రామకృష్ణాపూర్లోని బెల్ట్షాపులపై పోలీసుల దాడులు..మంత్రి వివేక్ ఆదేశాలతో చర్యలు

రామకృష్ణాపూర్లోని బెల్ట్షాపులపై పోలీసుల దాడులు..మంత్రి వివేక్ ఆదేశాలతో చర్యలు

కోల్​బెల్ట్, వెలుగు: రామకృష్ణాపూర్​లోని పలు కాలనీల్లో నిర్వహిస్తున్న బెల్ట్​షాపులపై మంగళవారం పోలీసులు దాడులు చేసి పెద్ద ఎత్తున మద్యం స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని గాంధీనగర్, రాంనగర్, కనకదుర్గ కాలనీ, ఆర్కే4 గడ్డ, శాంతి నగర్, అబ్రహం నగర్, లెనిన్ నగర్, జోడుపంపుల ఏరియా, రైల్వేస్టేషన్ ఏరియా, చైతన్య కాలనీ, తిలక్ నగర్ తదితర ప్రాంతాల్లోని కిరాణ దుకాణాలు, టేలాలు, బెల్ట్​షాప్​లపై పట్టణ ఎస్సై లింగంపెల్లి భూమేశ్​ఆధ్వర్యంలో పోలీసులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. 

పెద్ద ఎత్తున మద్యం స్వాధీనం చేసుకొని బెల్ట్ షాప్ నిర్వాహకుల మీద కేసులు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. బెల్ట్​షాపులు నిర్వహించినా, అక్రమంగా మద్యం అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

మంగళవారం ఉదయం మున్సిపల్​ వార్డుల్లో రాష్ట్ర కార్మిక, గనులశాఖ మంత్రి వివేక్​వెంకటస్వామి మార్నింగ్​వాక్​ కార్యక్రమం నిర్వహించగా.. బెల్ట్​షాపుల వల్ల ఇబ్బందులు పడుతున్నామని మహిళలు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన మంత్రి వాటిని వెంటనే తొలగించాలంటూ ఆదేశాలివ్వడంతో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.