ఎగ్జామ్‍ రాయడానికి వచ్చిన వారితో పోలీస్‍ దురుసు ప్రవర్తన

ఎగ్జామ్‍ రాయడానికి వచ్చిన వారితో పోలీస్‍ దురుసు ప్రవర్తన

పోలీస్‍ ఎగ్జామ్‍ కు రాయడానికి వచ్చిన వారితో దురుసు ప్రవర్తన
వీడియో తీస్తుండగా బెదిరింపు ప్రశ్నిస్తే పోలీస్‍ వాహనంలో గుంజి పడేసిండు  
హనుమకొండ కేయూ పీఎస్‍ పరిధిలో ఘటన

వరంగల్‍, వెలుగు: కానిస్టేబుల్‍ పరీక్ష రాద్దామని తన సోదరుడితో కలిసి సెంటర్‍ వద్దకు వెళ్తున్న మహిళా అభ్యర్థినితో పాటు ఆమె అన్నపై ఓ ఎస్సై దౌర్జన్యానికి దిగాడు. గల్లా పట్టుకుని పోలీస్‍ వాహనంలోకి ఈడ్చి పడేశాడు. నోటికొచ్చినట్లు బూతులు తిట్టాడు. పరీక్ష రాయడానికి ఓ గంట లోపలకు వెళ్లకుండా ఆపితే తానేంటో తెలిసొస్తుందని హెచ్చరించాడు. ఇదేం పద్ధతని ప్రశ్నించిన మహిళా అభ్యర్థినిని కూడా బెదిరించాడు. దీన్నంతా ఆమె వీడియో తీస్తుండగా ఏం చేస్కుంటావో చేస్కో అనుకుంటూ మీదమీదకు వచ్చాడు. గ్రేటర్‍ వరంగల్ హనుమకొండ జిల్లా కేయూసీ పోలీస్‍ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. 

బాధితులు, స్థానికుల కథనం ప్రకారం.. హన్మకొండకు చెందిన బానోతు అనూష తన అన్న రాజ్‍కుమార్‍ తో కలిసి బైక్‍పై ఆదివారం పోలీస్‍ కానిస్టేబుల్‍ ఎగ్జామ్‍ రాయడానికి రామారంలోని ఎస్‍వీఎస్‍ కాలేజీకి వెళ్తోంది. గంటముందు సెంటర్‍లోకి రావాలనే రూల్‍ ఉండడంతో హడావుడిగా అక్కడకు చేరుకున్నారు. అయితే బైక్​పై రాంగ్​రూట్​లో వచ్చారని ఆరోపిస్తూ పోలీసులు ఇద్దరిని ఆపి నోరు జారారు. బూతులు తిట్టడంతో అన్నాచెల్లెళ్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కేయూ ఎస్సై బండారి సంపత్‍ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్‍మెన్ల సాయంతో ఇద్దరిని నెట్టివేశాడు. రాజ్‍ నాయక్‍ అంగీ చింపాడు. పోలీసుల దాడితో విస్తుపోయిన అనూష మొత్తం ఘటనను మొబైల్​లో వీడియో తీసే ప్రయత్నం చేసింది. ఇది చూసిన ఎస్ఐ మరింత రెచ్చిపోయాడు. ‘ఏందమ్మా వీడియో తీస్తున్నవ్​..తీస్కో చెప్తా’ అని బెదిరించాడు. అనూష సోదరుడి కాలర్‍ పట్టుకుని పోలీస్‍ వాహనంలోకి ఈడ్చి పడేశాడు. పరీక్షకు వెళ్లకుండా గంట ఆపితే తానేంటో తెలిసోస్తుందన్నాడు. అక్కడ జనం గుమిగూడి చూస్తుండడంతో వారిని వదిలివేశాడు. ఈ విషయమై ఎస్సై సంపత్‍ను వివరణ కోరగా, ఎగ్జామ్‍ సెంటర్‍ వద్ద పార్కింగ్‍ విషయంలో అభ్యర్థులతో చిన్న డిస్కషన్‍ అయిందని, అది పెద్ద ఇష్యూ కాదని అన్నారు.