పోలీస్ వెబ్‌‌సైట్ హ్యాకర్ అరెస్ట్

పోలీస్ వెబ్‌‌సైట్ హ్యాకర్ అరెస్ట్
  •  ఢిల్లీలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • మిగతా నిందితుల కోసం గాలింపు
  • టీఎస్​సీఓపీ, హాక్‌‌ ఐ యాప్ డేటా చోరీ చేసిన హ్యాకర్లు
  • 150 డాలర్లకు అమ్మకానికి పెట్టిన నిందితులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర పోలీస్ శాఖకు చెందిన సోషల్ మీడియా యాప్స్, వెబ్ సైట్ల హ్యాకింగ్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఢిల్లీ స్పెషల్ సెల్, ద్వారకా పోలీసులు జాయింట్ ఆపరేషన్  చేపట్టి జతిన్ కుమార్‌‌ ‌‌(20) అనే హ్యాకర్‌‌‌‌ను నోయిడాలో శనివారం అరెస్టు చేశారు. ట్రాన్సిట్ వారెంట్‌‌పై అతనిని హైదరాబాద్‌‌  తరలించారు. సోమవారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌‌కు తరలించనున్నారు.

 అతనిని ఉత్తర ప్రదేశ్ లోని ఝాన్సీకి చెందిన స్టూడెంట్ గా  గుర్తించారు. నిరుడు ఆధార్‌‌‌‌ కార్డులు సహా ఇతర ఏజెన్సీల డేటాను అతను హ్యాక్  చేశాడు. అలాగే మరికొందరు హ్యాకర్ల కోసం గాలిస్తున్నామని డీజీపీ రవి గుప్తా ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. పోలీస్ డిపార్ట్‌‌మెంట్ కు చెందిన హాక్ ఐ అప్లికేషన్  డేటాను హ్యాకర్లు చోరీ చేసిన సంగతి తెలిసిందే. టీఎస్  సీఓపీ, ఎస్‌‌ఎమ్‌‌ఎస్‌‌ సర్వీసెస్‌‌, హాక్ ఐ అప్లికేషన్‌‌కు సంబంధించిన డేటా చోరీని గుర్తించి రాష్ట్ర సైబర్  సెక్యూరిటీ బ్యూరో  కేసు నమోదు చేసింది. నిందితులను పట్టుకోవడానికి స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి హ్యాకర్లను గుర్తించారు.

 ఢిల్లీ నుంచి హ్యాకింగ్‌‌  జరిగినట్లు ఆధారాలు సేకరించారు. పోలీస్  డేటాను పబ్లిక్  ప్లాట్ ఫాంలో పోస్టు చేసి డబ్బులు సంపాదించేందుకు కుట్రచేసినట్లు గుర్తించారు. సోషల్ మీడియాలో పోస్టు చేసిన డేటా ఆధారంగా హ్యాకర్  చోరీ వివరాలను డేటాబ్రీచ్ ఫోరం.ఎస్టీ వెబ్ సైటులో  లో పోస్టు చేశాడని గుర్తించారు.

150 డాలర్లకు పోలీస్ డేటా అమ్మేందుకు యత్నం

హ్యాకర్లు చోరీ చేసిన  డేటాను 150 అమెరికా డాలర్లకు అమ్మకానికి పెట్టారు. హాక్ ఐ, టీఎస్‌‌  కాప్‌‌  డేటాను కొనుగోలు చేసేవారి కోసం టెలిగ్రాం ఐడీలు  అందించారు. పోలీసులు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు గుర్తించకుండా ఆధునిక టెక్నాలజీని వినియోగించారు. హ్యాకింగ్  ఉదంతం వెలుగులోకి వచ్చిన వెంటనే సైబర్  సెక్యూరిటీ బ్యూరో అలర్ట్  అయ్యింది. దేశవ్యాప్తంగా సైబర్  క్రైం పోలీసులను అప్రమత్తం చేసింది. 

అత్యాధునిక సోషల్ ఇంజినీరింగ్‌‌  విధానాలను వినియోగించి ఢిల్లీలో ఒక హ్యాకర్ ను గుర్తించింది. నిందితుడు జతిన్  కుమార్ పై న్యూఢిల్లీ ద్వారక పోలీస్ స్టేషన్‌‌లో గతంలో కేసులు ఉన్నట్లు గుర్తించారు. నిరుడు ఆధార్ కార్డుల డేటా, పలు ఏజెన్సీలకు సంబంధించిన కీలక సమాచారాన్ని అతను హ్యాక్  చేసి లీక్  చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.

సిటిజన్స్ డేటా లీక్ కాలేదు: డీజీపీ

పోలీస్ యాప్స్‌‌, వెబ్‌‌సైట్  హ్యాకింగ్  వ్యవహారంలో పౌరులకు సంబంధించిన ఎలాంటి డేటా లీక్  కాలేదని డీజీపీ రవి గుప్తా స్పష్టం చేశారు. హాక్‌‌ ఐ మొబైల్ అప్లికేషన్  డేటాలో మొబైల్ నంబర్లు, చిరునామా, ఈ మెయిల్  ఐడీల వంటి సమాచారాన్ని మాత్రమే ఉంటుందని ఆయన తెలిపారు. టీఎస్  కాప్‌‌  అప్లికేషన్  ద్వారా పౌరులకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని పేర్కొన్నారు. టీఎస్‌‌ కాప్‌‌లోని విజిటర్లు, ఆపరేషన్ల నిర్వహణ డేటాను హ్యాకర్లు సేకరించలేదని చెప్పారు.