు. పన్ను వసూళ్లలో వెనుకబడిన సెక్రటరీలకు నోటీసులు జారీ చేయాలని డీపీవోను ఆదేశించారు. సుదీర్ఘ కాలం నుంచి ఒకేచోట విధులు నిర్వహిస్తున్న సెక్రటరీలను బదిలీ చేయాలన్నారు. పల్లెల్లో వీధి దీపాలు, పారిశుధ్యం, తాగునీటి సరఫరా, మురుగు కాల్వలను శుభ్రం చేయించడంపై దృష్టి సారించాలన్నారు.
అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చొరవ చూపాలన్నారు. కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ సమావేశానికి గైర్హాజరైన కార్యదర్శుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ముందస్తు అనుమతి తీసుకోకుండా హాజరు కాని వారిపై చర్యలు తీసుకోవాలని డీపీవోను ఆదేశించారు. ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు వంద శాతం పన్ను వసూళ్లు జరగాలని స్పష్టం చేశారు. పన్ను వసూళ్ల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపర్చాలన్నారు. సమావేశంలో సబ్ కలెక్టర్ వికాస్ మహతో, డీపీవో శ్రీనివాస్ రావు, బోధన్ డీఎల్పీవో నాగరాజు, ఆయా మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలు, సెక్రటరీలు పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
ఎడపల్లి : మండల కేంద్రంలో బుధవారం ఆయా గ్రామాలకు చెందిన 62 మంది పేదలకు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ సర్కార్ అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా సర్పంచులకు తెలుపాలన్నారు. అంగన్వాడీల్లో నిత్యావసర సరుకుల కొరత రాకుండా చూడాలన్నారు. ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా మార్చేందుకు కార్యదర్శులు, పంచాయతీ పాలక వర్గాలు సమన్వయంతో పని చేయాలన్నారు.
కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు పులి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్లా రాంమోహన్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఈరంటి లింగం, ఎడపల్లి గ్రామ సర్పంచ్ కందగట్ల రాంచందర్, జైతాపూర్ గ్రామ సర్పంచ్ నాగుల రాజు, జానకంపేట్ సర్పంచ్ అనురాధ, జంలం సర్పంచ్ దొడ్డి శ్రీనివాస్, టానాకలాన్ సర్పంచ్ గెంటె అలేఖ్య తదితరులు పాల్గొన్నారు.
