బండి సంజయ్​ గొంతుపట్టి కారులోకి తోసేసిన పోలీసులు

బండి సంజయ్​ గొంతుపట్టి కారులోకి తోసేసిన పోలీసులు

హై టెన్షన్​.. నాలుగైదు గంటలపాటు పోలీసుల సోదాలు

ప్రైవేటు వ్యక్తి  ఇంటి నుంచి రూ. 18.65 లక్షలు స్వాధీనం చేసుకున్న పోలీసులు

ఆ డబ్బు బీజేపీ క్యాండిడేట్​ రఘునందన్ రావుకు ఇచ్చేందుకే తెచ్చారన్న సీపీ

పోలీసులే డబ్బు తెచ్చి, సోదాల్లో దొరికినట్లు చూపుతున్నారని బీజేపీ ఆగ్రహం

డబ్బు సంచితో కానిస్టేబుల్​..

లాక్కొని నోట్ల కట్టలను మీడియాకు చూపిన బీజేపీ కార్యకర్తలు

ఇరు వర్గాల తోపులాట.. బీజేపీ నేతలకు గాయాలు

రాష్ట్రాన్ని పోలీస్​ రాజ్యం చేశారన్న మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి

సిద్దిపేట, వెలుగు: దుబ్బాక బై ఎలక్షన్​కు సంబంధించి సిద్దిపేటలో పోలీసులు చేసిన సోదాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఓ వ్యక్తి ఇంట్లో దొరికిన డబ్బును బీజేపీ క్యాండిడేట్​ రఘునందన్​రావుకు ఇచ్చేందుకే తెచ్చారని పోలీసులు చెప్పడం, డబ్బు సంచితో కనిపించిన కొందరు పోలీసులను బీజేపీ నేతలు అడ్డుకోవడంతో  హైటెన్షన్​ నెలకొంది. పట్టణంలోని లెక్చరర్స్ కాలనీలో దుబ్బాక బీజేపీ క్యాండిడేట్​ రఘునందన్‌‌ రావు మామ  సురభి రాంగోపాల్‌‌ రావుతో పాటు వారి ఇంటి పక్కన ఉన్న అంజన్‌‌ రావు ఇంట్లో పోలీసులు సోమవారం తనిఖీలు చేపట్టారు. సిద్దిపేట మున్సిపల్‌‌ చైర్మన్‌‌ రాజనర్సు ఇంట్లోనూ సోదాలు జరిపారు. రాంగోపాల్‌‌ రావు ఇంట్లో దాదాపు నాలుగు గంటలకు పైగా సోదాలు జరుపగా అక్కడ డబ్బులేమీ దొరకలేదు. అయితే.. అంజన్​రావు ఇంట్లో మాత్రం రూ. 18.60 లక్షలు స్వాధీనం చేసుకున్నామని, అది రఘునందన్​రావుకు ఇచ్చేందుకే తెచ్చినట్లుగా గుర్తించామని పోలీసులు చెప్పారు. ఇదే  టైంలో అంజన్​రావు ఇంటి ముందు డబ్బు సంచితో ఓ కానిస్టేబుల్​ కనిపించడంతో బీజేపీ కార్యకర్తలు పట్టుకున్నారు. ఆయన చేతిలోంచి సంచి లాక్కొని అందులోని నోట్ల కట్టలను మీడియాకు చూపించారు. పోలీసులే డబ్బు తెచ్చి సోదాల్లో దొరికినట్లు చూపుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఆ తర్వాత బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్​ చేశారు. విషయం తెలుసుకున్న బీజేపీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్​, మాజీ ఎంపీ వివేక్ తదితరులు సిద్దిపేటకు వెళ్లగా వారిని అరెస్టు చేశారు. బండి సంజయ్​ను బలవంతంగా వ్యాన్​లోకి తోశారు. దీంతో ఆయనకు గాయాలయ్యాయి. దాడికి నిరసనగా సంజయ్​ కరీంనగర్​లో దీక్షకు దిగారు. ఆయనకు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా ఫోన్​ చేసి పరామర్శించారు.

