ఐడీ కార్డు లేదు అయితే.. ఎస్ఐపై కానిస్టేబుల్ ఆగ్రహం

ఐడీ కార్డు లేదు అయితే.. ఎస్ఐపై కానిస్టేబుల్ ఆగ్రహం

ఐడీ కార్డు అడిగిన ఎస్ఐపై ఓ కానిస్టేబుల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. హనుమాన్ జయంతి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో భద్రతా విధులు నిర్వర్తించేందుకు వచ్చిన ఓ కానిస్టేబుల్ ఎస్ఐతో వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. ఏప్రిల్ 7వ తేదీ శుక్రవారం తెల్లవారు జామున కొండపైకి వెళ్లే మార్గంలో చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న జగిత్యాల డీసీఆర్బీ ఎస్ఐ పురుషోత్తం.. అటుగా ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తిని కొండపైకి అనుమతి లేదని ఆపాడు.

దీంతో బైక్ పై వచ్చిన వ్యక్తి తాను పోలీస్ కానిస్టేబుల్ అని భద్రతా విధులు నిర్వర్తించేందుకు వచ్చానని ఎస్ఐకి తెలిపాడు. అయితే ఐడీ కార్డు చూపించాలని ఎస్ఐ కోరగా ఆగ్రహించిన కానిస్టేబుల్ ఇష్టారీతిగా మాట్లాడటంతో ఎస్ఐ ఖంగుతిన్నాడు.

ఐడీ కార్డు లేదు అయితే నేనేమైనా దొంగనా లేక నక్సలైటా అంటూ ఎస్ఐపై రివర్స్ అయ్యాడు సదరు కానిస్టేబుల్. మర్యాదగా మాట్లాడాలని ఎస్ఐ కోరడంతో వంగి వంగి దండాలు పెట్టాలా అంటూ కానిస్టేబుల్ బదులిచ్చాడు. ఎస్ఐపై దురుసుగా వ్యవహరించిన కానిస్టేబుల్ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చందుర్తి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నట్లు తెలిసింది. ఈ తతంగాన్ని అంతా ఓ భక్తుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెట్టింట వైరల్ గా మారింది. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాల్సిన పోలీస్ శాఖలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది.