బంగారం చోరీ కేసు ఇద్దరు అరెస్ట్.. 10.5 తులాల బంగారం, రూ.50 వేలు స్వాధీనం

బంగారం చోరీ కేసు ఇద్దరు అరెస్ట్.. 10.5 తులాల బంగారం, రూ.50 వేలు స్వాధీనం

ఎల్​బీనగర్, వెలుగు: వారం రోజుల కిందట వనస్థలిపురంలోని ఓ ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలిని బంధించి బంగారం, డబ్బు ఎత్తుకెళ్లిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను ఎల్​బీనగర్​లోని రాచకొండ సీపీ క్యాంప్ ఆఫీసులో డీసీపీ సాయిశ్రీ వెల్లడించారు. ఏపీలోని వెస్ట్ గోదావరికి చెందిన నెలపూడి సురేశ్ కుమార్(31) సిటీకి వచ్చి వనస్థలిపురం ఏరియాలో ఉంటూ సాఫ్ట్​వేర్ జాబ్ చేసేవాడు. కంపెనీ నుంచి అతడిని​ తొలగించడంతో ఆర్ధిక ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ఈజీ మనీ కోసం చోరీలకు స్కెచ్ వేశాడు.  ఏదైనా ఇంట్లో పెద్ద చోరీ చేయాలని డిసైడ్ అయ్యాడు. వనస్థలిపురం పరిధిలోని కాలనీల్లో తిరుగుతూ రెక్కీ నిర్వహించాడు.

సచివాలయ నగర్ కాలనీలో వెంకట నర్సమ్మ(82) అనే వృద్ధురాలు ఒంటరిగా ఉంటుందని తెలుసుకున్నాడు. ఆమె ఇంటి వద్ద కొన్నిరోజులు రెక్కీ నిర్వహించాడు.ఆటోనగర్​లోని ఓ షెడ్డు దగ్గర పరిచయం అయిన పంజాబ్​కు పాత నేరస్థుడు పరంజిత్ సింగ్(43)తో కలిసి చోరీకి ప్లాన్ చేశాడు.గత నెల 26న సురేశ్, పరంజిత్ ఇద్దరూ వెంకటమ్మ ఇంటికి వెళ్లారు. కొరియర్ వచ్చిందని ఓ పేపర్ చూపించారు. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లి వృద్ధురాలిని బాత్రూంలో బంధించారు. బీరువాలో ఉన్న 10.5 తులాల బంగారు నగలు, రూ.50వేల క్యాష్​ తీసుకున్నారు. అక్కడి నుంచి పారిపోయే ముందు ఇంటికి ఉన్న సీసీ కెమెరాల డివీఆర్ బాక్స్​ను ధ్వంసం చేశారు.

బాదితురాలి కంప్లయింట్​తో కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించారు.   సోమవారం ఇంజపూర్ చౌరస్తా వద్ద వెహికల్ చెకింగ్ చేస్తున్న పోలీసులు..  అనుమానాస్పదంగా కనిపించిన   సురేశ్ కుమార్, పరంజిత్​ను అదుపులోకి తీసుకొని విచారించారు. సచివాలయనగర్ కాలనీలోని వృద్ధురాలి ఇంట్లో తామే చోరీ చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. వారి నుంచి 10.5 తులాల బంగారు నగలు, రూ.50 వేల  క్యాష్​ను పోలీసులు  స్వాధీనం చేసుకున్నారు. ఈ చోరీ కోసం సురేశ్​కుమార్ ఓ స్కూటీని కూడా కొట్టేసినట్లు డీసీపీ తెలిపారు. అతడిపై గతంలో రెండు దొంగతనం కేసులు, పరంజిత్ సింగ్​పై ఐదు కేసులున్నాయన్నారు. మీడియా  సమావేశంలో వనస్థలిపురం ఏసీపీ భీంరెడ్డి,
ఇన్స్​పెక్టర్లు జలంధర్​, వెంకట్ పాల్గొన్నారు.