గంజాయి తరలిస్తూ పట్టుబడిన మహిళ

గంజాయి తరలిస్తూ పట్టుబడిన మహిళ

సికింద్రాబాద్, వెలుగు: గంజాయిని అక్రమంగా తరలిస్తున్న మహిళను సికింద్రాబాద్​ రైల్వే పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పట్టుబడిన గంజాయి విలువ రూ11.50 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. పోలీసుల వివరాల ప్రకారం..ఒడిశాలోని గజపతి జిల్లా మోహన తండాకు చెందిన శిల్పా నాయక్​(27)  భర్త 2018లో మృతి చెందాడు. కుటుంబాన్ని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో  రాజీవ్​నాయక్ అనే గంజాయి స్మగ్లర్ తో ఆమె చేతులు కలిపింది. ఇద్దరూ కలిసి ఈ నెల 16న మోహన తండా సమీపంలోని అడవికి వెళ్లి ఓ వ్యక్తి వద్ద కిలో రూ.3వేల చొప్పున 46 కిలోల గంజాయి కొన్నారు. దాన్ని 23 ప్యాకెట్లుగా కట్టి నాలుగు బ్యాగుల్లో ప్యాక్​ చేశారు.

ఆ ప్యాకెట్లను ముంబైకి తరలించే క్రమంలో 17న ఉదయం సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో  దిగారు. అక్కడ శిల్పా నాయక్​కు భోజనం తీసుకువచ్చేందుకు  రాజీవ్​ నాయక్​ బయటకు వెళ్లగా..ఆమె గంజాయి బ్యాగులతో  ప్లాట్​పారంపైనే వేయిట్ చేసింది. శిల్పా నాయక్​ అనుమానాస్పదంగా కనిపించడంతో  స్టేషన్​పోలీసులు ఆమె బ్యాగులను చెక్​ చేశారు. అందులో 46 కిలోల గంజాయిని గుర్తించి సీజ్ చేశారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. శిల్పా నాయక్ అరెస్టుతో  రాజీవ్​ నాయక్ పరారయ్యాడు. అతన్ని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.