నాలుగు గంటలపాటు సోదాలు

సోమవారం మధ్యాహ్నం12 గంటలకు సిద్దిపేట అర్బన్‌‌‌‌ తహసీల్దార్​ విజయ సాగర్‌‌‌‌ తో పాటు పోలీసులు మొదట లెక్చరర్స్  కాలనీలోని రాంగోపాల్​ రావు ఇంటికి వెళ్లారు. దాదాపు నాలుగు గంటల పాటు సోదాలు నిర్వహించినా డబ్బులు దొరకక పోవడంతో వారి ఇంటి పక్కనే ఉన్న సురభి అంజన్‌‌‌‌ రావు ఇంట్లో తనిఖీలు చేశారు. అటు తర్వాత అంజన్ రావు ఇంట్లో రూ. 18.65 లక్షలు స్వాధీనం చేసుకొని సీజ్  చేసినట్లు ప్రకటించారు. అయితే.. రఘునందన్​రావుకు ఇచ్చేందుకే ఆ డబ్బులు తెచ్చినట్లు పోలీసులు ప్రకటించారు. దీంతో దుబ్బాక ప్రచారంలో ఉన్న  రఘునందన్‌‌‌‌ రావు  హుటాహుటిన సిద్దిపేటలోని లెక్చరర్స్​కాలనీకి చేరుకున్నారు. ఎలాంటి నోటీసులు లేకుండా తన మామ రాంగోపాల్​రావు ఇంట్లో ఎలా సోదాలు నిర్వహిస్తారని, తనకేమాత్రం పరిచయం లేని అంజన్‌‌‌‌ రావు అనే వ్యక్తి దగ్గర దొరికిన డబ్బులు తనవేనని ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. సిద్దిపేట  వన్ టౌన్‌‌‌‌ సీఐ సైదులును రఘునందన్ రావు ఎన్నిసార్లు ప్రశ్నించినా.. ఆయన నుంచి సరైన సమాధానం రాలేదు. నిబంధనల  ప్రకారం ముందస్తుగా నోటీసులు ఇచ్చి తనిఖీలు చేయాలని, కానీ పోలీసులు ఇవేమీ పాటించకుండా టీఆర్ఎస్‌‌‌‌ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని రఘునందన్​రావు ఆరోపించారు.

కానిస్టేబుల్​ చేతిలో డబ్బు సంచి

సిద్దిపేటలో రఘునందన్‌‌‌‌ మామ రాంగోపాల్​రావు ఇంట్లో పోలీసులు సోదా చేస్తున్నారనే సమాచారం అందుకున్న బీజేపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రి హరీశ్‌‌‌‌ రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలుమార్లు పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. సాయంత్రం ఐదు గంటల టైంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అంజన్‌‌‌‌ రావు ఇంటి వద్ద ఓ కానిస్టేబుల్​ డబ్బు సంచితో కనిపించడంతో కార్యకర్తలు అడ్డుకున్నారు. సంచిలోని డబ్బు కట్టలను లాక్కొని మీడియాకు చూపించారు. పోలీసులే డబ్బులు తెచ్చి  అంజన్‌‌‌‌ రావు ఇంట్లో పెట్టి నాటకాలు ఆడుతున్నారని వారు ఆరోపించారు.

