విజయమ్మ హౌస్ అరెస్ట్..ఇంటి వద్దే నిరాహార దీక్ష

విజయమ్మ హౌస్ అరెస్ట్..ఇంటి వద్దే నిరాహార దీక్ష

ప్రగతి భవన్ ముట్టడి ఉద్రిక్తంగా మారడంతో వైఎస్ షర్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు.. వైఎస్ విజయమ్మను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఎస్సార్ నగర్ పీఎస్ లో ఉన్న షర్మిలను చూడటానికి బయల్దేరిన విజయమ్మను లోటస్ పాండ్ దగ్గర పోలీసులు అడ్డుకుని  హౌస్ అరెస్ట్ చేశారు. నిన్న వరంగల్ లో షర్మిల పై దాడి ఘటన, ఇవాళ షర్మిల కారును క్రేన్ తో ఈడ్చుకెళ్లడంతో విజయమ్మ కలత చెందినట్లు తెలుస్తోంది. షర్మిలపై దాడితో ఆమె నిన్నటి నుంచి  మంచినీళ్లు కూడా ముట్టడం లేదని పార్టీ నేతలు చెబుతున్నారు.  పోలీసులు దుహంకారంగా వ్యవహరిస్తున్నారని విజయమ్మ విమర్శించారు. తన కూతురు షర్మిల దగ్గరకు వెళ్లతుంటే పోలీసులు అడ్డుకున్నారంటూ విజయమ్మ నిరాహార దీక్షకు దిగారు.

ఉదయం ప్రగతి భవన్ ముట్టడికి బయల్దేరిన షర్మిలను పంజాగుట్ట వద్ద అడ్డుకుని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.  షర్మిల తో పాటు మరో 20 మందిని పోలీసులు పీఎస్ ల నిర్భందించారు. మొబైల్ ఫోన్స్ లాక్కుని పీఎస్ లోనే కూర్చోబెట్టారు. ట్రాఫిక్ కు అంతరాయం కల్గించారని  షర్మిల పై పంజాగుట్ట పీఎస్ లో మూడు సెక్షన్ల కింద  పోలీసులు కేసు నమోదు చేశారు. షర్మిల అరెస్ట్ తో ఎస్సార్ నగర్ పీఎస్ వద్దకు ఆమె అభిమానులు భారీగా చేరుకున్నారు. పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగారు.దీంతో ఎస్సార్ నగర్  పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.