మళ్లీ డ్రగ్స్ కలకలం..రెండు వారాల్లో రెండు ముఠాలు అరెస్ట్

మళ్లీ డ్రగ్స్ కలకలం..రెండు వారాల్లో రెండు ముఠాలు అరెస్ట్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డ్రగ్స్ ముఠాల అరెస్టులు కలకలం రేపుతున్నాయి. ఎన్ని డ్రగ్స్ ముఠాలను అరెస్ట్ చేసినా కొత్త గ్యాంగ్స్​ తెరపైకి వస్తూ సరికొత్త తరహాలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నాయి. రెండు వారాల్లో హైదరాబాద్​లో రెండు భారీ డ్రగ్స్ ముఠాలను పోలీసులు పట్టుకున్నారు. శనివారం మరో ముఠాను ఆబ్కారీ పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టినా లాక్ డౌన్ తర్వాత డ్రగ్స్ సప్లయర్స్ రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా వీఐపీలు, సెలబ్రిటీలు, సినీ స్టార్స్ టార్గెట్​గా దందా సాగుతోంది. లాక్ డౌన్ కొనసాగడంతో అన్ని రకాల వ్యవస్థలు ఆగిపోయాయి. దీంతో డ్రగ్స్ సరఫరాకు ఇబ్బంది ఏర్పడింది. పబ్​లు, రేవ్ పార్టీలు బందయ్యాయి. ఇటీవల కొన్ని అన్ లాక్ ​కావడంతో మళ్లీ డ్రగ్స్ ​దందా మొదలుపెట్టారు. ఈ నెల 4న బెంగళూరు నుంచి కొకైన్ తరలించిన ఇద్దరు వ్యక్తులను ఆబ్కారీ పోలీసులు హైదరాబాద్​లో పట్టుకున్నారు. వీరు కరోనా మాస్క్ లు విక్రయించడానికి పాస్ లు తీసుకొని బెంగళూరులోని నైజీరియన్ దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేసి తెచ్చినట్టు తేలింది.

ఎక్కడపడితే అక్కడ సేల్స్

కొకైన్‌‌, హెరాయిన్‌‌, బ్రౌన్‌‌షుగర్‌‌, ఎల్‌‌ఎస్‌‌డీ, చరస్, వంటి డ్రగ్స్​కు హైదరాబాద్​లో మంచి డిమాండ్​ ఉంది. వీటిని గోవా, ముంబై, బెంగళూర్, ఏపీ నుంచి సిటీకి కొరియర్, స్పెషల్ డ్రగ్ క్యారియర్లతో తరలిస్తున్నారు. పోలీసులు, ఆబ్కారీ వాళ్లకు దొరక్కుండా సప్లయర్స్ కొత్తకొత్త మార్గాల్లో సేల్ చేస్తున్నారు. ఫేస్ బుక్, వాట్సాప్ లలో కోడ్ భాషతో ఆర్డర్లు తీసుకుని సప్లయ్ చేస్తున్నారు. నగర శివారుల్లో రిసార్టులను అడ్డాగా చేసుకుని దందా సాగిస్తున్నారు. కొన్ని చోట్ల మెడికల్ దుకాణాల్లోనూ అమ్ముతున్నారు.

లాక్ డౌన్ తర్వాత పెరిగిన డ్రగ్స్ రేట్లు

లాక్ డౌన్ తర్వాత డ్రగ్స్ రేట్లు పెరిగినట్లు తెలుస్తోంది. గ్రాముకు ఐదు వేల విలువైన డ్రగ్స్‌‌ను 15 వేల వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇక హైదరాబాద్‌‌లో డ్రగ్ నియంత్రించే శాఖలు సమన్వయంతో పని చేయడం లేదన్న విమర్శలున్నాయి. నార్కోటిక్ సెల్, డ్రగ్ కంట్రోల్ బోర్డ్, డీఆర్‌‌ఐ, సీఐడీలోని యాంటీ నార్కోటిక్ సెల్, ఎక్సైజ్ శాఖలు ఉన్నా, నిఘా లేక ముఠాలు రెచ్చిపోతున్నాయన్న ఆరోపణలున్నాయి.

ఐదుగురు అరెస్టు.. వివరాలు చెప్పని పోలీసులు

హైదరాబాద్​లో డ్రగ్స్ రవాణా చేస్తున్న ఐదుగురు సభ్యులున్న ఓ ముఠాను ఆబ్కారీ పోలీసులు శనివారం పట్టుకున్నారు. వీరు బెంగళూరు, గోవా, ఏపీ నుంచి వివిధ రకాల డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని సమాచారం. వీళ్ల నుంచి 20 లక్షల విలువైన డ్రగ్స్, మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ విషయాన్ని ఆబ్కారీ పోలీసులు బయటకు చెప్పడం లేదు. నిందితుల కాల్ డేటా, వాట్సాప్ చాట్​లను తనిఖీ చేస్తున్నట్టు సమాచారం.