అంజన్​రావు ఇంట్లో రూ.18.67 లక్షలు స్వాధీనం: సీపీ

సిద్దిపేట లెక్చరర్స్ కాలనీలోని సురభి అంజన్‌‌‌‌రావు ఇంట్లో ఎగ్జిక్యూటివ్‌‌‌‌ మెజిస్ట్రేట్‌‌‌‌ సమక్షంలో పోలీసుల స్పెషల్​టీమ్​ నిర్వహించిన సోదాల్లో రూ. 18.67 లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు సిద్దిపేట సీపీ జోయల్‌‌‌‌ డేవిస్‌‌  చెప్పారు. సోమవారం రాత్రి సిద్దిపేట వన్‌‌‌‌టౌన్‌‌‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. సిద్దిపేటలో మున్సిపల్‌‌ ‌‌చైర్మన్‌‌‌‌ రాజనర్సు, సురభి రాంగోపాల్ రావుతో పాటు సురభి అంజన్‌‌‌‌రావు ఇంట్లో సోదాలు నిర్వహించినట్లు వివరించారు. ఈ సందర్భంగా సురభి అంజన్‌‌‌‌రావు ఇంట్లో డబ్బు లభించగా, అవి డ్రైవర్​ ద్వారా తన బావమరిది  జితేందర్‌‌‌‌రావు పంపించాడని చెప్పినట్లు సీపీ పేర్కొన్నారు. వాటిని కొంచెం కొంచెం దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌‌‌‌రావుకు అందజేయాలని సూచించాడని, అందుకే వాటిని తన వద్ద పెట్టుకున్నట్లు అంజన్​రావు అంగీకరించారని సీపీ చెప్పారు.  రఘునందన్‌‌‌‌రావుకు రాంగోపాల్‌‌‌‌రావు, అంజన్‌‌‌‌రావు బంధువులని, అంజన్ రావు ఇంట్లో దొరికిన డబ్బులను ఎగ్జిక్యూటివ్‌‌ మెజిస్ట్రేట్‌‌‌‌ సమక్షంలో సీజ్‌‌ ‌‌చేశామన్నారు. సీజ్ చేసిన డబ్బులను అధికారులకు అప్పగించడానికి తరలిస్తున్న సమయంలో అక్కడ రఘునందన్  రావుతో పాటు ఆందోళనచేస్తున్న వారిలో 20 మంది వరకు ఇంట్లోకి చొరబడి అధికారుల నుంచి రూ. 12.80 లక్షలు  దొంగిలించుకుని వెళ్లిపోయారని చెప్పారు. ఈ సంఘటనకు సంబంధించి వీడియో రికార్డుల ప్రకారం ఎంక్వైరీ చేస్తున్నామని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

బీజేపీ ముఖ్య నేతల అరెస్ట్​

లాఠీచార్జ్​ విషయం తెలుసుకున్న బీజేపీ ముఖ్య నేతలు, మాజీ ఎంపీలు వివేక్‌‌‌‌ వెంకటస్వామి,  జితేందర్‌‌‌‌ రెడ్డి సిద్దిపేట చేరుకుని కార్యకర్తల్ని పరామర్శించారు. మాజీ ఎంపీలిద్దరూ రఘునందన్‌‌‌‌ రావును కలిసి మాట్లాడారు. పలువురు కార్యకర్తలు వివేక్ ను కలిసి లాఠీచార్జ్​లో గాయపడ్డ వారిని చూపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.  సరిగ్గా అదే సమయంలో బీజేపీ స్టేట్​ చీఫ్​ సంజయ్ సిద్దిపేట పట్టణ శివార్లకు చేరుకోవడంతో అక్కడికి వివేక్, జితేందర్ రెడ్డి బయలుదేరివెళ్లారు. కానీ పట్టణ శివారులోనే పోలీసులు.. బండి సంజయ్​ను అరెస్టు చేసి కరీంనగర్‌‌‌‌కు, వివేక్‌‌‌‌ వెంకటస్వామి, జితేందర్‌‌‌‌ రెడ్డిని అరెస్ట్ చేసి హైదరాబాద్‌‌‌‌కు తరలించారు. బండి సంజయ్​ను  బలవంతంగా వ్యాన్​లో ఎక్కించడంతో ఆయనకు గాయాలయ్యాయి.

For More News..

దసరాకు ఎంత తాగారో తెలిస్తే.. కిక్కు ఎక్కుద్ది