స్నేహితుడే కాజేశాడు..8 నిమిషాల్లో రూ.84 లక్షల చోరీ

స్నేహితుడే కాజేశాడు..8 నిమిషాల్లో రూ.84 లక్షల చోరీ

పోచారంలో చోరీ కేసును చేధించిన పోలీసులు

ఘట్​కేసర్, వెలుగు: పోచారం ఐటీసీ పరిధిలో రియల్ వ్యాపారి నాగభూషణం ఇంట్లో ఈ నెల 22న జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. 350 సీసీ పుటేజీల పరిశీలించి మొత్తం 9 మంది నిందితులను శుక్రవారం రిమాండ్​కు తరలించారు. 

నాగభూషణం వద్ద రవి అనే వ్యక్తి పదేండ్లుగా డ్రైవర్​గా పనిచేస్తుండగా, అతడి స్నేహితుడు ఠాగూర్ పవన్ కల్యాణ్ సింగ్ (27)​ను ప్రధాన నిందితుడిగా గుర్తించారు. 

శంకర్​పల్లిలో నాగభూషణం ల్యాండ్ అమ్మగా వచ్చిన డబ్బులు తీసుకురావడానికి పవన్ కల్యాణ్​ను ఇటీవల రవి వెంట తీసుకెళ్లాడు. వాటిని ఎలాగైనా కొట్టేయాలని పవన్ ప్లాన్​ వేశాడు. తొలుత తన స్నేహితులైన జవహర్ నగర్, బాలాజీనగర్ కు చెందిన ఇర్ఫాన్, పులిబాబు, ఫయాజ్, నవీన్ కుమార్, దినకర్, లడ్డూ, జహీద్, మహేశ్​ కలిసి ఇంటి వద్దరెక్కీ నిర్వహించారు. 

ఆ తర్వాత తెల్లవారుజామున 8 నిమిషాల్లో చోరీకి పాల్పడ్డారు. ఆ మరుసటి రోజు వీరంతా రెండు బృందాలుగా గోవాకు వెళ్లాలని ప్లాన్​ వేసుకోగా, బాలాజీనగర్​లో వీరిని అదుపులోకి తీసుకొని విచారించారు. నిందితుల నుంచి రూ. 84 లక్షల నగదు, కారు, ఆటో, బైక్​ను స్వాధీనం చేసుకొని శుక్రవారం రిమాండ్​​కు తరలించారు.