అప్పులు తీర్చేందుకు హంతకుడైన కానిస్టేబుల్ హత్య.. దోపిడీలకు సహకరించిన భార్య

అప్పులు తీర్చేందుకు హంతకుడైన కానిస్టేబుల్ హత్య.. దోపిడీలకు సహకరించిన భార్య
  • సిద్దిపేట వ్యాపారి హత్య కేసును ఛేదించిన పోలీసులు
  • వృద్ధురాలి నుంచి బంగారం దోపిడీ
  • దొంగిలించిన బంగారం హైదరాబాద్​లో విక్రయం

సిద్దిపేట రూరల్​, వెలుగు: ఆన్​లైన్​ బెట్టింగుల కోసం చేసిన అప్పు తీర్చేందుకు ఓ కానిస్టేబుల్​ నేరాల బాట పట్టాడు. బంగారు నగల కోసం ఒక వ్యాపారిని హత్య చేయడమే కాకుండా మరో వృద్ధురాలి నుంచి బంగారు ఆభరణాలను చోరీ చేశాడు. ఈ నేరాల్లో అతడి భార్య కూడా పాల్గొనడం గమనార్హం. సిద్దిపేట పట్టణంలో వ్యాపారి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించగా ఈ విషయాలు బయటపడ్డాయి. కేసుకు సంబంధించి వివరాలను సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి వెల్లడించారు. సిద్దిపేటకు చెందిన బెలిదే విశ్వనాథం(48) ఈ నెల 2న వ్యాపార పనిమీద బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. చిన్నకోడూరు పోలీసులు మిస్సింగ్​ కేసు నమోదు చేశారు. 3న రాత్రి రంగనాయక సాగర్ కాలువలో విశ్వనాథం మృతదేహం లభించింది. ఈ హత్య కానిస్టేబుల్ గౌటీ ప్రవీణ్ కుమార్, అతని భార్య రజిత చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రవీణ్ ఆన్లైన్ బెట్టింగులకు అలవాటు పడి సుమారు రూ.36 లక్షల నష్టపోయాడు. ఆ అప్పులు తీర్చేందుకు డబ్బు కోసం హత్య చేయాలనుకున్నారు. విశ్వనాథం దగ్గర గతంలో తీసుకున్న అప్పు డబ్బులు ఇస్తామని చెప్పి ఈ నెల 2న ఎల్లమ్మ ఆలయం వద్దకు రమ్మని పిలిచారు. అక్కడి నుంచి చంద్రాపూర్ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి భార్యాభర్తలు కలిసి అతని కాళ్లు చేతులు కట్టేసి మెడకు వైర్ బిగించి హత్య చేశారు. బంగారు గొలుసు, కడెం, ఐదు ఉంగరాలను దోచుకుని మృతదేహాన్ని రంగనాయక సాగర్ కాలువలో పడవేశారు. 

హైదరాబాద్​లో బంగారం అమ్మి..

హైదరాబాద్‌‌కు వెళ్లి బంగారాన్ని సిద్ధి అంబర్​ బజార్‌‌లోని ఒక ఆభరణాల దుకాణంలో రూ.12 లక్షల 10 వేలకు విక్రయించారు. అందులో రూ.3 లక్షలు తీసుకుని గోనెపల్లికి చెందిన అమర్​ అప్పు తీర్చారు. ఈ దంపతులు పక్కింటి వృద్ధురాలు బొడ్డు నరసవ్వను హాస్పిటల్​కు తీసుకెళ్తామని నమ్మించి కారులో తీసుకెళ్లి ఆమె మెడలో ఉన్న మూడున్నర తులాల బంగారు పుస్తెల తాడును కూడా దోచుకున్నట్లు విచారణలో వెల్లడైంది. ఆ బంగారాన్ని హైదరాబాద్ బేగంబజార్‌‌లో అమ్మి సుమారు రూ.4 లక్షల 80 వేలు రాగా, వాటిని కూడా ఆన్లైన్ బెట్టింగులో కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.