
వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లా కొప్పునూరు గ్రామ ప్రజల పేరుతో ఉన్న 116 ఎకరాల భూమిని కాజేసేందుకు ఓ పోలీస్ కానిస్టేబుల్ రికార్డుల్లో తప్పుడు ఎంట్రీ చేయించడం వివాదాస్పదంగా మారింది. గ్రామస్తులకు విషయం తెలియడంతో కొద్ది రోజులుగా ఉద్యమం మొదలుపెట్టారు. నాగర్ కర్నూల్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. చిన్నంబావి మండలం కొప్పునూరు గ్రామానికి చెందిన పూర్వీకులు గ్రామ అవసరాల కోసం గ్రామస్తుల పేరిట 1952లో నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవల్లి మండలం జటప్రోలు గ్రామంలో 116 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. రెవెన్యూ రికార్డులో పట్టాదారుల కాలమ్ లో కొప్పునూరు గ్రామ ప్రజల పేర నమోదు చేసుకున్నారు. కొప్పునూరు గ్రామానికి వలస వచ్చి అక్కడే ఉంటున్న దాంగట్ల సుబ్బన్న తండ్రి దాంగట్ల లక్ష్మన్న పేరుపై ఈ భూమిని కొన్నేండ్ల కింద గుట్టుచప్పుడు కాకుండా రెవెన్యూ రికార్డుల్లో మార్చారు. తప్పుడు డాక్యుమెంట్లను చూపించి గ్రామస్తుల పేరుపై ఉన్న రికార్డులో రౌండప్ చేసి ఈయన పేరును ఎక్కించారు. ఈ విషయం సమగ్ర సర్వేలో బయటపడడంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గ్రామానికి చెందిన 116 ఎకరాలను ఒక వ్యక్తి పేర మార్చేందుకు ప్రయత్నించడం ఏంటని అధికారులను నిలదీయడంతో దీనిని పార్ట్ బీ లో చేర్చారు. ఇటీవల దీనిపై కొందరు కోర్టులో దావా వేశారు. గతంలో ఈ భూమిని తాము కొన్నామంటూ దాంగట్ల సుబ్బన్న కొడుకైన కానిస్టేబుల్ వాదించడంతో గ్రామస్తులు రెవెన్యూ రికార్డులను మీడియాకు విడుదల చేశారు. షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో డ్యూటీ చేస్తున్న ఆ కానిస్టేబుల్ భూమి మొత్తం తమదేనంటూ తప్పుడు పత్రాలు తయారు చేశారని, ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
పార్ట్ బీ లో ఉంచాం
జటప్రోలులో ఉన్న ఈ భూమి ఎవరి ఆధీనంలోనూ లేదు. రికార్డులో మాత్రం మార్పు చేయాలని ఈ మధ్య కొందరు దరఖాస్తు చేసుకున్నారు. దానిపై గ్రామస్తులు అభ్యంతరం తెలపడంతో పూర్తి వివరాలు సేకరించి తగిన చర్యలు తీసుకుంటాం. వాస్తవానికి ఈ భూమి గ్రామస్తులకు సంబంధించినదని రికార్డులో ఉంది. – రమేశ్ నాయక్, తహసీల్దార్, పెంట్లవల్లి
ఇది దారుణమైన మోసం
కొప్పునూరుకు చెందిన పూర్వీకులు ముందు జాగ్రత్తగా గ్రామంలోని పశువులు, గొర్రెలు, మేకలను మేపుకునేందుకు 116 ఎకరాల భూమిని 1952 లో కొనుగోలు చేశారు. దీనిపై కన్నేసిన నలుగురు వ్యక్తులు గ్రామస్తుల కళ్లుగప్పి వారి పేర పట్టా చేయించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. భూమి వారిదేనంటూ హద్దులు పాతరాదని నోటీసులు పంపించారు. ఎలాగైనా తిరిగి గ్రామ అవసరాలకు ఉపయోగపడేలా చూస్తాం. తప్పుడు డాక్యుమెంట్లను చూపించి రికార్డును మార్చిన రెవెన్యూ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. – వెంకట్రామమ్మ, జడ్పీటీసీ సభ్యురాలు, చిన్నంబావి మండలం