
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్, ఎస్ఐబీ లాగర్ రూం ధ్వంసం కేసులో పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరించారు. దర్యాప్తులో భాగంగా సీజ్ చేసిన మెటీరియల్ ఎవిడెన్స్‌ను మంగళవారం నాంపల్లి కోర్టుకు అందించారు. నిందితుల ఫోన్ల నుంచి సేకరించిన వాట్సాప్ చాటింగ్‌ల స్క్రీన్ షాట్స్‌తో కూడిన సీల్డ్ కవర్, లాగర్ రూమ్‌లో స్వాధీనం చేసుకున్న హార్డ్‌డిస్క్‌లు,పెన్‌డ్రైవ్స్‌లను కోర్టుకు సమర్పించారు.
అలాగే హార్డ్‌డిస్క్‌లను ముక్కలుగా చేసినట్లు, ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు నిరూపించే కీలక డాక్యుమెంట్లను కూడా అందించారు. ఈ కేసులో జుడీషియల్ కస్టడీలో ఉన్న మాజీ పోలీసు అధికారులు ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు సహా ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఐ న్యూస్ ఎండీ శ్రవణ్ కుమార్లపై అభియోగాలు మోపుతూ ఈనెల10న చార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
కాగా, నిందితులపై మోపిన అభియోగాలకు సంబంధించి సరైన మెటీరియల్ ఎవిడెన్స్ లేకపోవడంతో చార్జ్‌షీట్‌ను విచారణకు స్వీకరించేందుకు కోర్టు రెండుసార్లు తిరస్కరించింది. దీంతో కోర్టు సూచించినట్లు ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్‌కు సంబంధించిన ఆధారాలను మూడు బాక్సులలో మంగళవారం నాంపల్లి కోర్టుకు అందించారు. మరోవైపు చార్జ్‌షీట్‌లో ఉన్న లోపాలను చూపుతూ నిందితుల తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్లను దాఖలు చేస్తున్నారు. ఇందులో భాగంగా భుజంగరావు, తిరుపతన్న పిటిషన్లపై మంగవారం వాదనలు జరిగాయి. తదుపరి వాదనలను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది.