గుడ్​ బ్యాంక్ అని కితాబిచ్చిన దొంగ అరెస్ట్

గుడ్​ బ్యాంక్ అని కితాబిచ్చిన దొంగ అరెస్ట్
  •  ఒకే బ్యాంకులో రెండుసార్లు చోరీకి యత్నం
  •   పట్టించిన సిమ్​కార్డ్​లేని సెల్​ఫోన్​

బెల్లంపల్లి రూరల్, వెలుగు: మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రెండు సార్లు చోరీకి విఫలయత్నం చేసిన నిందితుడిని ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. మొదటిసారి చోరీ చేసినా ఆధారాలు దొరక్కపోవడంతో  తప్పించుకొని తిరుగుతున్న ఈ దొంగ.. రెండోసారి అదే బ్యాంకులో స్ట్రాంగ్​రూమ్ ​తాళం పగలగొట్టే క్రమంలో సైరన్ ​మోగడంతో పారిపోయాడు.

ఈసారి ఆధారాలు సేకరించిన పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. నెన్నెల పీఎస్​లో బెల్లంపల్లి రూరల్ సీఐ రాజ్​కుమార్, ఎస్సై శ్యాంపటేల్ ​వివరాలు తెలియజేశారు. కోణంపేట గ్రామానికి చెందిన నాయిని బాపు(31) ప్రైవేట్ టీచర్​గా, కస్టమర్​ సర్వీస్​సెంటర్​ మినీ ఏటీఎం నిర్వాహకుడిగా పనిచేసేవాడు. ఆన్​లైన్​లో పేకాటకు అలవాటు పడి ఆర్థికంగా నష్టపోయాడు.

పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలని బ్యాంకులో చోరీకి ప్లాన్ ​వేశాడు. మొదటిసారి ఆగస్టు 31న గ్రామీణ బ్యాంకులో చోరీకి వచ్చి నగదు ఏమీ దొరక్కపోవడంతో ‘గుడ్​ బ్యాంక్. ఒక్క రూపాయి కూడా దొరకలే. నా ఫింగర్​ఫ్రింట్​ లభించదు. నన్ను పట్టుకోవద్దు’ అని పేపర్​పై రాసి వెళ్లాడు. మరోసారి నెల తర్వాత సెప్టెంబర్​30న బ్యాంకు కిటికీ గ్రిల్​ను తొలగించి లోపలికి ప్రవేశించాడు.

స్ట్రాంగ్​రూం తాళం పగులగొడుతుండగా అలారం మోగడంతో భయపడిపోయి టార్చ్​లైట్​లా ఉపయోగించేందుకు తెచ్చుకున్న సిమ్​కార్డు లేని చిన్న ఫోన్​ను అక్కడే వదిలేసి పారిపోయాడు. ఆ సెల్​ఫోనే దొంగను పట్టుకునేందుకు ఉపయోగపడింది. ఐఎంఈఐ నంబర్​ ఆధారంగా వివరాలు సేకరించిన పోలీసులు బాపును పట్టుకున్నారు. పోలీసులు వెతుకుతున్న విషయం తెలుసుకొని ఆటోలో పారిపోతున్న నిందితుడిని నెన్నెల టీ రోడ్డు వద్ద పట్టుకున్నారు. గతంలో ఇతడిపై దేవాపూర్, రెబ్బెన, మాదారం, మందమర్రి, తిర్యాణి తదితర పోలీస్​స్టేషన్​లలో 13 కేసులు నమోదయ్యాయని సీఐ తెలిపారు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న ఎస్సై శ్యాంపటేల్, హెడ్​కానిస్టేబుల్​విజయ్​ను సీఐ అభినందించారు.